గోదాములో నుంచి రేషన్ బియ్యం మాయమైన వ్యవహారం పేర్ని ఫ్యామిలీ మెడకు చుట్టుకున్నది. ఎంతలా అంటే వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి పేర్ని నాని తన ఫ్యామిలీతో సహా అజ్ఞాతంలోకి వెళ్లిపోయే పరిస్థితి. ఇప్పటికే పేర్ని ఫ్యామిలీకి లక్ అవుట్ నోటీసులు జారీ చేసిన పోలీసులు.. తాజాగా శనివారం అర్ధరాత్రి నోటీసులు జారీ చేశారు. పేర్ని ఇంటికి వెళ్ళిన పోలీసులు.. పేర్ని నాని, అతని కుమారుడు పేర్ని కిట్టుకు పోలీసులు నోటీసులు జారీ చేయడం జరిగింది. దీంతో ఈ రేషన్ బియ్యం కేసులో పోలీసుల దర్యాప్తు వేగవంతం పెంచినట్టు అయ్యింది.
ఇంట్లో ఎవరూ లేకపోవడంతో..?
కేసు దర్యాప్తులో భాగంగా తండ్రీకొడుకులు ఇద్దరికీ నోటీసులు జారీ చేసినట్టు పోలీసులు వెల్లడించారు. ఐతే నోటీసులు ఇచ్చేందుకు పేర్ని నాని ఇంటికి వెళ్ళగా.. ఇంట్లో ఎవ్వరూ లేకపోవటంతో ఇంటి తలుపులకు నోటీసులు అంటించారు. ఈ కేసులో నిందితులుగా పేర్ని నాని భార్య జయసుధ, ఆమె వ్యక్తిగత కార్యదర్శి మానస తేజ ఉన్నారు. కేసు దర్యాప్తునకు సహకరించాలని నోటీసుల్లో పోలీసులు పేర్కొన్నారు.
వస్తారా..?
ఆదివారం మధ్యాహ్నం 2 గంటల లోపు మచిలీపట్నం పోలీసు స్టేషన్ వచ్చి.. అసలేం జరిగింది..? అనే దానిపై వాస్తవ విషయాలు చెప్పాలని, అందుబాటులో ఉన్న రికార్డులు ఇవ్వాలని నోటీసుల్లో పోలీసులు స్పష్టంగా పేర్కొన్నారు. మరోవైపు ఈ కేసులో నిందుతులుగా జయసుధ, పీఎ మానస తేజల కోసం పోలీసులు గాలింపు చర్యలు వేగవంతం చేశారు. ప్రత్యేక బృందాలుగా ఏర్పడి గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. ఇప్పటికే ఏ2 మానస తేజ కుటుంబ సభ్యులను స్టేషన్ పిలిచి పోలీసులు విచారిస్తున్నారు. మొత్తానికి చూస్తే ఒకటి రెండు రోజుల్లో ఈ వ్యవహారంలో కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి.