మోహన్ బాబుకు హైకోర్టు ఝలక్.. ఇక అరెస్టేనా?
టాలీవుడ్ సీనియర్ హీరో మంచు మోహన్ బాబుకు హైకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. తనను అరెస్ట్ చేయకుండా చూడాలని, ముందస్తు బెయిల్ కావాలని ఆయన దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ ను ధర్మాసనం కొట్టేసింది. టీవీ9 జర్నలిస్ట్ రంజిత్‌పై దాడి కేసులో ముందస్తు బెయిల్ కోసం మోహన్‌బాబు పిటిషన్ వేయగా కోర్టు తిరస్కరించింది. సోమవారం నాడు ముందస్తు బెయిల్ పిటీషన్‌పై హైకోర్టులో సుదీర్ఘ వాదనలు ఇరువర్గాలు వినిపించాయి. వాదనల అనంతరం ఈ పిటిషన్ కొట్టేయడం జరిగింది.
ఎవరి వాదనలు ఏంటి..?
మోహన్‌బాబు ప్రస్తుతం తిరుపతిలో ఉన్నట్లు ఆయన తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. అంతకు ముందు దుబాయ్‌లో ఉన్న తన మనువడిని కలిసేందుకు వెళ్లారని లాయర్ కోర్టుకు వినిపించారు. దుబాయ్ నుంచి తిరుపతి తిరిగొచ్చి విద్యా సంస్థల బాధ్యత చూస్తున్నట్లు న్యాయవాది వెల్లడించారు. ఆయన అనారోగ్యంతో ఉన్నాడని ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరిన మోహన్‌బాబు న్యాయవాది న్యాయస్థానాన్ని కోరారు.
ఏమైంది..?
గుండె, నరాల సంబంధిత సమస్యలతో మోహన్‌బాబు బాధపడుతున్నారని కోర్టుకు వినిపించారు. మరోవైపు దాడి ఘటనలో ముందస్తు బెయిల్ ఇవ్వొద్దంటూ అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదనలు వినిపించారు. ఈ క్రమంలోనే ఇరువురి వాదనలు విన్న న్యాయస్థానం బెయిల్ ఇవ్వడానికి కుదరదని, పిటిషన్ కొట్టివేసింది. మరోవైపు ఆయన్ను అరెస్ట్ చేయడానికి పోలీసులు రంగం సిద్ధం చేశారనే వార్తలతో పెద్ద హడావుడి జరుగుతోంది. కోర్టు తీర్పు తర్వాత పోలీసులు ఎలా ముందుకెళతారనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.