ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప2 చిత్రం ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ 5న విడుదలై పాజిటివ్ టాక్‌తో సక్సెస్‌ఫుల్‌గా థియేటర్లలో రన్ అవుతోన్న విషయం తెలిసిందే. అయితే డిసెంబర్ 4న ఈ చిత్ర ప్రీమియర్స్ నిర్వహించారు. అందుకు ప్రభుత్వం కూడా అనుమతి ఇచ్చింది. అయితే డిసెంబర్ 4న రాత్రి 9.30 గంటలకు ఆర్‌టిసి క్రాస్ రోడ్స్‌లోని సంధ్య థియేటర్‌లో జరిగిన బెనిఫిట్ షో కు చిత్ర హీరో అల్లు అర్జున్ కూడా హాజరైన విషయం తెలిసిందే.
అల్లు అర్జున్ వచ్చిన సమయంలో తొక్కిసలాట జరిగి.. రేవతి అనే మహిళ మృతి చెందగా, ఆమె కుమారుడు పరిస్థితి విషమంగా ఉన్నట్లుగా వార్తలు వచ్చాయి. అయితే ఈ ఘటనపై పలు కేసులు నమోదయ్యాయి. అల్లు అర్జున్‌పై కూడా కేసులు నమోదయినట్లుగా తెలుస్తోంది. అయితే ఈ ఘటనపై పోలీసులు ఇచ్చిన వివరణ ప్రకారం, అల్లు అర్జున్ పర్సనల్ సెక్యురిటీ అతి, థియేటర్ వాళ్లు సమాచారం ఇవ్వకపోవడం కారణంగానే ఈ తొక్కిసలాట జరిగినట్లుగా తెలుస్తోంది.
అయితే ఈ ఘటన అనంతరం తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమవుతూ.. సంచలన నిర్ణయం తీసుకుంది. ఇకపై తెలంగాణ వ్యాప్తంగా బెనిఫిట్ షోలకు అనుమతులు ఇవ్వబోమని సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంచలన ప్రకటన చేశారు. ఇది రాబోయే స్టార్ హీరోల సినిమాలకు పెద్ద దెబ్బే అని చెప్పుకోవచ్చు.