వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. తల్లి వైఎస్ విజయమ్మ ఒక్కటయ్యారా..? ఇప్పటివరకూ నెలకొన్న విభేదాలకు చెక్ పడినట్టేనా? అమ్మా కొడుకు కలిసిపోయినట్టేనా? అని గత కొన్ని గంటలుగా పెద్ద ఎత్తునే మీడియా, సోషల్ మీడియా వేదికగా పెద్ద చర్చే జరుగుతోంది. ఇందుకు కారణం ఈ ఇద్దరూ ఒకే కార్యక్రమంలో పాల్గొనడమే. 2024 ఎన్నికల ముందు నుంచి మనస్పర్థలు ఉన్నాయి. వైసీపీ గౌరవ అధ్యక్షురాలుగా ఉన్న ఆమెను తొలగించడం మొదలుకుని నిన్న మొన్నటి వరకూ జరిగిన పరిణామాల వరకూ కుమారుడికి తల్లి దూరంగా ఉంటూనే వస్తున్నారు. మరీ ముఖ్యంగా ఎన్నికల సమయంలో కనీసం ఒక్క ప్రకటన కూడా కొడుకు గెలుపు కోసం చేయలేదు. వీడియో కూడా రిలీజ్ చేయకపోగా వైఎస్ షర్మిలను ఆదరించాలని ప్రకటన చేయడం పెద్ద సంచలనమే అయ్యింది. వైసీపీ ఘోర పరాజయం పాలవ్వడంలో వైఎస్ షర్మిల కంటే వైఎస్ విజయమ్మ పాత్రే ఎక్కువగా ఉందని తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. ఆ క్రమంలో వైసీపీ శ్రేణులు తిట్టిపోసిన సందర్భాలు కూడా ఉన్నాయి.
ఆస్తి వివాదాల తర్వాత..
ఇక వైఎస్ ఫ్యామిలీలో నెలకొన్న ఆస్తి వివాదాలతో కుటుంబ సభ్యులు రెడ్డికెక్కి ఒకరినొకరు తిట్టిపోసుకోవడం, రెండ్రోజులకోసారి మీడియా ముందుకు రావడం, లేదా ప్రకటనలు, వీడియోల ద్వారా నానా రచ్చే జరిగింది. ఈ విషయంలోనూ వైఎస్ విజయమ్మ, షర్మిల వర్సెస్ వైసీపీ అన్నట్టుగానే పరిస్థితులు నడిచాయి. దీంతో అన్న - చెల్లి, అమ్మ - కొడుకుల మధ్య విభేదాలు తారా స్థాయికి చేరుకున్నాయి. దీంతో వైఎస్ జగన్ ఒంటరి అయ్యారని, ఆయన్ను కుటుంబ సభ్యులు కనీసం పట్టించుకోవట్లేదని కొందరు.. తల్లి, చెల్లిని వదిలేశారని టీడీపీ అండ్ కో పెద్ద ఎత్తునే ప్రచారం చేసింది కూడా. సరిగ్గా ఈ పరిస్థితుల్లోనే కీలక పరిణామం చోటు చేసుకుంది.
ఇదీ అసలు సంగతి..
ముందస్తు క్రిస్మస్, క్రిస్మస్ వేడుకల్లో పాల్గొనడానికి వైఎస్ జగన్ బెంగళూరు నుంచి కడపకు రాగా, వైఎస్ విజయమ్మ అమెరికా నుంచి కడపకు వచ్చేశారు. మంగళవారం వైఎస్ ఘాట్ కు వెళ్లి ఇద్దరూ నివాళులు అర్పించడం, ఆ తర్వాత పులివెందులలోని చర్చిలో కలిసి ముందస్తు క్రిస్మస్ వేడుకల్లో పాల్గొనడం, ఒకరికొకరు క్రిస్మస్ శుభాకాంక్షలు చెప్పుకోవడం, ఎంతో ఆప్యాయంగా పలకరించిన విజయమ్మ దగ్గరికి తీసుకొని ఆశీర్వదించారు. అంతే కుటుంబం మొత్తం కలిసి ఫోటోలు కూడా దిగారు. ఇదంతా మంగళవారం రోజు జరిగింది.
అమ్మతో కేక్ కట్ చేయించి..
బుధవారం రోజు క్రిస్మస్ వేడుకల్లో వైఎస్ కుంటుంబ సభ్యులు పాల్గొన్నారు. పులివెందులలోని సీఎస్‌ఐ చర్చిలో ఘనంగా క్రిస్మస్ వేడుకలు జరిగాయి. తల్లి విజయమ్మ చేయి పట్టుకొని జగన్ కేక్ కట్ చేయించారు. అనంతరం కుటుంబ సభ్యులతో కలిసి జగన్ దంపతులు ప్రార్థనలు చేశారు. మంగళవారం, బుధవారం జరిగిన ఈ సంఘటనలతో ఇన్ని రోజులుగా ఉన్న గొడవలు, కొట్లాటలు, విభేదాలకు ఫుల్ స్టాప్ పడినట్టు అయ్యింది. ఎంతైనా అమ్మ కొడుకులు కదా ఇప్పుడు కాకపోయినా ఎప్పటికైనా ఒక్కటీ అవుతారు. అమ్మయా తల్లి కొడుకు కలిసిపోయారు.. ఇక అంతా ప్రశాంతమే అని ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తూ వైసీపీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. మరి ఇవన్నీ పండుగకు మాత్రమే పరిమితమా..? లేదంటే ఇక అంతా ఒక్కటైనట్టేనా అన్నది తెలియాల్సి ఉంది.