పవన్ గ్రీన్ సిగ్నల్.. ఏపీ బీజేపీకి కొత్త రథసారథి
అవును.. ఆంధ్రప్రదేశ్ బీజేపీకి కొత్త రథసారథి రాబోతున్నారు. అన్నీ అనుకున్నట్లు జరిగితే కొత్త ఏడాదికి కొత్త అధ్యక్షుడు రాబోతున్నారు. ఈ విషయాన్ని ఇటు ఆంధ్రా.. అటు ఢిల్లీ కమలనాథులు చెబుతున్నదే..! తెలంగాణతో పాటు ఆంధ్రాలోనూ కొత్త అధ్యక్షులు రాబోతున్నారని అగ్రనేతలు చెప్పకనే చెప్పేసారు. దీంతో ఆ ఇద్దరూ ఎవరు..? ఆ పదవి ఎవర్ని వరించబోతోంది..? అనేదానిపై అందరూ తెలుసుకునే పనిలో పడ్డారు. ఇవన్నీ ఒక ఎత్తయితే ఈ నియామకంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పాత్ర ఉండటం మరింత ఇంట్రెస్టింగ్ అయ్యింది.
బీ.. సీరియస్..!
2024 ఎన్నికల్లో 8 అసెంబ్లీ, మూడు పార్లమెంట్ స్థానాలు గెలుచుకున్న బీజేపీ ఇక ఫోకస్ అంతా పార్టీ బలోపేతంపైనే పెట్టింది. ఎంతలా అంటే రీపొద్దున్న టీడీపీతో సంబంధం లేకున్నా సరే, జనసేనతో కలిసి వెళ్లి అధికారం దక్కించుకోవాల్సిందే అన్నట్టుగా ప్లానింగ్ చేస్తున్నారని తెలిసింది. అసలే టీడీపీని పక్కనెట్టి కమలం, గ్లాస్ కలుస్తున్నాయని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఇది మరింత సంచలనం అయ్యింది. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డిని అధ్యక్షుడిగా నియమించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.
ఆయనే ఎందుకు..?
సీనియర్ నేత, సీఎంగా పనిచేసిన అనుభవం ఉన్న వ్యక్తి. దీనికి తోడు ఒక్క కాంగ్రెస్ పార్టీనే కాదు, అన్నీ పార్టీలతో సఖ్యతగా ముందుకెళ్లే మృదుస్వభావి, గల్లీ నుంచి ఢిల్లీ దాకా అందరికీ తెలిసిన, గుర్తున్న నేత. ఇవన్నీ ఒక ఎత్తయితే జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసిన లీడర్. ఒక్క ఆర్ఎస్ఎస్ బ్యాక్రౌండ్ తప్ప అధ్యక్షుడికి కావలసిన అన్ని లక్షణాలు ఉన్నాయని ఢిల్లి పెద్దలు భావిస్తున్నారు.
టార్గెట్ వైసీపీ..!
వాస్తవానికి ఏదైనా ఒక పార్టీ బలోపేతం కావాలంటే, తప్పకుండా ఒక్కో మెట్టు ఎక్కుతూ పైకి రావాలి. మునుపు ఎన్నడూ లేని విధంగా సీట్లు, ఓట్లు సంపాదించుకున్న బీజేపీ ఇప్పుడు అధికారంలో భాగస్వామ్యం అయ్యింది గనుక రానున్న ఎన్నికల్లో కలిసి పోటీ చేసినా, చేయకపోయినా తప్పకుండా మంచి ఫలితాలు దక్కించుకోవాలని చూస్తోంది. ఇందులో భాగంగానే మొదట ఇప్పుడు వైసీపీకి ఓటు బ్యాంకును కొల్లగొట్టడానికి అడుగులు వేస్తున్నట్టు తెలియవచ్చింది. ఎందుకంటే నల్లారి కిరణ్ రెడ్డి సమాజానికి చెందిన వ్యక్తి.. దీనికి తోడు రాయలసీమ.. అందులోనూ వైఎస్ జగన్ రెడ్డి పక్క జిల్లానే కావడంతో ఈయనతో అన్నీ సాధ్యమేనని కమలనాథులు భావిస్తున్నారు అని ఢిల్లి వర్గాలు చెబుతున్నాయి.
ఓకే చెప్పిన పవన్..!
రానున్న రోజుల్లో బీజేపీతోనే కలిసి నడవాలని భావిస్తున్న జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.. ఢిల్లీ పర్యటనలో అధ్యక్ష పదవి ప్రస్తావన రావడం, పలానా వ్యక్తి అనుకుంటున్నట్టు జేపీ నడ్డా లాంటి పెద్దలు చెప్పడంతో ఆయన కూడా ఓకే చెప్పేసారని తెలిసింది. సో.. నల్లారికి అన్ని వైపులా లైన్ క్లియర్ అయ్యింది అన్న మాట. మరోవైపు గత ఐదేళ్లుగా అడ్రెస్స్ లేని బీజేపీని ఈ పరిస్థితికి తెచ్చిన పురంధేశ్వరిని మార్చే అవకాశాలు లేనే లేవని కూడా చర్చ జరుగుతోంది. ఇక తెలంగాణలో మాత్రం మళ్ళీ బండి సంజయ్ కి అధ్యక్ష పదవి కట్టబెడతారని సమాచారం. ఇందులో నిజానిజాలు ఎంతో తెలియాలంటే.. కొత్త ఏడాది వరకూ వేచి చూడాల్సిందే.