టాలీవుడ్ అగ్ర నిర్మాతలలో ఒకరైన దిల్ రాజుకు తెలంగాణ ప్రభుత్వం కీలక పదవిని అప్పగించింది. తెలంగాణ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (టీఎఫ్‌డీసీ) ఛైర్మన్‌గా వెంకట రమణా రెడ్డి అలియాస్ దిల్ రాజును నియమిస్తూ జీవో జారీ చేసింది. వాస్తవానికి ఈ జీవో డిసెంబర్ 3వ తేదీనే వచ్చినా.. మీడియాకు మాత్రం మూడు రోజుల తర్వాత అంటే డిసెంబర్ 6న విడుదల చేశారు.
ఎప్పుడూ సినిమాల నిర్మాణం, డిస్ట్రిబ్యూషన్ తప్ప వేరే ధ్యాసలేని దిల్ రాజుకు ఈ పదవి ఇవ్వడం సముచితం అని ఈ ప్రకటన వచ్చిన తర్వాత టాలీవుడ్ అంతా అనుకుంటుండటం విశేషం. తెలంగాణ రాష్ట్రంలో సినిమా ఇండస్ట్రీని డెవలప్ చేసే బాధ్యత ఇకపై దిల్ రాజుదే. తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శాంతికుమారి విడుదల చేసిన ఈ జీవోలో దిల్ రాజు రెండు సంవత్సరాల పాటు ఈ పదవిలో కొనసాగనున్నారని తెలిపారు.
వాస్తవానికి దిల్ రాజుకి పదవి ఉన్నా, లేకపోయినా ఆయన జీవితం మొత్తం సినిమాలకే అంకితం అన్నట్లుగా.. ఎప్పుడూ ఏదో ఒక సినిమా వేడుకలో కనబడుతూనే ఉంటారు. ప్రస్తుతం ఒకవైపు డిస్ట్రిబ్యూషన్ చేస్తూనే, మరోవైపు మూడు బ్యానర్లలో ఆయన సినిమాలు తీస్తున్నారు. శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్, దిల్ రాజు ప్రొడక్సన్స్ కాకుండా రీసెంట్‌గానే దిల్ రాజు డ్రీమ్స్ పేరుతో మరో బ్యానర్‌ను ఆయన స్థాపించారు. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన బాధ్యతతో దిల్ రాజు పరిధి మరింతగా విస్తరించనుంది.