నాగబాబుకు మంత్రి పదవి
మెగా బ్రదర్, జనసేన కీలకనేత కొణిదెల నాగబాబు మంత్రి కాబోతున్నారు. ఇన్నాళ్లకు ఆయనకు లక్కీ ఛాన్స్ వచ్చింది. తొలుత ఎంపీగా పోటీ చేయాలని భావించినా కుదరలేదు. టీడీపీ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత టీటీడీ ఛైర్మన్ పదవి అన్నారు అదీ కాలేదు. ఆ తర్వాత ఎమ్మెల్సీ, రాజ్యసభ అన్నారు కానీ అవేమీ ఆచరణలోకి రాలేదు. ఇన్నాళ్లు వేచిచూసిన నాగబాబుకు చివరికి మంత్రి పదవి వరించిందని సచివాలయ వర్గాలు వెల్లడించాయి. త్వరలోనే కేబినెట్ విస్తరణ జరగబోతోందని, ఆయన మంత్రిగా బాధ్యతలు స్వీకరించబోతున్నట్లు అధికారిక ప్రకటన కూడా ఒకట్రెండు రోజుల్లో రానుంది. రాజ్యసభకు అభ్యర్థులు అధికారికంగా ప్రకటించిన నిమిషాల వ్యవధిలోనే నాగబాబు గురంచి వార్త రావడంతో ఇది అక్షరాలా నిజమేనని మెగాభిమానులు, జనసైనికులు చెప్పుకుంటున్నారు.
ఎన్నాళ్లకెన్నాళ్లకు..
వాస్తవానికి జనసేన తరఫున రాజ్యసభకు నాగబాబు వెళ్తున్నట్లు ఇన్నాళ్లు ప్రచారం జరిగినా చివరి నిమిషంలో మార్పులు చేర్పులు జరిగాయి. టీడీపీ తరఫున బీద మస్తాన్, సానా సతీష్ పేర్లు ఖరారు అయ్యాయి. ఇక బీజేపీ తరఫున బీసీ నేత ఆర్ కృష్ణయ్య పేర్లు ఫిక్స్ అయ్యింది. ఈ మేరకు సోమవారం అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. ఇందులో వైసీపీకి రాజీనామా చేసిన ఇద్దరు ఎంపీలు ఉండటం గమనార్హం. బీద మస్తాన్ రావు, ఆర్ కృష్ణయ్య ఇద్దరూ ఇటీవలే వైసీపీకి రాజీనామా చేసిన సంగతి తెలిసింది. బీద టీడీపీలో చేరగా, కృష్ణయ్య కాషాయ తీర్థం పుచ్చుకున్నారు. ఈ ఇద్దర్నీ రాజ్యసభకు పంపక తప్పనిసరి కావడంతో నాగబాబుకు మరో మార్గం లేకపోయింది. దీంతో ఆయన్ను మంత్రివర్గంలోకి తీసుకోవాలని ప్రభుత్వ పెద్దలు సీఎం చంద్రబాబు, పవన్ కళ్యాణ్ నిర్ణయించారు.
మంత్రి ఎలా..?
త్వరలోనే నాగబాబును ఎమ్మెల్సీ పదవి కట్టబెట్టి ఆ తర్వాత మంత్రివర్గంలోకి తీసుకోవాలని పెద్దలు నిర్ణయించినట్టు తెలియవచ్చింది. ఎందుకంటే ఇప్పటికే వైసీపీకి చెందిన పలువురు ఎమ్మెల్సీలు రాజీనామా చేసినా ఆమోద ముద్ర పడలేదు. మండలి స్పీకర్ ఆమోదిస్తే ఉప ఎన్నిక వస్తుంది. అప్పుడిక నాగబాబుకు ఎలాంటి అడ్డంకులు ఉండవు. మొత్తానికి ఇన్నాళ్లకు మెగా బ్రదర్ మంత్రి కాబోతున్నారు. అంతే కాదు అన్నదమ్ములు ఇలా ఓకే మంత్రి వర్గంలో కూడా ఉండటం అరుదు. ఇది ఏపీలోనే సాధ్యమని చెప్పుకోవచ్చు.