టాలీవుడ్ హీరో అల్లు అర్జున్ కు హైకోర్టులో ఊరట దక్కింది. ఆయనకు మధ్యంతర బెయిల్ మంజూరు మంజూరు చేస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీచేసింది. నటుడు అయినందు వల్లే అతడిని ఇరికించొచ్చా..? అని ప్రభుత్వంపై, పోలీసులపై హైకోర్టు ఒకింత కన్నెర్రజేసింది. అతనికి కూడా జీవించే హక్కు, స్వేచ్ఛ ఉందని, ఒకరు చనిపోవడం తమకు కూడా బాధగా ఉందని న్యాయస్థానం వ్యాఖ్యానించింది. ఈక్రమంలో వ్యక్తి గత పూచికత్తులతో హైకోర్టు బెయిల్ మంజూరు చేయడం జరిగింది.
జైలు సూపరిటెండెంట్ వారికి షూరిటీలు సమర్పించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ముఖ్యంగా ఆర్ణబ్ గోస్వామి తీర్పు ఆధారంగా బన్నీకి హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ఈక్రమంలో ఇప్పుడు ఇచ్చింది కేవలం మధ్యంతర బెయిల్ మాత్రమేనని, రెగ్యులర్ బెయిల్ నాంపల్లి కోర్టులో దాఖలు చేసుకోవాలని హైకోర్టు వ్యాఖ్యానించింది. కాగా.. మధ్యంతర బెయిల్ నాలుగు వారాలు మాత్రమే.
నిరంజనా మజాకా..?
నిరంజన్ రెడ్డి.. అల్లు అర్జున్ తరపున హైకోర్టులో వాదనలు వినిపించిన ప్రముఖ న్యాయవాది. నిర్లక్ష్యం వల్ల జరిగిన హత్య అనడం కరెక్ట్ కాదని గట్టిగానే వాదనలు వినిపించారు. ఈ క్రమంలో ఒకటి కాదు నాలుగైదు కేసులను ప్రస్తావించి మరీ వాదించారు. ముఖ్యంగా షారుక్‌ఖాన్ కేసు, ఆర్ణబ్ గోస్వామి, ఏపీలో జరిగిన పుష్కరాల ఘటన ఈ మూడు ప్రస్తావించడం.. ఎప్పుడేం జరిగింది అనే విషయాలను వాదించడంతో అటు పోలీసులు, ప్రభుత్వం తరఫున పీపీ (పబ్లిక్ ప్రాసిక్యూటర్) నోరెళ్లబెట్టిన పరిస్థితి నెలకొంది. అంతేకాదు బన్నీకి ఎలాంటి సంబంధం లేదని విషయాన్ని బల్లగుద్ది మరీ వినిపించారు. దీంతో నిరంజనా మజాకా అంటూ బన్నీ అభిమానులు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు.
మరికొన్ని వాదనలు..
తొక్కిసలాట సమయంలో అల్లు అర్జున్ ఫస్ట్ ఫ్లోర్‌లో ఉన్నాడు. కానీ, గ్రౌండ్ ఫ్లోర్‌లో తొక్కిసలాట జరిగింది. అక్కడ ఆమె చనిపోయింది. (ఆర్నాబ్ గోస్వామి కేసును కోట్ చేస్తూ) ప్రస్తుత పరిస్థితుల్లో మధ్యంతర బెయిల్ ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నాను. నిర్మాత కూడా థియేటర్‌కు హీరో వస్తున్నట్లు లేఖ రాశారు. గతంలో ఏపీలో పుష్కరాల సమయంలో ఇలాంటి ఘటనే జరిగింది. అప్పుడు సీఎంగా చంద్రబాబు అక్కడే ఉన్నారు. తొక్కిసలాట కారణంగా 35 మంది మరణించారు. ఆ సందర్భంగా లో అక్కడ ఉన్న వారిని అరెస్ట్ చేయలేదు కదా..? అని నిరంజన్ రెడ్డి వాదించారు.
సంచలనం కోసమే..
నిర్లక్ష్యం వల్ల జరిగిన హత్య అనడం కరెక్ట్ కాదు. తాము బాధ్యులం కాబోమని పోలీసులు అంటున్నారు. ఇతరుల్ని మాత్రం బాధ్యుల్ని చేస్తున్నారు. అల్లు అర్జున్ విచారణకు సహకరిస్తారు. సంచలనం కోసమే ఆయన్ను అరెస్ట్ చేశారని నిరంజన్ రెడ్డి కోర్టుకు వాదనలు వినిపించారు. ఈ క్రమంలో పిటిషనర్‌ను వదిలేయాలా? పిటిషన్‌ను కొట్టేయాలా..? అని పీపీని హైకోర్టు ధర్మాసనం ప్రశ్నించినది. ఈ క్రమంలో ఇరువైపులా సుదీర్ఘ వాదనలు విన్న న్యాయస్థానం.. జరిగిన ఘటనలో అల్లు అర్జున్ పాత్ర లేదని స్పష్టమవుతోందని చెప్పింది. బన్నీని వెంటనే విడుదల చేయ్యాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు.. జైలు సూపరిడెంట్ వారికి కూడా వెంటనే అతడిని విడుదల చేయాలని ఆదేశించింది. దీంతో బన్నీకి బిగ్ రిలీఫ్ దక్కినట్టు అయ్యింది.