మంచు ఫ్యామిలీలో మంటలు ఇంకా చల్లారలేదు. గంట గంటకూ పెరుగుతున్నాయే తప్పితే సద్దుమణిగే పరిస్థితులు మాత్రం ఏ మాత్రం కనిపించట్లేదు. దీంతో మంచు అభిమానులు, అనుచరులు ఆందోళన చెందుతున్న పరిస్థితి. సండే మొత్తం మండేలా గడిచినా అది కాస్త సోమవారానికి కూడా కంటిన్యూ అవుతున్న పరిస్థితి. అయితే గొడవ ఎందుకు జరిగింది? ఏ విషయంలో జరిగింది? అనేదానిపై ఒక్కరంటే ఒక్కరూ క్లారిటీ ఇవ్వకపోవడంతో ఎవరికి తోచినట్లు వాళ్లు రాసేస్తున్నారు. అటు మంచు మనోజ్ కానీ, ఇటు మోహన్ బాబు కనీసం విష్ణు, లక్ష్మీ కూడా స్పందించకపోవడంతో అసలేం జరుగుతోందో ఎవరికీ అర్థం కాని పరిస్థితి. ఈ క్రమంలో విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు ఒకే ఒక్కడి వల్లనే ఈ గొడవ మొత్తం జరిగిందన్న విషయం వెలుగులోకి వచ్చింది. ఈ వ్యవహారంలో కాస్త క్లారిటీ వచ్చినా, గందరగోళంగానే పరిస్థితులు ఉండటం గమనార్హం.
ఇక్కడే మొదలు..
వినయ్ అనే వ్యక్తి కారణంగా మంచు ఫ్యామిలీలో గొడవ ప్రారంభమైనట్లు తాజాగా తేలింది. ఇతను విద్యానికేతన్ కాలేజీ వ్యవహారాలన్నీ చూసుకునే కీలక వ్యక్తి. మోహన్ బాబుకు అత్యంత ఆప్తుడు, ప్రధాన అధికారిగా పనిచేస్తున్నాడు. స్కూల్, ఆస్తుల పంపకాల విషయంలో గొడవ వాదోపవాదాలు రావడంతో వినయ్‌పై మోహన్ బాబు తిట్ల పురాణం మొదలుపెట్టినట్లు తెలిసింది. మధ్యలో కలుగజేసుకున్నందుకు గాను నువ్వేమైనా దత్తపుత్రుడివా వినయ్? అంటూ మోహన్ బాబు డైలాగ్ కొట్టారట. ఇదే విషయాన్ని విష్ణు, మనోజ్ ఇద్దరికీ తెలియజేశాడట వినయ్. ఈ క్రమంలోనే మోహన్ బాబుకు, మనోజ్‌కు మధ్య గొడవ మరింత పెరిగిందనే వార్తలు ఫిల్మ్ నగర్‌లో చక్కర్లు కొడుతున్నాయి. నిన్న జరిగిన దాడికి కర్త, కర్మ, క్రియ మొత్తం వినయ్ అన్నది మనోజ్ వర్గం చెబుతున్న మాట. వినయ్ తనపై అత్యంత క్రూరంగా దాడి చేసినట్లు ఫిర్యాదులో మనోజ్ పేర్కొన్నట్లుగా తెలిసింది.
రెచ్చిపోయిన బౌన్సర్లు
హైదరాబాద్ వేదికగా ఇంత జరుగుతుంటే అసలేం జరుగుతోందని తిరుపతి జిల్లా చంద్రగిరి మండలంలోని రంగంపేటలో ఉన్న విద్యానికేతన్ యూనివర్శిటీకి వెళ్లిన మీడియా ప్రతినిధులను బౌన్సర్లు చితకబాదారు. న్యూస్ కవరేజీకి వెళ్లిన జర్నలిస్టు ఉమా శంకర్, కెమెరామెన్ నరసింహలపై బౌన్సర్లు దాడికి పాల్పడ్డారు. కెమెరాలు, సెల్ ఫోన్లు లాక్కొని మరీ కొట్టారు. తీవ్రగాయాలతో ఉన్న వారిని తోటి జర్నలిస్టులు చంద్రగిరి ఏరియా ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. దీంతో జర్నలిస్టు సంఘాలు ఆందోళనకు సిద్దమవుతున్నాయి. ఇటు హైదరాబాద్‌లో, అటు యూనివర్శిటీ వద్ద రచ్చ రచ్చగానే ఉంది. అయినా సరే మంచు ఫ్యామిలీలో ఏ ఒక్కరూ నోరు మెదపకపోవడం గమనార్హం. అయితే మంచు మనోజ్‌ను ఒప్పించడానికి మంచు లక్ష్మి రంగంలోకి దిగడంతో సోమవారం రాత్రితో ఈ వివాదానికి ఫుల్ స్టాప్ పడుతుందని అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
విజయ్ ఎవరో?
ఇవన్నీ ఒక ఎత్తయితే ఈ వివాదంలో సోమవారం సాయంత్రం కీలక పరిణామమే చోటుచేసుకుంది. హైదరాబాద్‌లోని జల్‌పల్లిలోని మంచు మనోజ్ ఇంటికి వెళ్లిన మంచు విష్ణు వ్యాపార భాగస్వామి విజయ్ అక్కడ సాక్ష్యాలు మొత్తం చెరిపేశాడు. సీసీ ఫుటేజీ టీవీలు, హార్డ్ డిస్కులు స్వాధీనం చేసుకుని ధ్వంసం చేయడం గమనార్హం. అంతేకాదు మంచు మనోజ్ ఇంటిదగ్గర విష్ణు తన మనుషులను కొందర్ని కాపలాగా పెట్టినట్లుగా బయటికి సమాచారం పొక్కింది. ఈ క్రమంలోనే మనోజ్ కూడా కొంతమంది బౌన్సర్లును పిలిపించుకున్నట్లు సమాచారం. ఇవాళ రాత్రి లేదా రేపటికల్లా విష్ణు దుబాయ్ నుంచి వస్తారని, వచ్చాక ఈ గొడవ మొత్తం కొలిక్కి వస్తుందని తెలుస్తోంది. అందుకే తాను రాకమునుపే మనోజ్‌తో మాట్లాడటానికి లక్ష్మిని పంపినట్లుగా తెలియవచ్చింది. అటు తమ్ముడి దగ్గర లక్ష్మి.. ఇటు నాన్న దగ్గరికి విష్ణు ఇద్దరూ మంతనాలు జరిపి కొలిక్కి వస్తే మంచిదే మరి. లేనిచో గొడవకు ఇప్పట్లో ఫుల్ స్టాప్ పడదు అంతే.