గత కొన్ని రోజులుగా ట్రూత్ బాంబ్ అంటూ సోషల్ మీడియా వేదికగా హడావుడి చేస్తున్న వైసీపీ.. తాజాగా మరో సంచలనానికి తెరదీసింది. అది కూడా కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ప్రధాన అనుచరుడు బసవ రమణ ఘరానా మోసం బట్టబయలు అంటూ ట్వీట్ చేసింది. ఇండియన్ ఆర్మీ కాలింగ్ అనే సెంటర్‌ను స్థాపించి ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ ఒక్కొకరి దగ్గర నుంచి రూ.5-10 లక్షల వరకూ రమణ అనే వ్యక్తి వసూళ్లకు పాల్పడ్డాడు.
అరాచకాలు అన్నీ.. ఇన్నీ కావు!
శిక్షణ పేరుతో సెంటర్‌కు వచ్చిన అమ్మాయిల గదుల్లో సీక్రెట్ కెమెరాలు పెట్టి వీడియోలు రికార్డ్ చేయడం, వాటిని అడ్డుపెట్టుకుని స్నేహితులతో కలిసి అమ్మాయిలను వేధింపులకు గురిచేయడం రమణ ప్రవృత్తిగా మారింది. బసవ రమణ వీడియోలు తీస్తున్న విషయాన్ని అమ్మాయిల ఇంట్లో చెప్పిన నలుగురు కుర్రాళ్లని బంధించి చిత్రహంసలు పెట్టాడు. బెల్టులు తీసుకుని వారిని కొడుతున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అవుతోంది. శ్రీకాకుళంలో మంత్రి రామ్మోహన్ నాయుడు పేరు చెప్పి బసవ రమణ దందాలు కూడా చేస్తున్నాడు. షాపింగ్ మాల్స్, బార్స్‌కు వెళ్లి బిల్లులు చెల్లించకుండా బెదిరింపులకు పాల్పడటం గమనార్హం.
ఎప్పటి నుంచో..!
ఎన్నో ఏళ్ళు నుంచి ఇలా దుర్మార్గాలకి పాల్పడుతున్నప్పటికీ, కూటమి ప్రభుత్వం పట్టించుకోకపోవడం గమనార్హం. ఇతను శ్రీకాకుళం ఎమ్మెల్యే గుండు శంకర్‌కు కూడా సన్నిహితుడు కావడం గమనార్హం. పాలన చేతగాకపోతే, ఊరూరా ఇలాంటి దుర్మార్గులే రాజ్యమేలుతారని అనేదానికి ఇంతకంటే ఉదాహరణ కావాలా? అంటూ వైసీపీ తిట్టి పోస్తున్న పరిస్థితి. రెండ్రోజులుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫోటోలు, వీడియోలపై మంత్రి నారా లోకేశ్ కూడా ఎక్స్ వేదికగా స్పందించారు. దీనిపై పోలీసులు విచారించి, కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
అబ్బే తప్పేమీ లేదు!
ఇదిలా ఉంటే బాధితుడు నవీన్ స్పంచించాడు. తనను కొట్టడంలో రమణ తప్పు ఏ మాత్రం లేదని అంటున్నాడు. ఇన్‌స్టిట్యూట్ నుంచి చెప్పకుండా బయటకి వెళ్లడం వలన ఆయనకు కోపం వచ్చి, తనను కొట్టారని నవీన్ చెప్పడం గమనార్హం. ఈ సంఘటన గత ఏడాది డిసెంబర్ 28న జరిగిందని, కొట్టడం తప్పే అయినా.. అందులో తన తప్పు కూడా ఉందని చెప్పుకొచ్చాడు. తమని రమణ సొంత సోదరుడిలా చూసుకుంటున్నాడని నవీన్ చెప్పాడు. వైసీపీ ఆరోపణల్లో తప్పు ఉందా..? ఈ వీడియోలో తప్పు ఉందా అన్నది పోలీసులు తేల్చాల్సి ఉంది. ఏం జరుగుతుందో చూడాలి మరి.