మెగా ఫ్యామిలీకి అల్లు అర్జున్ క్షమాపణ చెప్పాలి!
ఇంట గెలిచి రచ్చ గెలవాలి అనే సామెత అందరికీ గుర్తుండే ఉంటుంది. ఇప్పుడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ విషయంలో కూడా ఇదే జరుగుతోంది. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఇతర రాష్ట్రాల్లో అభిమానులు, అనుచరులను సంపాదించుకున్న బన్నీ పాన్ ఇండియా స్టార్ అంటూ ఎదుగుతున్నాడు కానీ.. మెగా ఫ్యామిలీ, మెగాభిమానులు, జనసేన కార్యకర్తలు, నేతల విషయాల్లో మాత్రం బద్ధ శత్రువుగా మారిపోయాడు. ఎంతలా అంటే అల్లు అర్జున్ పేరు ఎత్తితే చాలు చిర్రు ఎత్తుకుపోయే, మండిపోతున్న పరిస్థితి ఉందన్న విషయం సోషల్ మీడియాలో చూస్తే ఇట్టే అర్థం చేసుకోవచ్చు.
ఓపెన్ ఛాలెంజ్..
మెగా ఫ్యామిలీకి ఆల్లు అర్జున్ క్షమాపణలు చెప్పకుంటే పుష్ప-2 సినిమాను అడ్డుకుంటామని మీడియా ముఖంగా గన్నవరం నియోకవర్గంకు చెందిన జనసేన నేత చలమలశెట్టి రమేష్ బాబు
ఓపెన్ ఛాలెంజ్ చేశారు. ఇప్పుడీ వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద చర్చే జరుగుతోంది. ఇది పార్టీ పరంగా అన్నారా..? పార్టీ తరఫున మాట్లాడుతున్నారా అన్నది అర్థం కాని పరిస్థితి. మెగా ఫ్యామిలీని యావత్ ప్రపంచమే ఇష్ట పడుతోంది. నువ్వు ఒక్కడివే ఆ కుటుంబానికి వ్యతిరేకంగా ఉంటున్నావు. కొద్దిరోజులుగా అల్లు అర్జున్ వ్యవహారశైలి, జన సైనికులు, మెగా ఫ్యామిలీకి చాలా బాధ కలిగించింది. విపక్ష నేతలు మాట్లాడితే పట్టించుకోం. నేను మెగా ఫ్యామిలీ అభిమానిని అని చెప్పారు. అదే కాంపౌండ్‌లో పెరిగానని చెప్పిన నువ్వు.. ఇప్పుడు చేస్తున్నది ఏంటి..? మండిపడున్న పరిస్థితి.
రగిలిపోతున్న పరిస్థితి..!
మెగా ఫ్యామిలీకి వ్యతిరేకంగా మొన్నటి ఎన్నికల్లో అల్లు అర్జున్ పని చేశారు. ఇప్పటికైనా చిరంజీవి కాళ్ళు కడిగి నెత్తిన నీళ్ళు చల్లుకో. లేదంటే పుష్ప-2 సినిమాను అడ్డుకుంటాం అని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు జనసేన నేత. అప్పట్లో బన్నీ సినిమాపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా బెంగళూరు పర్యటనలో ఒకప్పుడు అడవులను కాపాడేలా సినిమాలు చేసేవారని, ఇప్పుడేమో అడవులు దోచుకుపోయేలా ఉన్నాయని కామెంట్స్ చేశారు. అప్పట్లోనే ఈ వ్యాఖ్యలు బన్నీని ఉద్దేశించి పరోక్షంగా మాట్లాడినవే అని మెగా వర్సెస్ అల్లు అర్జున్ అభిమానుల మధ్య పెద్ద యుద్ధమే నడిచింది. ఇప్పుడు జనసేన నేత చేసిన వ్యాఖ్యలు రచ్చకు దారిదీశాయి. ఏం జరుగుతుందో చూడాలి.