సంధ్య థియేటర్ సంఘటనలో అరెస్ట్ అయ్యి బయటికొచ్చిన టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. మెగా బ్రదర్స్ మెగాస్టార్ చిరంజీవి, నాగబాబు ఇంటికి వెళ్లి మరీ కలిశారు. అంతకు ముందు బన్నీ ఇంటికి వచ్చిన సినీ ప్రముఖులు, దర్శకులు, నిర్మాతలు, జూనియర్ ఆర్టిస్టులు ఇలా ఎంతో మంది కలిసి పరామర్శించారు. మరికొందరు ఫోన్ చేసి మాట్లాడి ధైర్యం చెప్పారు. ఏపీ సీఎం చంద్రబాబు కూడా అల్లు అరవింద్ కు ఫోన్ చేసి మాట్లాడారు.
ఏం జరుగుతుందో..!
అంతా ఓకే కానీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాత్రం హైదరాబాద్ వచ్చినా బన్నీని కలవలేదు. అల్లు అర్జున్ కూడా ఆయన్ను కలవలేదు. ఆ తరవాత విజయవాడ వెళ్లి కలుస్తారని వార్తలు వచ్చాయి కానీ అదేమీ జరగలేదు. ఐతే ఇప్పుడు పవన్ కళ్యాణ్ హైదరాబాద్‌కు వస్తున్నారు. దీంతో ఒకరినొకరు కలుస్తారా లేదా..? అల్లు అర్జున్‌ను పవన్ కలుస్తారా..? లేదంటే పవన్ కళ్యాణ్‌నే బన్నీ వెళ్లి కలుస్తారా..? అసలు కలిసే అవకాశం ఉందా లేదా అని అభిమానులు, సినీ ప్రియులు చర్చించుకుంటున్నారు.
ఎందుకు.. ఏమైంది..!
ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో మెగా ఫ్యామిలీ మొత్తం పిఠాపురం వెళ్ళడం.. పవన్ కళ్యాణ్ కోసం ఎన్నికల ప్రచారం నిర్వహించింది. ఆఖరికి చిరు కూడా ట్విట్టర్ వేదికగా పవన్ గెలుపు కోసం కృషి చేశారు. ఐతే బన్నీ మాత్రం తన మిత్రుడు, నంద్యాల వైసీపీ అభ్యర్థి శిల్పా రవి కోసం నంద్యాలకు వెళ్లి మరీ మద్దతు పలికారు. దీంతో మెగాభిమానులు, జనసైనికులు ఆగ్రహంతో రగిలిపోతున్నారు. దీనికి తోడు ఆ మధ్య నాకు నచ్చితే ఎంతవరకైనా వస్తాను అని ఒక డైలాగ్ పేల్చారు బన్నీ. దీంతో మరింత అగ్గికి ఆజ్యం పోసినట్టు అయ్యింది. అప్పటి నుంచి మెగా.. అల్లు కుటుంబాలు కూడా కలవలేదు.. దీంతో ఎవరి దారి వారిదే అన్నట్టుగా పరిస్థితులు నెలకొన్నాయి.
చడీ, సప్పుడు లేదే!
ఈ రెండు కుటుంబాల్లో ఇప్పుడిప్పుడే అన్నీ సర్డుకుంటున్నాయి. దీంతో పవన్ - అల్లు అర్జున్ కలుస్తారా? లేదా? అనేదానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఇప్పటివరకు మెగా బ్రదర్స్ ఇద్దర్నీ కలవడంతో డిప్యూటీ సీఎంను కూడా కలుస్తారని అంతా భావిస్తున్నారు కానీ.. ఆయన అరెస్టుపై కానీ, బెయిల్ పైన రిలీజ్ అయ్యాక కానీ పవన్ నుంచి ఫోన్ వచ్చినట్టు కానీ, కనీసం ట్వీట్ కూడా చేసిన దాఖలాలు లేవు. దీంతో బన్నిపై ఇంకా కోపం సేనానికి తగ్గలేదని మెగాభిమానులు అనుకుంటున్నారు. ఈ క్రమంలోనే పవన్ హైదరాబాద్ వస్తున్నారు. ఐకాన్ స్టార్ అరెస్ట్ అయినప్పటి నుంచి పవన్ ఇక్కడికి రావడం ఇది రెండోసారి. ఈ సారైనా ఈ ఇద్దరి కలయిక ఉంటుందా లేదా అని అటు మెగాభిమానులు.. ఇటు అల్లు అర్జున్ ఆర్మీ.. మధ్యలో జనసైనికులు వేయి కళ్ళతో ఎదురు చూస్తున్నారు. ఏం జరుగుతుందో చూడాలి మరి.