తెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ మధ్య ఎందుకో అన్నీ రివర్స్ గేర్ రాజకీయాలు, తప్పటడుగులతో నడుస్తున్నాయని సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అసలు ఆయనకు సలహాలు, సూచనలు ఇస్తున్నది ఎవరోగానీ, ప్రతిపక్షాలకు అడ్డంగా దొరికిపోతూ విమర్శలు ఎదుర్కోవడం, జనాల్లో నవ్వులపాలు కావడం కామన్ ఐపోతోంది. తెలంగాణ అధికారిక చిహ్నం, తెలంగాణ గీతం, తెలంగాణ తల్లి విగ్రహం మార్పులు ఇలా ఒకటా రెండా ఎన్నో మార్పులు, చేర్పులు చేసిన సంగతి అందరికీ తెలిసే ఉంటుంది.
ఇప్పుడేమో ఇలా..!
నవంబర్ 29న శుక్రవారం ఓకే రోజు రెండు కీలక నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. ఇందులో ఒక విషయంలో వెనకడుగు కూడా ఒకే రోజు వేయడం చక చకా జరిగిపోయింది. ఇందులో ఒకటి గల్లీ నుంచి ఢిల్లి దాకా పెద్ద రచ్చ రేగిన లగచర్లలో భూసేకరణపై ఇచ్చిన జీవో ఉపసంహరించుకుంటూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇక పదో తరగతి ఇంటర్నల్ మార్కుల రద్దుపై అంటూ అధికారిక ప్రకటన చేయడం, సాయంత్రం అయ్యేసరికి అబ్బే అస్సలు వద్దంటే వద్దు అంటూ మార్కుల రద్దుపై వెనక్కి తగ్గింది. ఈ ఏడాది నుంచి కాకుండా వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమలు చేస్తున్నట్టు ప్రకటన చేసింది.
ఎందుకనీ..?
చూశారుగా ఒకే రోజు రెండు కీలక నిర్ణయాలపై రేవంత్ సర్కార్ వెనకడుగు వేయడం గమనార్హం. అసలు ఎవరు ఈ నిర్ణయాలు తీసుకోమన్నారు..? ఎందుకు వద్దు అనుకున్నారు..? ఇలాంటి చిన్న చిన్న తప్పులు ప్రతిపక్షాలకు అడ్డంగా దొరికిపోయినట్టు అయ్యింది. అంతమంది సలహాదారులు, పేరుగాంచిన విద్యాశాఖ అధికారులు, కమిషనర్ ఏం చేస్తున్నట్టు..? ఇదంతా రాష్ట్రానికి విద్యాశాఖ మంత్రి లేకపోవడం, ఆ శాఖ రేవంత్ రెడ్డి దగ్గరే ఉండటంతో ఇలాంటివన్నీ జరుగుతున్నాయని పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి.
ఈ మధ్యనే..!
అదానీపై అమెరికాలో కేసు నమోదు కావడం ఇండియాలోనే కాదు.. యావత్ ప్రపంచం మొత్తం ఇదొక హాట్ టాపిక్ అయ్యింది. ఈ క్రమంలో అదానీకి అన్నీ అమ్మేస్తున్నారనే విమర్శలు వచ్చాయి. విరాళం సరే తెర వెనుక అసలు సిసలు కథ వేరే ఉందని, తక్షణమే ఇప్పటి వరకూ జరిగిన ఒప్పందాలు, విరాళాలు అన్నీ రద్దు చేయాలని డిమాండ్ బీఆర్ఎస్ నుంచి పెద్ద ఎత్తున వచ్చింది. దీంతో చేసేదేమీ లేక తెలంగాణ స్కిల్ యూనివర్సిటీకి ఇచ్చిన విరాళంను వెనక్కి ఇస్తున్నట్టు స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి మీడియా ముందుకు వచ్చి ప్రకటించడం గమనార్హం. అంటే ఈ విరాళం వ్యవహారంపై కూడా ప్రభుత్వం వెనకడుగు వేసినట్టే.
ఏదో తేడా కొడుతోందిగా..!
పదేళ్ళ బీఆర్ఎస్ పాలనను వద్దనుకున్న తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీని గెలిపించారు. వాస్తవానికి వెంటిలేటర్ మీద ఉన్న కాంగ్రెస్ పార్టీకి ఊపిరిపోసి, అధికారంలోకి తెచ్చింది రేవంత్ రెడ్డే.. అందుకే మారుమాట మాట్లాడకుండా ఆయన్నే ముఖ్యమంత్రిని చేసింది కాంగ్రెస్ అధిష్ఠానం. అలాంటప్పుడు చిన్న చిన్న తప్పులే భూతద్దంలో చూసేంతలా పరిస్థితులు వస్తాయి. దీనికితోడు ఎలాంటి నిర్ణయం తీసుకున్నా సరే ఒకటి పదిసార్లు కాదు.. వెయ్యిసార్లు ఆలోచించి తీరాల్సిందే. ముఖ్యంగా విద్యాశాఖ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే కారు పార్టీ షెడ్డుకు పోవడానికి ఉన్న కారణాల్లో ఇది కూడా ఒకటి.
జాగ్రత్త సుమీ..!
అసలే హైడ్రా, మూసీ సుందరీకరణ, లగచర్ల ఘటన, ఇథనాల్ వ్యవహారం, హాస్టళ్లలో ఫుడ్ పాయిజన్ ఇలా ఒకటా రెండా చెప్పుకుంటూ పొతే చాలానే ఉన్నాయి. ఇవన్నీ ప్రజలు, ప్రతిపక్షాలు గమనిస్తున్నారు. అసలే మూడు, నాలుగేళ్లకు రావాల్సిన ప్రజా వ్యతిరేకత ఏడాదిలోనే వచ్చేసింది. ఇలాంటి తరుణంలో జాగ్రత్తగా ఆడుగులు వేయడమే మంచిది. బహుశా రేవంత్ సర్కార్.. ప్రజా వ్యతిరేకతతో తీసుకుంటున్న నిర్ణయాలే అని కొందరు మేధావులు చెబుతుంటే.. లేదు లేదు ఇదంతా బీఆర్ఎస్ విమర్శలకు చెక్ పెట్టడానికి వేస్తున్న తప్పటడుగులే? అన్నది రాజకీయ విశ్లేషకులు చెబుతున్న మాటలు. అందుకే జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకుని, సుపరిపాలన చేస్తూ ముందుకెళ్తే మంచిది మరి.