అవును.. టాలీవుడ్ టాప్ హీరోల్లో ఒకరైన అల్లు అర్జున్ మా వాడే అని కాంగ్రెస్ సీనియర్ నేత, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ వ్యాఖ్యానించారు. బన్నీ ఎపిసోడ్ ఎప్పుడు పూర్తి అవుతుందా..? అని అభిమానులు, సినీప్రియులు ఎంతో వేచి చూస్తున్నారు. ఈ క్రమంలోనే ఇక ఎక్కువ కొనసాగింపు అక్కర్లేదు అనుకున్న అల్లు అర్జున్ మామ, కాంగ్రెస్ సీనియర్ నేత కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి హైకమండ్ దృష్టికి ఈ విషయం తీసుకెళ్లి మాట్లాడాలని ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలో సోమవారం నాడు గాంధీభవన్ వెళ్ళారు. ఐతే ఆయనకు మాట్లాడే కనీస సమయం కూడా కాంగ్రెస్ ఇంచార్జీ దీపాదాస్ మున్షీ సమయం ఇవ్వలేదు. దీంతో అవమానంగా భావించిన ఆయన గాంధీ భవన్ నుంచి కోపంగా ఇంటికి వెళ్ళిపోయారు.
కవరింగ్..?
ఈ క్రమంలోనే అల్లు అర్జున్ తరవాత నెలకొన్న కంచర్ల ఎపిసోడ్ తెరపైకి రావడంతో నష్టనివారణ చర్యలకు కాంగ్రెస్ పెద్దలు రంగంలోకి దిగారు. అంతే కాదు బన్నీని సైతం కూల్ చేసేలా ఆ నేతలు మాట్లాడటం గమనార్హం. గాంధీ భవన్ నుంచి మీడియాతో మాట్లాడిన మహేష్ కుమార్ గౌడ్.. మళ్లీ మళ్లీ చెప్తున్నా అల్లు అర్జున్ మీద మాకు ఎలాంటి కక్ష లేదు. అల్లు అర్జున్ మామ కాంగ్రెస్ నాయకుడు, నాకు మిత్రుడు కూడా. ఆయన గాంధీ భవన్ కు వస్తున్నట్లు మాకు తెలియదు. చంద్రశేఖర్ రెడ్డి నాకు కాల్ చేసి కలుద్దాం అన్నారని కంచర్ల విషయానికి క్లోజ్ చేసే ప్రయత్నం చేసారు.
కూల్ అవుతాడా..?
కంచర్ల, అల్లు అర్జున్ విషయంలో తప్పకుండా మేము కలుసుకుంటాం. ఏదైనా సమస్య ఉంటే పరిష్కరించుకుంటాం. అల్లు అర్జున్ మామ మా కాంగ్రెస్ సభ్యుడే అంటే అల్లు అర్జున్ కూడా మా కుటుంబ సభ్యుడే కదా? అల్లు అర్జున్ మామ ప్రభుత్వం నుంచి ఎటువంటి సహాయం కోరిన చేయడానికి మేము సిద్ధం. జరిగిన సంఘటనపై బీఆర్ఎస్, బీజేపీ నేతలు రాజకీయం చేస్తున్నారు. అసెంబ్లీలో సీఎం మాట్లాడిన తరవాత కూడా ప్రతిపక్షాలకు గుర్తు రాలేదు. చిత్రసీమ ఆంధ్రాకు వెళుతుందని చాలా సిల్లీగా మాట్లాడుతున్నారు. అసలు చిత్ర సీమ వచ్చిందే మాకు కాంగ్రెస్ నాయకులు వల్ల అనే విషయం గుర్తు చేసుకోవాలి. చిత్ర సీమకు ఎలాంటి సహాయం కావాలన్నా చేయడానికి మేము ఎప్పుడు సిద్ధమని మహేష్ కుమార్ గౌడ్ చెప్పారు. మొత్తానికి మామ అల్లుడుని కూల్ చేయడానికి కాంగ్రెస్ ప్రయత్నాలు చేస్తోంది. మరి ఎంత వరకూ వర్కవుట్ అవుతుందో చూడాలి మరి.