ఆళ్ల నాని.. ఈ పేరు అందరికీ గుర్తుండే ఉంటుంది. నాడు వైఎస్ హయాంలో, ఆ తర్వాత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హయాంలో ఓ వెలుగు వెలిగిన నేత. అలాంటిది ఇప్పుడు అటు ఇటు కాకుండా పోయారనే అనుచరులు, అభిమానులు ఆందోళన చెందుతున్న పరిస్థితి. ఎందుకంటే వైసీపీ అధికారంలో ఉన్నన్ని రోజులు అధినేతకు ఆప్తుడిగా, డిప్యూటీ సీఎంగా, ఆరోగ్య శాఖ మంత్రిగా విధులు నిర్వహించిన ఆయన ఆ తర్వాత అనివార్య కారణాల వలన రాజీనామా చేశారు. తనకు తగిన ప్రాధాన్యత, గుర్తింపు ఇవ్వట్లేదని మీడియా వేదికగా ఆవేదన వెలిబుచ్చిన సందర్భాలు చాలానే ఉన్నాయి. ఆయన కాపు సామాజిక వర్గానికి చెందిన నేత, ఏలూరు జిల్లాలో మంచి గుర్తింపు ఉన్న నేతగా ఉన్నారు. ఆయన రాజీనామాతో వైసీపీకి ఊహించని షాకే తగిలింది. ప్రస్తుతానికి రాజకీయాలకు విరామం ప్రకటిస్తున్నట్లు చెప్పిన ఆళ్ల ఇప్పుడిక వేరే పార్టీల్లోకి వెళ్లడానికి రంగం సిద్ధం చేసుకున్నారు.
దారెటు?
జనసేనలో చేరబోతున్నారని, ముహూర్తం కూడా ఫిక్స్ చేసుకున్నారని కూడా వార్తలు వచ్చాయి. కానీ, జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నుంచి పిలుపు రాకపోవడం, స్థానికంగా నేతలంతా వ్యతిరేకంగా ఉండటంతో ఆ పార్టీలో చేరే ప్రయత్నం విరమించుకున్నారట. అయితే ఇప్పుడిక తెలుగుదేశం పార్టీలో చేరడానికి రంగం సిద్ధం చేసుకున్నారని వార్తలు గుప్పుమంటున్నాయి. గత 24 గంటలుగా ఏలూరు జిల్లాలో ఈ వార్త కోడై కూస్తోంది. గోదావరి జిల్లాకు చెందిన ఓ కీలక మంత్రి, సీనియర్ నేతలతో మంతనాలు జరిపిన నాని.. సీఎం చంద్రబాబు నాయుడు సమక్షంలో పసుపు కండువా కప్పుకోవడానికి సిద్ధమైపోయారు. అయితే ఆయన రాకను తెలుగు తమ్ముళ్లు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. వైసీపీ అధికారంలో ఉండగా టీడీపీ నాశనాన్ని కోరిన, కార్యకర్తలను తీవ్రంగా ఇబ్బంది పెట్టిన ఆళ్లను ఎలా చేర్చుకుంటారు? అంటూ అధిష్టానాన్ని పార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
అయ్యో.. ఆళ్ల!
అటు జనసేనలోకి వెళ్దామంటే వ్యతిరేకత.. ఇటు టీడీపీలోకి కూడా రాలేని పరిస్థితి ఏర్పడింది. పోనీ తిరిగి వైసీపీలోకి వచ్చే పరిస్థితి ఉందా అంటే అదీ లేకపాయే. అదేదో సామెత ఉంది కదా.. ఉన్నదీ పాయే, ఉంచుకున్నదీ పాయే అన్నట్లుగా ఆళ్ల నాని పరిస్థితి ఉంది. దీంతో వైసీపీ కార్యకర్తలు, నేతలు సోషల్ మీడియా వేదికగా సెటైర్లు పేలుస్తున్నారు. అన్నను కాదనుకుంటే అటు ఇటు కాకుండా పోవడమే అంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. డిప్యూటీ సీఎంగా పనిచేసిన నాని, తాను ఏది కోరినా, అడగాలే కానీ ఇచ్చిన వైఎస్ జగన్‌ను ఎవరైనా వదులుకుంటారా అంటూ నెట్టింట్లో పెద్ద ఎత్తున కామెంట్స్ చేస్తున్నారు. ఇప్పుడు ఆళ్ల ఏం చేయబోతున్నారు? దారులన్నీ మూసివేసిన తర్వాత ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు? అనేదానిపై అభిమానులు, అనుచరులు, కార్యకర్తలు ఎంతగానో వేచి చూస్తున్నారు.