ముఖ్యమంత్రి నేలపై, విద్యార్థులతో కలిసి కూర్చొని భోజనం చేయడం ఎక్కడైనా చూశారా? సినిమాల్లో తప్ప నిజ జీవితంలో ఇలాంటి పరిస్థితి ఎక్కడైనా ఉంటుందా? అవును రియల్ లైఫ్‌లో జరిగింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇలా చేశారు. ఆయన పక్కనే మంత్రి నారా లోకేశ్ కూడా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దేశంలో మునుపెన్నడూ లేని విధంగా మెగా పేరెంట్స్, టీచర్స్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం డిసెంబర్-7 నుంచి ఏపీలో మొదలైంది. ఈ కార్యక్రమంలో భాగంగా మంత్రులు, ప్రజా ప్రతినిధులంతా పాల్గొని విజయం చేశారు. బాపట్ల మున్సిపాలిటి హైస్కూల్‌కు వెళ్లిన చంద్రబాబు, లోకేశ్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా క్లాస్ రూమ్‌ల్లోకి వెళ్లి విద్యార్థులతో కాసేపు ముచ్చటించి, సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం విద్యార్థులతో కలిసి మధ్యాహ్నం భోజనం చేశారు. భోజనం ఎలా ఉంది? రోజూ మెనూ ఎలా ఉంటుంది? టీచర్లు సమయానికి వచ్చి, బాగానే చదవులు చెబుతున్నారా? లేదా? అని భోజనం చేస్తూనే విద్యార్థులతో కలిసి మాట్లాడారు.
ఎక్కడైనా చూశారా?
ఒకసారి ఈ ఫొటో చూడండి.. కింద చాప కూడా లేదు. విద్యార్థులతో కలిసి నేలమీదే కూర్చొని సీఎం భోజనం చేయడం ఎక్కడైనా చూశారా? అది కూడా విద్యార్థుల ప్లేట్లలోనే తినడం చూసిన దాఖలాలు ఉన్నాయా? ఇదీ చంద్రబాబు అంటే అంటూ పిక్ ఆఫ్ ది డే అంటూ అభిమానులు, అనుచరులు, కార్యకర్తలు, తెలుగు తమ్ముళ్లు సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున ఫొటోలు షేర్ చేస్తున్నారు. బాబు గారి సింప్లిసిటీ ఇలాగే ఉంటుందని టీడీపీ నేతలు చెప్పుకుంటున్నారు. ప్రస్తుతం ఈ కార్యక్రమానికి చెందిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. కార్యక్రమంలో భాగంగా విద్యార్థులు, ఉపాధ్యాయులకు చంద్రబాబు పలు విషయాలపై దిశానిర్దేశం చేశారు.
ఇక ఈగల్..
కార్యక్రమంలో భాగంగా మాట్లాడుతూ పిల్లలను తల్లిదండ్రులు ఓ కంట కనిపెట్టాలని చంద్రబాబు సూచించారు. ముఖ్యంగా పిల్లలు స్మార్ట్‌ఫోన్లకు బానిసలు కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని తల్లిదండ్రులకు చెప్పారు. డ్రగ్స్ వ్యతిరేక పోరాటం అనేది పాఠశాలల నుంచే ప్రారంభం కావాలని చంద్రబాబు ఆకాంక్షించారు. మాదక ద్రవ్యాలు అనేవి మానవ సంబంధధాలను నాశనం చేస్తాయన్నారు. రాష్ట్రంలో డ్రగ్స్ రక్కసిని రూపుమాపేందుకు ప్రభుత్వం ఈగల్ వ్యవస్థను ఏర్పాటు చేసిందని చంద్రబాబు చెప్పారు. టీడీపీ హయాంలో 11 డీఎస్సీల ద్వారా 1.50 లక్షల మంది టీచర్లను నియమించిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. అంతేకాదు.. ఇకపై ప్రతి ఏటా డీఎస్సీ నిర్వహిస్తామని, టైం టేబుల్ ప్రకారం నోటిఫికేషన్‌లు ఇస్తామని బాపట్ల వేదికగా చంద్రబాబు హామీ ఇచ్చారు.