Advertisementt

వారసత్వం నిలబెట్టిన ఏకైక వారసుడు జగన్!

Sat 21st Dec 2024 04:37 PM
hbd ys jagan  వారసత్వం నిలబెట్టిన ఏకైక వారసుడు జగన్!
YS Jagan Mohan Reddy Birthday Special Article వారసత్వం నిలబెట్టిన ఏకైక వారసుడు జగన్!
Advertisement
Ads by CJ

వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పుట్టిన రోజు నేడు (డిసెంబర్ 21). జగన్ రాజకీయ జీవితం ఎన్నో ఆటుపోట్లతో ఉంది. ఆయన వ్యక్తిగత జీవితం ఎంతో స్ఫూర్తివంతంగా ఉంటుంది. వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమారుడు అనే ముద్ర నుంచి ప్రతిపక్ష నేత, రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎదిగిన అతడి ప్రస్థానం ఎంతో ఆదర్శం అని అభిమానులు, కార్యకర్తలు చెప్పుకుంటూ ఉంటారు. దేశ చ‌రిత్ర‌లో వైఎస్ జ‌గ‌న్‌లా దుష్ప్ర‌చారాన్ని, క‌ష్టాల్ని ఎదుర్కొన్న‌, ఎదుర్కొంటున్న మ‌రో నాయ‌కుడు లేరనే చెప్పాలి. ఎవ‌రెన్ని అడ్డంకులు సృష్టించినా ఆయ‌న అడుగులు ముందుకే త‌ప్ప‌, వెన్ను చూపి పారిపోయే స్వ‌భావం కానేకాదని అభిమానులు ధీమాగా చెబుతుంటారు.

 

వైఎస్ మరణం తర్వాత..

వైఎస్ఆర్ మరణం తర్వాత ఉమ్మడి ఆంధ్రపదేశ్ రాష్ట్రంలో ఆగిన గుండెలెన్నో. తమ ఇంట్లో సొంత మనిషే పోయినంతగా గడపగడపా తల్లడిల్లిన తరుణమది. తండ్రిని ప్రేమించే వారున్నారని తెలుసుకానీ, తండ్రి లేడని తెలిస్తే గుండె ఆగిపోయే వారు ఉన్నారని కూడా జగన్ రెడ్డికి అప్పుడే తెలిసింది. వారిని కలవడం, పరామర్శించడం ఆ తండ్రి కొడుకుగా తన బాధ్యత అనుకున్నారు. సరిగ్గా అప్పుడే ఓదార్పు యాత్రకు వస్తున్నట్టు ప్రకటించడం, అది అతడి జీవితాన్ని కాదు, రాష్ట్ర కాలగతినే మలుపు తిప్పిన సందర్భం అని చెప్పుకోవచ్చు. ఓదార్పు యాత్రను నాటి అధిష్టానం వద్దనడం, మాట తప్పని వారసత్వం అందుకు ఎదురు తిరిగింది. అప్పుడే ఇక ప్రలోభాలకు లొంగకుండా పార్టీని, పదవిని వదలి బయటికి వచ్చేశారు జగన్. తండ్రి చూపిన బాటలో నడిచేందుకు సిద్ధమయ్యారు.

 

వైఎస్ ఆశయాలే లక్ష్యాలుగా..

వైఎస్ ఆశయాలే లక్ష్యాలుగా, ఆయన లక్ష్యాలే మార్గదర్శకాలుగా భావించి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని స్థాపించారు జగన్. సరిగ్గా ఇదే సమయంలో వైఎస్ కుటుంబంపై కక్షసాధింపు కూడా మొదలైంది. కేంద్రంలోని కాంగ్రెస్ సర్కార్ కేసులు బనాయించడంతో, జగన్ రెడ్డిని 16 నెలలు జైలుపాలయ్యారు. ఈ క్రమంలోనే రాష్ట్ర విభజన అనివార్యమై నష్టపోతున్న ఆంధ్ర రాష్ట్రం తరఫున నిలిచి ప్రత్యేక హోదా కోసం పోరాడారు. నవ్యాంధ్రలో జరిగిన తొలి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి కురువృద్ధ పార్టీని మట్టి కరిపించారు. జైలుకు వెళ్లడం, 2014 ఎన్నికల్లో ఓటమిపాలు కావడం.. ఇలా చాలా సంఘటనలు వైఎస్ జగన్ జీవితంలో జరిగినా ఓటమిలోనూ అతడు కుంగిపోలేదు. దేశంలో ఎంతో మంది తండ్రులు ముఖ్యమంత్రులు ఐనా వారసత్వం అతి తక్కువ మందికి దక్కింది.. నిలబెట్టుకోగలిగారు. ఇందులో వైఎస్ జగన్ తొలి వరుసలో, మొదటి లీడర్ అని చెప్పుకోవడంలో ఎలాంటి అతియోక్తి అక్కర్లేదు ఏమో..!

 

ఇదొక మైల్ స్టోన్..

జగన్ రాజకీయ జీవితంలో ప్రజా సంకల్ప పాదయాత్ర అనేది ఒక మైల్ స్టోన్ అని చెప్పుకోవచ్చు. వందల కిలోమీటర్లు నడిచినా అతడికి అలుపు రాలేదు.. అది ప్రజలు అతనికి అందించిన బలం. కష్టాలను ఎదిరించడంలో ఆయన మొండి వాడు, మాట నిలబెట్టుకోవడంలో మొనగాడు అందుకే జన హృదయాల్లో ఆ యువనేతపై అంతటి అభిమానం అని ఫ్యాన్ పార్టీ నేతలు చెబుతుంటారు. ఆ అభిమానమే రేపటి రాజకీయ విజయాలకు కొలమానం. నవరత్నాల నిర్మాణానికి తార్కాణం.

 

చారిత్రాత్మక గెలుపు

వైఎస్ చనిపోయాక ఒకే ఒక ఎంపీగా ఉన్న జగన్.. పార్టీ పెట్టాక ఒక ఎంపీ ఒక ఎమ్మెల్యే మాత్రమే ఉన్నారు. అనంతరం జరిగిన ఉప ఎన్నికల్లో 17 మంది అయ్యారు. ఇక 2014లో 67 సీట్లు రావడం, పార్టీ అధికారంలోకి రాకపోవడంతో ఒకరు ఇద్దరూ కాదు ఏకంగా 23 మంది ఎమ్మెల్యేలు వైసీపీని వదిలి టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. సరిగ్గా ఐదేళ్లలో 151 ఎమ్మెల్యే సీట్లతో రికార్డు సృష్టించారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇదొక చారిత్రాత్మక గెలుపు. అధికారంలోకి రాగానే మేనిఫెస్టోను భగవద్గీత భావించిన జగన్ నవరత్నాలు అమలు చేసి రాష్ట్ర ప్రజల్లో చిరస్థాయిగా నిలిచిపోయేలా గుర్తింపు తెచ్చుకున్నారు. ఐతే.. 2024 ఎన్నికల్లో మాత్రం ఘోరాతి ఘోరంగా 11 సీట్లకే పరిమితం కావడం ఆయన అభిమానులు, కార్యకర్తలు జీర్ణించుకోలేని విషయం.

 

వంద కారణాలు..

కర్ణుడు చావుకి వంద కారణాలు అంటారు కదా.. అలాగే వైసీపీ పరాజయంకు ఎన్నో కారణాలు ఉన్నాయి. జగన్ అనుసరించిన విధానాలు, అధికారులు చేసిన తప్పిదాలు.. అధికారంలోకి వచ్చిన తరువాత ప్యాలెస్ కే పరిమితం కావడం, కోటరిని కట్టి ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు సైతం నేరుగా అధినేతను కలవలేని పరిస్థితులు. దీనికి తోడు వలంటర్ వ్యవస్థ, బటన్ నొక్కుడు తప్పితే రాష్ట్రంలో అభివృద్ధి లేదన్న ఆరోపణలు, నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించకపోవడం, రాష్ట్రంలో పెట్టుబడులు ఆశించిన స్థాయిలో రాకపోవడం, ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో ఉద్యోగాల భర్తీ సాధ్యం కాకపోవడం, నాసిరకం మద్యం విక్రయాలు, ఇసుక విధానం, క్షేత్ర స్థాయిలో పనిచేసే కార్యకర్తలను, కింది స్థాయి నాయకులను పట్టించుకోకపోవడం, అన్నింటి కంటే ముఖ్యమైనది ప్రభుత్వ ఉద్యోగుల వ్యతిరేకత, సిపిఎస్ అమలు చేయకపోవడం, ఉద్యోగులను ఇబ్బందులకు గురి చేసేలా వ్యవహరించడం, కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించకపోవడం, ప్రతీకార రాజకీయాలకు పాల్పడడం, ప్రత్యర్థులను మంత్రులు ఇష్టానుసారంగా మాట్లాడడం, మరీ బరితెగించి బూతులు మాట్లాడిన వారు ఉన్నారు. వీటన్నిటికి తోడు సంక్షేమ పథకాలను అమలు చేస్తే చాలు అన్న భావన జగన్ రెడ్డిని ఘోరంగా దెబ్బతీసింది అన్న విశ్లేషణలు ఉన్నాయి. ఓటమి తర్వాత నేతలు జంపింగ్స్, క్యాడర్ విడిపోవడంతో గందరగోళం నెలకొంది. దీంతో మళ్ళీ క్యాడర్ ను గాడిన పెట్టేందుకు వరుస సమావేశాలు, జిల్లా, నియోజకవర్గ ఇంఛార్జీల నియామకం అంటూ సెట్ రైట్ చేస్తున్నారు అధినేత. ఆయనకు సవాళ్లు కొత్త కాదు, ఇలాంటి ఓటములు అంతకు మించి కొత్తేమీ కాదు.

YS Jagan Mohan Reddy Birthday Special Article:

Happy Birthday to YS Jagan Mohan Reddy

Tags:   HBD YS JAGAN
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ