ద్వేషం చెక్కిన శిల్పం.. హేళన మలిచిన మణిపూస. గత పదేళ్ళ కాలంలో తను ఎదుర్కొన్నంత వ్యతిరేకత, అవహేళన, దుష్ప్రచారం మరెవరూ ఎదుర్కొని ఉండరు. అయినా సరే, పోగొట్టుకున్న చోటే వెతుక్కుని తీరాలనే మొక్కవోని దీక్షతో తనంతట తను స్వయంగా, పళ్ళ బిగువున అవమానాలు సహించి, పోరాడి సాధించుకున్న స్థానం ఇది. ఇదంతా ఎవరి గురించి అనేది ఈ పాటికే అర్థమైపోయి ఉంటుంది కదా. ఆయనేనండోయ్ యంగ్ అండ్ డైనమిక్ లీడర్ నారా లోకేశ్. యువనేత ఇలా తయారవ్వడానికి కారణం ఒకే ఒక్కటే యువగళం పాదయాత్ర. ఈ దెబ్బతో పాదయాత్రకు ముందు ఆ తర్వాత అన్నట్లుగా పరిస్థితులు ఏర్పడ్డాయి. రాష్ట్ర చరిత్రలో పాదయాత్ర అనేది చెరిగిపోని యువసంతకంగా మిగిలిపోయింది. ఈ చారిత్రాత్మక పాదయాత్రను జనాలు ఇప్పట్లో కాదు కదా ఒక 20, 30 ఏళ్లు కూడా మరిచిపోలేరేమో. అందుకే ఆయన అభిమానులు ఎవరి దయాభిక్ష అనో, వారసత్వం పేరుతోనో తనను ఇంకా కూడా ఎవరైనా ఏమైనా నోరు జారితే, పళ్ళు రాలిపోతాయి, చెంపలు పగుల్తాయి జాగ్రత్త అని విమర్శకులు, ప్రత్యర్థులను హెచ్చరిస్తున్న పరిస్థితి.
లోకేశ్ 2.0!
వాస్తవానికి నారా చంద్రబాబు వారసుడిగా లోకేశ్ రాజకీయ అరంగేట్రం చేసింది మొదలుకుని, 2024 ఎన్నికల ముందు వరకూ ఆయన్ను తిట్టని తిట్టు లేదు.. విమర్శించని నోరు లేదు. 2019 ఎన్నికల్లో టీడీపీ ఘోర పరాజయం పాలవ్వడం, కరోనా పరిస్థితులు ఆయన్ను పూర్తిగా మార్చేశాయి. అప్పటి వరకూ ఆయన్ను పప్పు అని, తుప్పు అని ఇలా ఒకటా రెండా లెక్కలేనన్ని పేర్లు పెట్టి విమర్శించారు. అంతకుమించి ఆరోపణలు చేశారు. ముఖ్యంగా తన బాడీ షేమింగ్ నుంచి బయటికి రావడానికి కరోనా సమయంలో ఆయన పడిన కష్టం అంతా ఇంతా కాదు. అదంతా కేవలం ఆయన భార్య నారా బ్రాహ్మణికి మాత్రమే తెలుస్తుంది. దీంతో పాటు ప్రసంగాలు, పదజాలం ఇవన్నీ ఒక్కసారిగా మారిపోయాయి. ఒక్క మాటలో చెప్పాలంటే లోకేశ్ 2.0 అన్నట్టుగా మారిపోయారు. తానేంటో నిరూపించుకోవాలని భావించిన యువనేత.. తండ్రి స్పూర్తితో, వైసీపీ ప్రభుత్వం వల్ల బాధపడుతున్న, ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారికి అండగా నిలవాలని భావించి యువగళం పాదయాత్రకు పూనుకున్నారు. ఈ పాదయాత్రే లోకేశ్‌ను, టీడీపీ, రాష్ట్ర చరిత్ర గతినే మలుపు తిప్పింది. అడుగడుగునా ప్రతిబంధకాల నడుమ నాటి పాలకుల కుట్రలు, కుతంత్రాలను ఛేదిస్తూ జరిగిన ఆ పాదయాత్ర ముగిసి నేటికి సరిగ్గా ఏడాది పూర్తయ్యింది.
అవహేళన నుంచి ఔరా అనేంతలా..!
జనవరి 27న 2023న కుప్పం నుంచి ప్రారంభమైన పాదయాత్ర డిసెంబర్ 18, 2023న విశాఖ జిల్లా ఆగనంపూడి వద్ద ముగిసింది. మొత్తం 226 రోజులు, 3,136 కిలోమీటర్లు, 11 ఉమ్మడి జిల్లాలు, 97 నియోజకవర్గాలు, 232 మండలాలు, 2028 గ్రామాలు ప్రతి హృదయానికి, మానవత్వపు స్పర్శనిచ్చింది యువనేత పాదయాత్ర. ఈ పాదయాత్రలోనూ ఎన్నో అవమానాలు, చీదరింపులు, ఆరోపణలు వచ్చినా వాటన్నింటినీ ఎదుర్కొని ముందుకెళ్లారు. ఆఖరికి పాదయాత్రకు వస్తున్న ఆదరణను తట్టుకోలేక అడ్డుకోవాలని చూసినా ధైర్యంగా ఎదురొడ్డి ముందుకెళ్లారు. అలా ఎన్నో సమస్యలకు భరోసా ఇస్తూ, ఎన్నో హామీలతో ముందుకెళ్లారు. యువగళం పాదయాత్ర యువనేత లోకేశ్ ఒక్కడి గొంతుక కానే కాదు.. 5 కోట్ల ప్రజల అంతరంగాన్ని ప్రతిబించింనే సింహగర్జన అని తెలుసుకోవడానికి నాటి పాలకులకు ఎక్కువ సమయం పట్టలేదు. ఎందుకంటే అంతలా ప్రజల నుంచి ఆదరణ యువనేతకు లభించింది. సీన్ కట్ చేస్తే టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత నాడు పాదయాత్రలో ఇచ్చిన హామీలన్నింటినీ కేవలం ఆరు నెలల్లోనే హామీలను నెరవేర్చిన అసలైన ప్రజానేతగా నిరూపించుకున్నారు. చూశారుగా అవహేళన నుంచి ఔరా అనేంతలా తానేంటో నిరూపించుకున్నారు యువనేత.
ఒకే ఒక్కడు..
యువగళం పాదయాత్ర ఒక ఎత్తయితే.. నారా చంద్రబాబు అరెస్ట్ లోకేశ్ అతి పెద్ద టాస్క్ అయ్యింది. ఇక టీడీపీ పనైపోయింది, చంద్రబాబుకు బయటికి వచ్చే పరిస్థితి ఏ మాత్రం లేదని, ఇక లోకేశ్ లేడు, పార్టీ కూడా ఉండదు అంటూ విమర్శించిన నోళ్లు ఎన్నెన్నో. అయితే ఎక్కడా డీలా పడలేదు. ఒకే ఒక్కడై అటు ఢిల్లీలో కేంద్రంలోని పెద్దలతో.. ఇటు రాష్ట్రంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌తో వరుస చర్చలు జరపడం, మరోవైపు సిద్ధార్థ్ లూథ్రా లాంటి పేరుగాంచిన లాయర్‌ను నియమించడం నాన్నను బయటికి తీసుకురావడానికి ఆయన చేసిన ప్రయత్నాలు మాటల్లో చెప్పలేం.. రాతల్లో రాయలేం. పార్టీని, క్యాడర్‌ను కాపాడుకుంటూ ఎవరికేం కష్టం వచ్చినా సరే ముందుండి చూసుకుంటూ వచ్చారు. అలా క్యాడర్‌ను మొత్తం అక్కున చేర్చుకున్నారు. అంతే రీతిలో క్యాడర్ నుంచి కూడా మంచి సపోర్టు వచ్చింది. పాదయాత్ర, చంద్రబాబు అరెస్ట్ ఈ రెండు సంఘటనలు లోకేశ్‌ను రాటుదేలేలా చేశాయి. చివరికి ఎన్డీఏ కూటమిలో చేరికపై కూడా కీలక పాత్రే పోషించారు యువనేత. ఇక అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజా దర్బార్ నిర్వహించడంతో లోకేశ్ ఒక ఎత్తుకు ఎదిగారని చెప్పుకోవచ్చు. పాదయాత్రలో యువనేత ఇచ్చిన హామీలన్నీ ఒక్కొక్కటిగా నెరవేర్చే దిశగా ప్రజాప్రభుత్వం, ముఖ్యంగా నారా లోకేశ్ అడుగులు వేస్తున్నారు.
రెడ్ బుక్‌తో..
పాదయాత్రలో ఆయన ఇచ్చిన హామీల అమలుకు కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేసిన యువనేత.. ఇందుకోసం ప్రత్యేక యంత్రాంగాన్ని కూడా ఏర్పాటు చేశారు. ఇక రెడ్ బుక్ గురించి అయితే ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. వైసీపీ పాలన మొదలైన రోజు నుంచి దిగిపోయేంతవరకూ టీడీపీ క్యాడర్, తనను, తన తండ్రిని ఇబ్బంది పెట్టిన అధికారులు, నేతలను ఏ ఒక్కరినీ వదలకుండా తగు శిక్షలు విధించేలా కార్యాచారణ అయితే షురూ అయ్యింది. అందుకే మీరు కుర్చీలో కూర్చుని, పకడ్బందీగా పూర్తి ఆధారాలు సేకరించిన తర్వాత మాత్రమే రెడ్ బుక్ తెరవండి సార్ ఒక్కొక్కడికీ దూల తీరిపోవాలి అని పదే పదే యువనేత అభిమానులు చెబుతూ ఉంటారు. విమర్శలు వచ్చినా సరే ఇదే కరెక్ట్ రూలింగ్ అని కొందరు రాజకీయ విశ్లేషకులు సైతం చెబుతున్న పరిస్థితి. మరోవైపు పోలీసు వలయాలు, పరదాల మాటున కాకుండా అనుక్షణం ప్రజల్లో ఉంటూ వారి కష్టసుఖాల్లో పాలుపంచుకునే వాడే ప్రజానాయకుడని ఆచరణాత్మకంగా నిరూపిస్తున్న యువకెరటం లోకేశ్ నేటితరం రాజకీయ నాయకులకు స్ఫూర్తిగా నిలుస్తున్నారని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదేమో.