అవును.. వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మను ఎట్టి పరిస్థితుల్లోనూ అరెస్ట్ చేయాల్సిందే అని ఏపీ పోలీసులు కంకణం కట్టుకున్నారు. సోమవారం అంతా హైదరాబాద్ నగరంలో అన్ని చోట్లా వెతికినా దొరకకపోవడం, రెండుసార్లు నోటీసులు ఇచ్చినా విచారణకు హాజరుకాకపోవడంతో పోలీసులు ఆగ్రహంతో ఊగిపోతున్నారు. దీంతో మంగళవారం సాయంత్రానికల్లా అరెస్ట్ చేసి తీరాల్సిందే అని ప్రకాశం జిల్లా పోలీసులు ఫిక్స్ అయ్యారు. ఈ క్రమంలో ఎలాంటి న్యాయపరమైన ఇబ్బందులు రాకుండా నిపుణుల సలహాలు తీసుకొని, అరెస్ట్, సెర్చ్ వారెంట్ తీసుకుని హైదరాబాద్ విచ్చేశారు.
ఆగని గాలింపు..
కొన్ని బృందాలుగా విడిపోయిన పోలీసులు హైదరాబాద్ వచ్చి పలు ప్రాంతాల్లో వర్మ కోసం గాలిస్తున్నారు. మొబైల్ ఫోన్ స్విచ్చాఫ్ రావడంతో, వర్మ కాల్ డేటాను కూడా పోలీసులు పరిశీలిస్తున్నారు. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు ఆర్జీవీకి హైదరాబాద్ లోనే, పేరుగాంచిన ఓ సినీ హీరో ఆశ్రయం కల్పిస్తున్నట్టు పోలీసులు భావిస్తున్నారు. ఆ హీరోతో వర్మ ఫోన్ మాట్లాడుతున్నట్టు పోలీసులు గుర్తించారు. ఈ క్రమంలోనే చెన్నై, ముంబై పోలీసుల సహకారం అడిగారు. ఈ రెండు ప్రాంతాలకు కొందరు పోలీసులు కూడా వెళ్ళారు. మరో రెండు బృందాలు తమిళనాడు, కోయంబత్తూరుకు వెళ్లాయి.
ఎక్కడ ఉన్నట్టు?
ఫోన్ ట్రేస్ చేసిన హైదరాబాద్ లోనే ఒక ప్రాంతంలో ఉన్నట్టు, ఐపీ అడ్రస్ కూడా ఇక్కడే ఉన్నట్లు చూపిస్తున్న పక్కా సమాచారంతో పోలీసులు రంగప్రవేశం చేశారు. ఈ క్రమంలో శంషాబాద్, షాద్ నగర్ లోని రెండు ఫామ్ హౌసులపై పోలీసులు స్పెషల్ ఫోకస్ పెట్టారు. ఇవాళ సాయంత్రానికి వర్మను ఎలాగైనా అరెస్ట్ చేయాలని పోలీసులు పట్టుదలతో ఉన్నారు. ఇవాళ కానీ పక్షంలో వర్మకు లుకౌవుట్ నోటీసులు కూడా జారీ చేసే అవకాశం కనిపిస్తోంది. ఈ విషయం ముందే పసిగట్టిన లాయర్.. అటు వర్మ ఇటు పోలీసులతో మాట్లాడుతున్నట్టు సమాచారం.
లైన్ క్లియర్..
ఆర్జీవీ ముందస్తు బెయిల్‌పై ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. ఒంగోలు, విశాఖ, గుంటూరు జిల్లాలో తనపై నమోదైన కేసుల్లో ముందస్తు బెయిల్ కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ రేపటికి కోర్టు వాయిదా వేసింది. దీంతో ఇవాళ ఆయన్ను అరెస్ట్ చేయడానికి ఎలాంటి అడ్డంకి లేకుండా పోయింది. దీంతో ఇవాళ వర్మ అరెస్ట్ కావడం ఫిక్స్ అని తెలుస్తోంది. మొత్తానికి చూస్తే నాడు నేడే రాజు నేనే మంత్రి.. నేడు నేనే దొంగ నేనే పోలీస్ అన్నట్టుగా ఆర్జీవీ ప్రవర్తన ఉంది. సోషల్ మీడియాలో చెలరేగిపోయే వర్మ పిల్లిలా పారిపోవడం ఏంటి? అని టీడీపీ, జనసేన కార్యకర్తలు సోషల్ మీడియా వేదికగా దుమ్మెత్తి పోస్తున్నారు. ఇవాళ సాయంత్రానికి ఏం జరుగుతుందో చూడాలి మరి.