అవును.. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.. పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఇద్దరి గురుంచి ఇటు జనాల్లో అటు మీడియా, సోషల్ మీడియాలో పెద్ద చర్చే నడుస్తోంది. 2024 ఎన్నికల్లో గెలుపు మొదలుకుని, ఇప్పటి వరకూ ఈ ఇద్దరూ ఏం చేసినా అదొక సంచలనమే అవుతోంది. ఇద్దరూ ఇద్దరే. మొదట నాదెండ్లపై సీఎం చంద్రబాబు కాస్త అసంతృప్తికి లోనైనప్పటికి ఆ తర్వాత అంతా సెట్ అయ్యింది. అప్పటి నుంచీ ఇప్పటి వరకూ ఒక రేంజిలో దూసుకెళుతున్నారు. ఇక పవన్ కళ్యాణ్ గురుంచి ఐతే ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ప్రమాణ స్వీకారానికి ముందే తన మార్క్ మొదలుపెట్టిన సేనాని.. ఇప్పటి వరకూ ఆయన ఏది చేసినా అదొక పెను సంచలనంగానే మారుతోంది.
సీజ్ ద షిప్..!
సీజ్ ద షిప్.. ఇప్పుడీ డైలాగ్ ఎక్కడ చూసినా, ఎవరి నోట చూసినా వినిపిస్తోంది. సినీ జీవితంలో పవన్ కళ్యాణ్ డైలాగ్స్ ఎంతలా ఫేమస్ అయ్యాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక హావభావాలు, స్టయిల్ గురుంచి ఐతే మాటల్లో చెప్పలేం అంతే. ఇప్పుడిక రాజకీయాల్లోనూ పవన్ ఒక ట్రెండ్ సెట్టర్. రీల్ లైఫులో చేయనివి.. చేయలేనివి కూడా నిజమైన పవర్ వాడి పవర్ రేంజర్ అయ్యారు. ఇక ఈయన ఎక్కడ పర్యటించినా అదొక సంచలనమే అవుతోంది. ముఖ్యంగా ఈ మధ్య కాకినాడ టూర్ ఎంతలా బర్నింగ్ టాపిక్ అయ్యిందో తెలిసిందే. ముఖ్యంగా సీజ్ ద షిప్ అనే డైలాగ్ ఐతే వామ్మో అదో కిక్కులా అయ్యింది. మొదట ఆయనకు ఎలాంటి హక్కు లేదు.. సీజ్ చేయడానికి ఆయనెవరు అన్నట్టుగా వార్తలు వచ్చాయి కానీ కలెక్టర్ చెప్పిన కొన్ని అధికారాలతో సీజ్ చేయొచ్చు అనే విషయం అందరికీ తెలిసింది. ఇప్పుడిదే యమా ట్రెండ్ అవుతోంది. ఎంతలా అంటే ఇదే పేరుతో సినిమా కూడా వచ్చేంత ఫేమస్ కావడం విశేషం అని చెప్పుకోవచ్చు.
దిస్ ఈజ్ వాస్తవం..!
ఇక నాదెండ్ల మనోహర్ కూడా తనదైన శైలిలో మంత్రిగా దూసుకెళుతున్నారు. వైసీపీ అంటే చాలు ఒంటి కాలిపై లేస్తూ మీడియా, సోషల్ మీడియా ద్వారా దుమ్ము దులిపి వదులుతున్నారు. వైసీపీ హయాంలో ఏం జరిగింది..? ఈ ప్రభుత్వంలో ఏం చేశాం..? ఇంకా ఏమేం చేయబోతున్నాం? అనే విషయాలను సభ్య సమాజానికి వివరిస్తున్నారు. ఇదే కాకినాడ పోర్టు వేదికగా ఆయన ఒక్కో విషయాన్ని ఎండగడుతూ ముందుకెళ్తున్నారు. రేషన్ బియ్యం అక్రమ రవాణా వ్యవహారాన్ని వెలికి తీసిందే నాదెండ్ల. ఇప్పుడు ఇదే వ్యవహారంపై సీబీ సీఐడి విచారణ కూడా చేయిస్తున్నారు. దిస్ ఈజ్ వాస్తవం అంటూ ట్విట్టర్ వేదికగా రెండ్రోజులకోసారి గట్టిగానే ఇచ్చి పడేస్తున్నారు. అటు సీజ్ ద షిప్.. ఇటు దిస్ ఈజ్ వాస్తవం ఈ రెండు డైలాగ్స్ ఇప్పుడు గట్టిగానే ట్రెండ్ సృష్టిస్తున్నాయి.