ఏపీ మహిళా కమిషన్ మాజీ ఛైర్ పర్సన్, వైసీపీ మహిళా నేత వాసిరెడ్డి పద్మ టీడీపీలో చేరబోతున్నారు. ఈ మేరకు శనివారం నాడు అధికారిక ప్రకటన చేశారు. విజయవాడ ఎంపీ కేశినేని చిన్నితో సుదీర్ఘ భేటీ అనంతరం, వారం రోజుల్లో టీడీపీ కండువా కప్పుకోబోతున్నట్లు వాసిరెడ్డి పద్మ ప్రకటించారు. ఇటీవల వైసీపీకి గుడ్ బై చెప్పిన పద్మ కొన్ని రోజులుగా ఏ పార్టీలోకి వెళ్లాలి? జనసేనలో చేరితే మంచిదా? లేకుంటే టీడీపీలో చేరితే మంచిదా? అని కుటుంబ సభ్యులు, అనుచరులు, అభిమానులతో సమాలోచనలు చేసిన పద్మ.. చివరికి పసుపు కండువా కప్పుకోవడానికి ఫిక్స్ అయ్యారు. ఈ మేరకు అధికారిక ప్రకటన కూడా చేసేశారు. వాసిరెడ్డితో పాటు భారీగానే చేరికలు ఉంటాయని టీడీపీ నేతలు చెబుతున్నారు. విజయవాడ, గుంటూరు, ఏలూరు జిల్లాలకు చెందిన పలువురు వైసీపీ నేతలు కూడా తెలుగుదేశంలో చేరబోతున్నారని వార్తలు గుప్పుమంటున్నాయి. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని కూడా ఒకట్రెండు రోజుల్లో లేదా వాసిరెడ్డి పద్మతో కలిసే టీడీపీలో చేరతారని తెలియవచ్చింది.
దుమ్మెత్తి పోసి..
వాస్తవానికి.. 2024 ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం పాలవ్వడం, అప్పటికే తనకు ఎమ్మెల్యేకు టికెట్ ఇవ్వకపోవడం, కనీసం తాను ఆశించిన నియోజకవర్గానికి ఇంచార్జీ పదవి కూడా ఇవ్వకపోవడంతో తీవ్ర అసంతృప్తి, ఆగ్రహానికి లోనయ్యారు. దీంతో అప్పట్నుంచీ పార్టీ కార్యక్రమాలకు, అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి వాసిరెడ్డి పద్మ దూరంగా ఉంటూ వచ్చారు. ఆ తర్వాత ఇక ఏకంగా పార్టీకి రాజీనామా చేసేసి బయటికి వచ్చేశారు. అప్పట్లో మీడియా ముందుకు వచ్చిన పద్మ.. జగన్‌పై తీవ్ర విమర్శలే గుప్పించారు. పార్టీ కోసం ప్రాణాలను పణంగా పెట్టిన కార్యకర్తలను జగన్ పట్టించుకోలేదని, గుడ్ బుక్ పేరుతో కార్యకర్తలను మరోసారి మోసం చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని దుమ్మెత్తిపోశారు. అంతేకాదు వైసీపీని నడిపించడంలో, పాలన చేయడంలో జగన్‌కు బాధ్యత లేదని కూడా ఘాటు విమర్శలు గుప్పించారు.
అటు నుంచి ఇటు!
రాజీనామా తర్వాత జనసేనలో చేరబోతున్నారని అందరూ అనుకున్నారు. ఎందుకంటే ప్రజారాజ్యం పార్టీ స్థాపించడం మొదలుకుని కాంగ్రెస్ విలీనం వరకూ ఈమె.. మెగాస్టార్ చిరంజీవి వెంటే ఉంటూ వచ్చారు. ఒకరకంగా చెప్పాలంటే కీలకంగా వ్యవహరించారు. ఆ తర్వాత కాంగ్రెస్‌లో అనంతరం వైసీపీలోకి వచ్చి చేరిపోయారు. దీంతో పద్మను గౌరవించి ఏపీ మహిళా కమిషన్ మాజీ ఛైర్ పర్సన్ పదవిని జగన్ కట్టబెట్టారు. మంచి వాక్చాతుర్యం, సబ్జక్టుపై లోతుగా మాట్లాడటంలో పద్మ దిట్ట. అందుకే నాడు ప్రజారాజ్యం, కాంగ్రెస్, నిన్న మొన్నటి వరకూ వైసీపీలో మంచి పదవులే దక్కాయి. ఇప్పుడిక టీడీపీలో చేరితే పద్మ పరిస్థితేంటి? ఎలాంటి పదవులు లేకుండా ఎక్కువ రోజులు పార్టీలో ఉండగలరా? అనేది తెలియాల్సి ఉంది. అయితే ఎమ్మెల్సీ లేదా నామినేటెడ్ పదవి ఇచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయని, ఈ మేరకు చర్చలు కూడా నడిచాయని తెలిసింది.