వైసీపీ సిట్టింగులు, నేతలు, కార్యకర్తలు ఎప్పుడు ఎవరిని పొగుడుతారో.. ఎవర్ని తిట్టిపోస్తారో ఎవరికీ, ఎప్పటికీ అర్థం కాదు. ఎందుకంటే శత్రువుకు శత్రువు మిత్రుడు అయినట్టుగా, ప్రత్యర్థికి ప్రత్యర్థి ఎవరైనా మనోడే అనుకునే పరిస్థితి వాళ్ళది. మొన్న సూపర్ స్టార్ మహేష్ బాబు, నిన్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. ఇవాళ ఏకంగా జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వరకూ అందరినీ ఆకాశానికి ఎత్తేస్తున్న పరిస్థితి. ఇప్పటి వరకూ కార్యకర్తలు, నేతలే ఇలా చేస్తున్నారంటే ఏమైనా అనుకోవచ్చు కానీ.. అగ్రనేత, నంబర్ 2 అని పిలిపించుకునే రాజ్యసభ ఎంపీ విజయసాయి రెడ్డి.. సేనానిని పొగడ్తలతో ముంచెత్తారు. ఇదే క్రమంలో సీఎం చంద్రబాబును విమర్శించారు కూడా.
సాయిరెడ్డికి ఏమైంది..!
టీడీపీ కూటమి అన్నా.. ఆ పార్టీ నేతలు, మరీ ముఖ్యంగా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ అంటే చాలు ఒంటికాలిపై లేచే విజయసాయిరెడ్డి ఎందుకో ఒక్కసారిగా యూటర్న్ తీసుకున్నారు. ఎప్పుడూ.. ఎక్కడా ఇంతలా మాట్లాడని సాయి రెడ్డి ఇంట్రెస్టింగ్ ట్వీట్ చేశారు. యువ రాష్ట్రమైన ఏపీకి 75 ఏళ్ల వృద్ధుడు నాయకత్వం వహించలేరని సీఎం చంద్రబాబును ఉద్దేశించి కామెంట్స్ చేశారు. ఈ క్రమంలో పవన్ గురుంచి మాట్లాడుతూ జాతీయ స్థాయిలో పాపులారిటీ, వయస్సు కారణంగా రాష్ట్రాన్ని ఆయన మాత్రమే ముందుకు నడపగలరని అభిప్రాయపడ్డారు. ఆ శక్తి, సామర్థ్యాలు ఆయనకు మాత్రమే ఉన్నాయని చెప్పుకొచ్చారు. అంతటితో ఆగని సాయిరెడ్డి.. ఏపీలోని ఎన్డీఏ పార్టీల నాయకుల్లో అత్యంత ఆదర్శవంతమైన వ్యక్తి పవన్ అంటూ కొనియాడారు.
ఏదో తేడా కొడుతోందే..!
విజయసాయి నోట ఎపుడూ ఇంత మంచి మాటలు వచ్చిన సందర్భాలు లేనే లేవని చెప్పాలి. అలాంటిది ఒక్కసారిగా పవన్ గురుంచి ఇలా మాట్లాడటంతో ఏదో తేడాగా ఉందే అంటూ వైసీపీ కార్యకర్తలు, నేతలు చర్చించుకుంటున్నారు. మరోవైపు కేసుల భయంతో సాయిరెడ్డి కూడా వైసీపీకి రాజీనామా చేసి, కొంపదీసి జనసేనలో చేరిపోతారా ఏంటి అంటూ ఇంకొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. జనసేనలో చేరి పవన్ కళ్యాణ్ నాయకత్వాన్ని బలపరచబోతున్నారా? అనే సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి చూస్తే అటు చంద్రబాబును తిడుతూనే.. ఇటు పవన్ కళ్యాణ్ ను ఆకాశానికి ఎత్తేస్తూ మాట్లాడటం వెనుక ఏదో మతలబు ఉండే ఉంటుంది.. ఎప్పుడు బయట పడుతుందో చూడాలి మరి.