టాలీవుడ్ వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కనిపించుట లేదు. ఆర్జీవీ కోసం ప్రకాశం జిల్లా మద్దిపాడు నుంచి వచ్చిన పోలీసులు గాలిస్తున్నారు. పోలీసు వాహనాల్లో వస్తే వర్మ తప్పించుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ప్రైవేట్ కార్లలో వచ్చారు. ఆర్జీవీకి సంబంధించిన అన్ని ఇళ్లు, ఆఫీసులు వద్ద పోలీసులు మోహరించారు. ఆయన ఎక్కడ కనిపించినా అదుపులోనికి తీసుకొని ప్రకాశం జిల్లాకు తరలించాలని పోలీసులు భావిస్తున్నారు. ఐతే.. వర్మ మాత్రం ఎక్కడా కనిపించలేదు, వినిపించనూ లేదు.
డెన్ దగ్గర కూడా..!
మద్దిపాడు నుంచి భారీగానే పోలీసులు, హైదరాబాద్ పోలీసుల సహకారంతో వర్మను అదుపులోనికి తీసుకోవాలన్నది ప్లాన్. ఈ క్రమంలోనే డెన్, ఇళ్లు, ఆఫీసుల వద్ద పోలీసులు భారీగా మోహరించారు. మరోవైపు సిటీలో ఆర్జీవీ ఎక్కువగా తిరిగే ప్రాంతాల్లో సైతం ప్రైవేట్ కార్లలో వెతుకుతున్నారు. మరోవైపు పోలీసులు అరెస్ట్ చేయడానికే వచ్చారని గట్టిగానే పుకార్లు వినిపిస్తున్నాయి. ఐతే నోటీసులు ఇవ్వడానికే వచ్చారని కూడా చర్చ నడుస్తోంది. నోటీసులు ఇవ్వడానికి ఇంతలా హడావుడి ఉండదని, అరెస్ట్ చేయడానికే పోలీసులు ఇంత పెద్ద ఎత్తున వచ్చారని స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు.
సమయం లేదు సారీ..!
ఈ నెల 19న విచారణకు వర్మ హాజరుకావాల్సి ఉన్నప్పటికీ 4 రోజులు సమయం కావాలని ఆయన, ఆయన తరఫు లాయర్ పోలీసులను కోరారు. ఆ తర్వాత హైకోర్టును ఆశ్రయించి.. తనను అరెస్ట్ చేయకుండా బెయిల్ ఇవ్వాలని కోర్టులో వర్మ పిటీషన్ వేశాడు. ఐతే న్యాయస్థానం నిరాకరించడంతో ఎదురుదెబ్బ తగిలినట్టు అయ్యింది. ఐతే.. గడువు ముగిసినా హాజరు కాకపోవడంతో పోలీసులు మళ్ళీ రంగప్రవేశం చేశారు. ఐతే ఆయన అందుబాటులో లేరు. షూటింగ్ నిమిత్తం వేరే రాష్ట్రాలకు వెళ్ళాడని వర్మ తరఫు న్యాయవాది అంటున్నారు. గడువు ముగిసినా విచారణకు రాకపోవడం, కనీసం సమాచారం కూడా ఇవ్వకపోవడంతో అరెస్ట్ చేసి ఆర్జీవీని తీసుకెళ్ళడానికి పోలీసులు వచ్చారు కానీ ప్రయోజనం లేకుండా పోయింది. పోలీసుల తదుపరి కార్యాచరణ ఏంటి..? ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు? అనేదానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.