2024 ఎన్నికలు పూర్తి అయ్యి పట్టుమని పది నెలలు కూడా కాలేదు. ఎన్నికల హామీలు అన్నీ ఆరు నెలల్లోనే అన్నీ జరిగిపోవాలంటే అస్సలు అయ్యే పని ఏ మాత్రం కానే కాదు. ప్రతిదానికీ మేం ఇది చేశాం.. అది చేశాం.. మీరు చేసిందేంటీ? అంటే సంవత్సరం అయినా సమయం ఇవ్వాలి కదా..! ఇలా చేయాల్సిన వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మాత్రం.. రివర్స్ దారిలో వెళ్తున్నారు. ఎందుకంటే.. మన పాలనలో చక్కగా బటన్లు నొక్కాం, కాబట్టి చంద్రబాబు కూడా చేస్తాడేమోనని ప్రజలు ఆశపడ్డారు. కానీ ఆరునెలలు తిరక్కమునుపే వాస్తవం అర్ధమయింది. ప్రతి ఇంట్లో దీనిపై చర్చ జరుగుతోంది. ప్రతి వ్యవస్ధ కుప్పకూలిపోతుందని విమర్శలు చేయడం ఎంత వరకు సబబు. ఇవన్నీ కాదు జగన్ తీసుకున్న ఒక కీలక నిర్ణయం క్యాడర్ ఊపిరి పీల్చుకునేలా.. హమ్మయ్య అని రిలాక్స్ అయ్యేలా ఉంది. ఇంతకీ ఏంటది..? ఏం జరుగుతోంది..!
ఇదేం పద్ధతి..?
ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా రాష్ట్రంలో ఉన్న ప్రతి పౌరుడికి అన్నీ సంక్షేమ పథకాలు అందుతాయా..? అంటూ 100కు 100 శాతం అంటే ఎవరి తరం కాదు. ఎక్కడో ఒక చోట లోటుపాటు అనేది కచ్చితంగా ఉంటుంది. వైసీపీ హయాంలో ఇదిగో పలనా ఒక్క పథకం రాలేదని కుండబద్దలు కొట్టినట్లు మాట్లాడిన సందర్భాలు లేవా..?. అందుకే ఇప్పుడు అది మేమే.. ఇది మేమే అని చెప్పుకోవడం వరకూ ఓకే కానీ ప్రభుత్వంపై పోరాటాలు, ధర్నాలు, నిరసనలు, దీక్షలు అంటే జనాలు, సభ్య సమాజం మాత్రం ఏ మాత్రం సహించదు. ఇది ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అక్షరాలా నిజమే.
మంచిది.. శుభం!
ఇప్పటివరకు వైఎస్ జగన్ చుట్టూ ఉన్న కోటరీ, తాడేపల్లి ప్యాలస్ దాటి నేరుగా కార్యకర్తలు, నేతలను.. అందులోనూ వారి నియోజకవర్గాల్లో స్వయంగా వెళ్లి కలుస్తాను అంటే అంతకు మించిన శుభ పరిణామం వైసీపీకి మరొకటి లేదు. వైఎస్ జగన్ అధికారంలో ఉన్నప్పటి నుంచి నేటి వరకూ తీసుకున్న నిర్ణయాల్లో ఉత్తమమైనది ఇదే అని చెప్పుకోవచ్చు. ఈ సంక్రాంతి తర్వాత పార్లమెంటు యూనిట్‌గా జిల్లాల్లో పర్యటిస్తానని, ప్రతి బుధవారం, గురువారం జిల్లాల్లోనే ఉంటానని, అక్కడే నిద్ర కూడా చేస్తానని చెప్పడం మంచిదే. దీనికి తోడు రెండు రోజుల పాటు కార్యకర్తలతో మమేకం అవుతానని చెప్పడం మంచి ఆలోచనే. ఇలా చేయడం ద్వారా గ్రౌండ్ లెవల్లో పార్టీ పరిస్తితి ఏంటి..? ఎందుకు ఈ పరిస్థితి నెలకొంది? అని తెలుసుకుని, సలహాలు, సూచనలు తీసుకోవచ్చు కూడా. పూర్తిగా సమయం కార్యకర్తలకే కేటాయించి, కార్యకర్తలతో జగనన్న, పార్టీ బలోపేతానికి దిశా నిర్దేశం అనే పేరుతో కార్యక్రమాన్ని నిర్వహించాలని నిర్ణయం చాలా భేష్.
నూరి పోస్తున్నారుగా..!
వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తల అరెస్టులతో ఆందోళన, నేతలు, మాజీలు చురుకుగా లేకపోవడంతో కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో వైసీపీ పరిస్థితి ఘోరాతి ఘోరంగా ఉంది. ఇందుకు ఏలూరు జిల్లా సరైన ఉదాహరణ. ఆళ్ల నాని రాజీనామా తర్వాత ఒక్క నియోజకవర్గమే కాదు జిల్లాలోనూ పెద్ద దిక్కు లేకుండా పోయింది. ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. అందుకే కార్యకర్తలకు భరోసా ఇస్తూ వారితో మమేకం ఐతే అంతకంటే క్యాడర్ కోరుకునేది ఏముంది. ఇక పనిలో పనిగా పోరాట పటిమ సన్నగిల్లగూడదని కార్యకర్తలు, నేతలకు గట్టిగానే జగన్
నూరి పోస్తున్నారు. ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి కష్టాలుంటాయి, నష్టాలుంటాయని, కష్టకాలంలో ఉన్నప్పుడే మనకు అదొక పరీక్షని చెప్పుకొచ్చారు. ఇది కూడా నిజమే కదా. కష్టమొచ్చినప్పుడు అందరూ నన్ను గుర్తు తెచ్చుకొండి, 16 నెలలు నన్ను జైల్లో పెట్టారు.. బెయిల్ కూడా ఇవ్వలేదని ఉదాహరించి మరీ చెప్పారు.
ఎన్నాళ్ళకెన్నాళ్ళకు..!
వాస్తవానికి వైసీపీ అధికారంలో ఉన్నన్ని రోజులు సిట్టింగ్ ఎమ్మెల్యేలు, ఎంపీలు సైతం జగన్ రెడ్డిని కలవాలంటే అదొక పెద్ద టాస్క్. సజ్జల రామకృష్ణారెడ్డి, ధనుంజయ రెడ్డి ఇలా కొన్ని కోటరీలను దాటి ముందుకు వెళ్ళాలి. నేరుగా జగన్ తోనే చెప్పుకున్నా తిరిగి మళ్ళీ సజ్జల, ధనంజయ దగ్గరికి రావాల్సిన పరిస్థితి. దీంతో ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, మంత్రులు, మాజీలు చాలా మంది ఇబ్బంది పడేవారు. అటు అధినేతను కలవడానికి పెద్ద అగ్ని పరీక్షే ఎదుర్కోవాల్సి వచ్చింది. ఇటు నేరుగా ప్రజలను కలవడానికి వలంటీర్లు అనే ఒక అడ్డంకితో ఎమ్మెల్యేలు, ఎంపీలు తెగ ఇబ్బంది పడ్డారు. దీంతోనే 151 కాస్త 11కి పరిమితం అవ్వడానికి కారణం. అందుకే మొట్ట మొదట ఇదే ఛేడిస్తున్నారు జగన్. నేరుగా నేతలు, కార్యకర్తలు కలవొచ్చు.. అదే విధంగా జగనే నేరుగా నియోజకవర్గానికి వచ్చి కలవడం అంటే మంచి పరిణామమే.. వైసీపీకి మంచి రోజులు రాబోతున్నాయి అని రాజకీయ విశ్లేషకులు, విమర్శకులు చెబుతున్న పరిస్థితి. రైట్ ట్రాక్ లోకి వస్తున్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఆల్ ది వెరీ బెస్ట్..!