జగన్ రెడ్డికి ఇప్పటికైనా తెలిసొచ్చిందా..?
దీపం ఉండగానే ఎవరైనా సరే ఇల్లు చక్కబెట్టుకోవాలని అనుకుంటారు. అంటే అర్థం ఏంటో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు అనుకుంటా..! ఎందుకో ఈ విషయంలో వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తప్పడగులు వేశారన్నది ఇప్పుడు నడుస్తున్న టాక్. ఒకప్పుడు సంగతి పక్కనపెడితే ఇప్పుడు మాత్రం గట్టిగానే జగన్ గురుంచి సొంత అభిమానులు, కార్యకర్తలు విభిన్న రకాలుగా అనుకుంటున్న పరిస్థితి. ఇంతకీ అసలు విషయం చెప్పకుండా ఈ సోదంతా ఏంట్రా అబ్బా అనుకుంటున్నారు కదూ.. అక్కడికే వస్తున్నా కాస్త ఓపికతో చదివేయండి.
నాడు చంద్రబాబు..
రాజకీయాల్లో ఏం చేసినా చాలా ఆచి తూచి అడుగులు వేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఏ మాత్రం తేడా కొట్టినా అంతే సంగతులు. అదే సమయంలో అదిగో పలానా పని చేసి ఉంటే లేదా చేయకపోయినా ఈరోజు ఈ పరిస్థితి వచ్చేది కానే కాదు కదా అని గెలుపు, ఓటములు వచ్చినప్పుడు కచ్చితంగా గుర్తుకొస్తాయి. ఇందులో ఎవరేం తక్కువ కాదు. వైఎస్ జగన్ పరిస్థితి కూడా అదే. చంద్రబాబు అధికారంలో ఉన్నా లేకున్నా సరే నారా లోకేశ్ అభిమానులు ముద్దుగా పిలుచుకునే చినబాబుకు తగిన ప్రాధాన్యత ఇస్తూ వస్తున్నారు. అధికారంలో ఉన్నప్పుడు కీలక శాఖలు, లేనప్పుడు మాత్రం నంబర్ - 2 పదవిలో ఉంటూ వచ్చారు. నాడు మంగళగిరి నుంచి ఓడినా మంత్రి పదవే.. ఇప్పుడు గెలిచినా మంత్రి పదవే. ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది అంటే బాబు వారసుడు, బాబు తర్వాత సర్వం ఆయనే గనుక విమర్శలు అంతకు మించి లేనిపోని ఆరోపణలు వచ్చినా సరే ఆయన చేయాలనుకున్నది చేసి చూపించారు అంతే. సీన్ కట్ చేస్తే యువగళం పాదయాత్రతో రాటుదేలిన లోకేశ్.. ఇప్పుడు ఏ రేంజిలో ఉన్నారో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు.
నేడు పవన్ కళ్యాణ్..
ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా చంద్రబాబు బాటలో ఇప్పుడిప్పుడే నడుస్తున్నారు. జనసేన పార్టీ ఆవిర్భావం నుంచి నిన్న మొన్నటి వరకూ ఉన్న ప్రధాన కార్యదర్శి పదవితోనే ముందుకు నెట్టుకుంటూ వస్తున్నారు. 2019 ఎన్నికల్లో నరసాపురం నుంచి పోటీ ఘోర పరాజయం పాలయ్యారు. ఆ తర్వాత పార్టీని బలోపేతం చేసుకుంటూ తమ్ముడు పవన్ కల్యాణ్‌కు సూచనలు, సలహాలు ఇస్తూ నేతలు, కార్యకర్తల మధ్య ఎలాంటి పొరపచ్చాలు
లేకుండా చూసుకుంటూ వస్తున్నారు. ఆఖరికి 2024 ఎన్నికల్లో అటు అనకాపల్లి, ఇటు విశాఖపట్నం పార్లమెంట్ స్థానాల్లో ఏదో ఒక చోటు నుంచి పోటీ చేయాలని భావించినా వర్కవుట్ కాలేదు. ఆ తర్వాత ఎమ్మెల్యేగా కూడా పోటీ చేసే అవకాశమే లేకుంది. దీంతో టీటీడీ చైర్మన్ పదవి దక్కుతుందని భావించినా అదీ లేదు. ఆఖరికి పెద్దల సభ, రాజ్యసభకు ఎంపీగా పంపాలని భావించారు కానీ ఈయన సీటును గద్దలా వచ్చి బీసీ జాతీయాధ్యక్షుడు ఆర్. కృష్ణయ్య ఎగరేసుకుని పోయారు. దీంతో ఆది నుంచే త్యాగాలకు అలవాటు పడిన నాగబాబు త్యాగమూర్తిగా, జనసేనను త్యాగాల సేనగా అందులోనూ అభిప్రాయాలు వచ్చేశాయ్. ఐతే అన్నను అటు ఢిల్లీకి పంపడానికి శాయశక్తులా ఢిల్లీ వేదికగా చక్రం తిప్పినా ప్రయోజనం లేకుండా పోయింది. దీంతో అన్నను హస్తిన పంపడం మానేసిన తమ్ముడుని అమరావతికి ఫిక్స్ చేశారు. నాగబాబుకు మంత్రి పదవి ఇవ్వబోతున్నట్టు అధికారికంగా ప్రకటించడం జరిగిపోయింది.
తెలుసుకోవాల్సిందే..
అటు చంద్రబాబు కుమారుడికి, ఇటు పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబుకు పదవులు కట్టబెట్టుకున్నారు. జగన్ రెడ్డికి ఈపాటి తెలివి ఎందుకులేదు..? వైఎస్ షర్మిలకు వైసీపీ గెలిచిన తర్వాత ఏదో ఒక పదవి ఇచ్చి ఉంటే ఇంత రచ్చ జరిగేది కాదు కదా. అవకాశం దొరికితే తన కుటుంబ సభ్యులు, పార్టీకి నంబర్ -2 గా ఉన్న అందరికీ పదవులు ఇచ్చి సంతృప్తి పరిచేలా షర్మిల ఏదో ఒక పదవి ఇచ్చి ఉంటే ఏ గొడవా ఉండేది కాదు. అందులోనూ షర్మిల ఏమీ పార్టీకి, అన్నకు ఏమీ తక్కువ చేయలేదు. జగనన్న వదిలిన బాణం అంటూ ఆయన జైలులో ఉన్నప్పుడు పాదయాత్ర చేయడం, 2019 ఎన్నికల్లో బై.. బై.. బాబు అంటూ ఒక పెద్ద నినాదాన్ని జనాల్లోకి తీసుకెళ్లి వైసీపీ గెలవడంలో ముప్పావు వంతు కృషి చేశారు. కానీ షర్మిలకు దక్కింది ఏంట్రా అంటే శూన్యమే. ఆఖరికి తన కుటుంబ సభ్యులైన వైఎస్ అవినాష్ రెడ్డి, బాలినేని శ్రీనివాసరెడ్డి, వైవీ సుబ్బారెడ్డికి పదవులు కట్టబెట్టిన జగన్ సొంత కుటుంబంలో మాత్రం షర్మిలకు న్యాయం చేయలేకపోయారు. దీంతో అలకబూనిన షర్మిల తెలంగాణలో పార్టీ పెట్టడం, కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయడం, ఏపీ అధ్యక్షురాలు పదవి దక్కించుకోవడం, తల్లిని అన్న పట్టించుకోకపోతే అక్కున చేర్చుకుని ముందుకు నడిచారు. ఇలా షర్మిల నాడు ఎంత ప్లస్ అయ్యారో, బాణంలా ప్రత్యర్థులపై దూసుకెళ్ళారో 2024 ఎన్నికల్లో అంతకు కొన్ని రెట్లు రివర్స్ అయ్యి అన్నను టార్గెట్ చేయడం మొదలుపెట్టారు. ఎంతలా అంటే జగన్ అంటే ఆయన ఎవరో తెలియదు, పొరపాటున కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి వారసుడు కానే కాదని చెప్పిన పరిస్థితి.
ఇద్దరిలా చేసి ఉంటే..
చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లాగే వైఎస్ జగన్ కూడా చేసి అంటే బాగుండేది. ఇంట్లో ఆస్తి వివాదాలు, అస్సలు అన్నకు అడ్డు వచ్చే పరిస్థితి కానే కాదన్నది ఇప్పటి పరిణామాలను చూసిన వైసీపీ నాయకులు, కార్యకర్తలు సోషల్ మీడియాలో అభిప్రాయాలు వెల్లడిస్తున్నారు. మరోవైపు ఇది అచ్చు తప్పు అని తెలంగాణలో కేసీఆర్ ఇలాగే కుమార్తె కవితను ప్రోత్సహించడం వల్ల రాష్ట్రం పరువును దేశ రాజధాని ఢిల్లీలో కలిపేసారని.. ఇందుకు ఢిల్లి లిక్కర్ స్కాం కేసే కారణమని చెబుతున్న పరిస్థితి. వాస్తవానికి నాడు వైసీపీ ఏర్పడిన తర్వాత షర్మిలకు ఏదో ఒక పదవి.. కనీసం రాజ్యసభకు ఐనా పంపాలని జగన్ భావించారట. ఐతే షర్మిల, బ్రదర్ అనిల్ కొన్ని కీలక ప్రౌజెక్ట్స్ కావాలని పట్టుబట్టడం.. జస్ట్ సంతకాలు చాలని చెప్పడంతో ఆ ఫైళ్లు చూసి నిర్ఘాంతపోయిన జగన్ మళ్ళీ కాంపౌండ్ దాటి లోపలికి రావద్దని కరాఖండిగా చెప్పేశారట. ఇక్కడే అన్న మధ్య చెడటం ఇప్పుడీ పరిస్థితికి అసలు సిసలు కారణం ఇదే అన్నది వైఎస్ ఫ్యామిలీకి అత్యంత ఆప్తులు చెబుతున్న పరిస్థితి. జగన్ నాడు ఈ మాత్రం సంకోచించకుండా షర్మిల కావాల్సినవన్నీ ఎలాంటి మొహమాటం ఇచ్చి ఉంటే మాత్రం పరిస్థితి వేరేలా ఉండేదని వైఎస్ ఫ్యామిలీ పరువు, రాష్ట్రాన్ని గంగలో కలిపేసి షర్మిల అండమాన్ నికోబార్ జైలులో ఉండేదని మరికొందరు అనుచరులు చెప్పుకుంటున్నారు. అందుకే బ్యాలెన్స్ కోల్పోకుండా కొన్నిటికి ఒప్పుకొని.. నాడు జగన్ ఏదో ఒక పదవి కట్టబెట్టి ఉంటే మాత్రం ఇప్పుడు ఈ పరిస్థితులు ఏ మాత్రం ఉండేవి కాదు.. ఇందులో ఎలాంటి సందేహాలు అక్కర్లేదు అనుకుంటా..!