జనసేన ఆవిర్భావం నుంచి నేటి వరకూ ఎంతో మంది నేతలు, కార్యకర్తలు పార్టీకి సేవలు అందించారు. టీడీపీ ఆతర్వాత వైసీపీ హయాంలో ఎన్నో ఇబ్బందులు కేసులు, గొడవలు ఎదుర్కొని మరీ ఎదురొడ్డారు. ఒకరిద్దరు కాదు లెక్కలేనంత మంది నేతలు, ముఖ్య కార్యకర్తలు ఉన్నారు. వారి పేర్లు ఇక్కడ అప్రస్తుతం. వాళ్ళు ఎవరూ అనేది అధినేత పవన్ కళ్యాణ్, కీలక నేత నాగబాబుకు బాగా తెలుసు. ఐనా సరే వారందరినీ పక్కనపెట్టి తన సోదరుడికి మంత్రి పదవి కట్టబెట్టడం ఎంత వరకూ సమంజసం అన్నది కొందరు సొంత పార్టీ నేతలు, అసంతృప్తుల నుంచి వస్తున్న మాటలు. ఇంకొందరు పార్టీ జెండా మోసిన నిఖార్సైన నేతలు ఐతే సోషల్ మీడియాలో నిట్టూరుస్తున్నారు.
నిజమే కదా..
నాగబాబుకు కాకుండా మరొకరికి, అది కూడా పార్టీ కోసం పని చేసిన చాలా మంది నాయకులు, కార్యకర్తలు.. పార్టీ తరఫున కష్టపడి గెలిచిన వారు ఉండగా దొడ్డిదారిన ఎందుకు ఇవ్వాల్సి వచ్చిందన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న. బయటికి చెప్పుకోలేక ఉన్నారు కానీ, తీవ్ర ఆవేదన, బాధను అనుచరులు దగ్గర వెళ్లగక్కుకుంటున్నారు. అవును ఇది కూడా పాయింటే కదా. ఇవన్నీ ఒక ఎత్తయితే జనసేన పార్టీకోసం ఆస్తులు, అంతస్తులు పోగొట్టుకుని ఇప్పుడు పవన్ కళ్యాణ్ అనుగ్రహం కోసం ఎదురుచూస్తున్న పరిస్థితి. ఈ క్రమంలో నాగబాబు మంత్రి కాబోతున్నారనే వార్త జీర్ణించుకోలేకపోతున్నారు.
అవును కరెక్టే కదా..
పవన్ కళ్యాణ్ ఎందుకు ఇలా చేశారనే విమర్శలు రావడం ఖాయమే. ఇది అన్ని పార్టీల్లో, ఆయా పార్టీల అధిపతుల కుటుంబాల్లో ఎప్పుడూ ఉండేదేనన్న విషయం జనసైనికులు, నేతలు గ్రహించాలి. వాస్తవానికి నాగబాబు మంచి వ్యూహకర్త, విమర్శకుడు, ప్రత్యర్థులను మాటలు, సెటైర్లతోనే దుమ్ము దులిపేయగల సామర్థ్యం ఉన్న వ్యక్తి. ఎందుకు వ్యూహకర్త అనాల్సి వచ్చిందంటే నాడు అన్న చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు అందరికంటే ఎక్కువ కష్టపడ్డది కూడా ఈయనే. ఇప్పుడు జనసేన బలోపేతం చేయడానికి పవన్ కంటే ఎక్కువగా కష్టపడ్డారని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఎందుకంటే టీడీపీ కూటమిని గేలిపించడానికి పవన్ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల ప్రచారం, సభలు నిర్వహిస్తే.. తనకు ఎమ్మెల్యే, ఎంపీ సీటు ఇవ్వకపోయినా సరే 21 మంది ఎమ్మెల్యేలను, ఇద్దరు ఎంపీలను గెలిపించడంలో కీలక పాత్ర పోషించారు. ఎక్కడ ఎలాంటి పొరపచ్చాలు వచ్చినా సరే రంగంలోకి దిగిపోయి సర్దిచెప్పి పరిష్కార మార్గం చూపేవారు. ఇందుకు తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గంలో నెలకొన్న వివాదాలకు చెక్ పెట్టడమే ఉదాహరణగా చెప్పుకోవచ్చు.
సహకరించండి..
నాడు ప్రజారాజ్యం, నేడు జనసేన ఈ పరిస్థితికి రావడానికి అహర్నిశలు కష్టపడ్డారు కానీ, తనను తాను మార్కెటింగ్ చేసుకోవడంలో అదెనబ్బా ప్రొజెక్ట్ చేసుకోవడంలో ఫెయిల్ అయ్యారు. పవన్ కళ్యాణ్ తీసుకున్న నిర్ణయం ముమ్మాటికీ కరెక్టే అని రాజకీయ విశ్లేషకులు, మేధావులు చెబుతున్నారు. పదవులు ఎవరికీ శాశ్వతం కాదు.. ఇవాళ నాగబాబుకు వరించిన పదవి కంటే ఎక్కువగానే రేపు పొద్దున్న సాధారణ కార్యకర్తలు రావొచ్చు. లేదంటే ఇంకో నేతకే రావొచ్చు.. అంత మాత్రాన అలకలు మాని, అసంతృప్తి పక్కనపెట్టి నాగబాబుకు సహకరిస్తే మంచిది సుమీ..! అందులోనూ పార్టీలో నంబర్ 2 అనేది కంపల్సరీ. అది ఇప్పుడు నాగబాబే అని పవన్ కూడా ఇండైరెక్టుగా సంకేతాలు కూడా ఇచ్చేశారు అన్న మాట.