వైసీపీలో రాలుతున్న వికెట్లు.. గ్రంథి రాజీనామా
ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన తరువాత వైసీపీకి వరుస ఎదురుదెబ్బకు కంటిన్యూగా తగులుతూనే ఉన్నాయి. ఇప్పటికే పలువురు కీలక నేతలు, వైఎస్ జగన్ రెడ్డికి అత్యంత సన్నిహితులు పార్టీకి రాజీనామా చేసి వేరే పార్టీల్లో చేరిపోయారు. ఐతే గురువారం ఒక్కరోజే వైసీపీకి డబుల్ షాక్ తగిలింది. మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ రాజీనామా చేసిన గంట వ్యవధిలోనే వైసీపీ రాజీనామా చేస్తున్నట్టు మాజీ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ రాజీనామా చేశారు. వైసీపీ ప్రాథమిక సభ్యత్వానికి, పార్టీ పదవులకు రాజీనామా చేసిన ఆయన, తన రాజీనామా లేఖను అధినేతకు పంపారు. ఒకేరోజు తగిలిన దెబ్బలతో వైసీపీ అధిష్ఠానం కంగుతిన్నది.
విద్యార్థి దశలోనే..
విద్యార్థిదశలోనే రాజకీయాల్లో వచ్చిన గ్రంథి శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీతో అరంగేట్రం చేశారు. ఆ తర్వాత రెడ్డి కాంగ్రెస్, జనతాపార్టీలో పని చేశారు. 1995లో భీమవరం అర్బన్ బ్యాంక్ అధ్యక్షుడిగా వివిధ హోదాల్లో పనిచేసి 2004లో భీమవరం నుంచి గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత 2009లో ప్రజారాజ్యం పార్టీలో చేరారు, కానీ టికెట్ దక్కలేదు. ఆ తర్వాత 2011లో వైసీపీలో చేరారు. పార్టీ ఆవిర్భావం నుంచి ఇప్పటివరకూ వైసీపీలో ఉంటూ వస్తున్నారు.
అదొక సంచలనమే..
2014లో జరిగిన ఎన్నికల్లో పోటీ చేసి ఓడినా, 2019లో ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భీమవరం నుంచి పోటీ చేయగా ఆయనపై గ్రంథి 8357 ఓట్ల మెజారిటీతో గెలిచారు. అప్పట్లో ఇదొక సంచలనం. అంతేకాదు అటు గాజువాకలో కూడా పోటీ చేసిన పవన్.. ఇక్కడ, అక్కడ రెండు చోట్లా ఓటమిపాలయ్యారు. రెండు చోట్లా వైసీపీ అభ్యర్థులు గెలవడం పెను సంచలనం అయ్యింది. ఐతే 2024 ఎన్నికల్లో మాత్రం గ్రంథి గట్టిగానే ప్రయత్నించినా ఫలితం మాత్రం రివర్స్ అయ్యింది.
టీడీపీలోకి!
ఇవన్నీ ఒక ఎత్తయితే ఈ మధ్య గ్రంథి ఇంటిపై ఐటీ రెయిడ్స్ జరగ్గా గట్టి దెబ్బే పడింది. ఒకటి కాదు రెండు కాదు వరుసగా ఐదు రోజుల పాటు జరిగిన ఈ సోదాల్లో కీలక పత్రాలు, నగదు కూడా పట్టుబడిందని సమాచారం. దీంతో ఆర్థికంగా కూడా చితికిపోయిన గ్రంథి అధికారంలో ఉన్న పార్టీలో చేరితే కాస్తో కూస్తో సంపాదించుకోవచ్చ నే ఆలోచనలో ఉన్నట్టు తెలిసింది. ఎలాగో జనసేనలో చేరే అవకాశం లేదు. పైగా ఈ నియోజవర్గం ఎమ్మెల్యే జనసేన వ్యక్తి కావడంతో, ఒకవేళ వెళ్లినా రేపొద్దున్న పోటీ చేయడానికి వీలు కాదు. అందుకే టీడీపీ తీర్థం పుచ్చుకునే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఒకటి రెండు రోజుల్లో భవిష్యత్ కార్యాచరణ ప్రకటించే ఛాన్స్ ఉంది.