జగన్ రెడ్డిపై చంద్రబాబుకు రివెంజ్ తీర్చుకుంటారా?
నాడు స్కిల్ స్కాం కేసులో ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ, దేశంలోనే అత్యంత అనుభవం అని చెప్పుకునే టీడీపీ అధినేత నారా చంద్రబాబును.. వైసీపీ హయాంలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ అరెస్ట్ అప్పట్లో పెను సంచలనమే. ఎందుకంటే చంద్రబాబును టచ్ చేయడానికి సహసించని పెద్ద పెద్ద మహామహులే భయపడిపోయేవారు. అలాంటిది ఎన్నో విమర్శలు, అంతకు మించి ఆరోపణలు చేసినా ఒక్కటంటే ఒక్కటీ నిరూపించలేకపోయారు. ఆఖరికి వైఎస్ రాజశేఖర రెడ్డి కూడా బాబును టచ్ చేయడానికి ప్రయత్నించి, ఆఖరికి ఏమీ చేయలేకపోయారు. ఇదే మాట అసెంబ్లీ, మీడియా, బహిరంగ సభలు వేదికగా ఎన్నోసార్లు ఛాలెంజ్ చేసిన పరిస్థితి.
అక్రమమో.. సక్రమమో!
నాడు వైఎస్ జగన్ అరెస్టు, 16 నెలలకు పైగా జైలు శిక్ష అనుభవించడానికి కర్త, కర్మ, క్రియ చంద్రబాబు అన్నది వైసీపీ చేసిన, ఇప్పటికీ చేస్తున్న అతి పెద్ద ఆరోపణ. దీనికి తోడు, చంద్రబాబు సవాళ్లు ఇవన్నీ వెరసి జగన్ ఇగో హర్ట్ చేయడంతో ఇదంతా చేశారని ప్రత్యర్థులు చెబుతున్న మాట. ఐతే అది అక్రమమం అని టీడీపీ, సక్రమమే అని వైసీపీ ఇప్పటికీ గొడవలు పడుతూనే ఉన్నాయి. ఐతే ఇప్పుడు అదానీ సోలార్ విద్యుత్ ప్రాజెక్టు ముడుపుల కేసులో జగన్ పేరు రావడం పెద్ద సంచలనం. ఇప్పుడు ఈ కేసులో మాజీ సీఎం అరెస్ట్ అయినా అవ్వొచ్చు.
ఏం జరుగుతుంది?
ఈ ఆరోపణల నేపథ్యంలో వైఎస్ జగన్ రెడ్డిని ప్రాసిక్యూట్ చేయాలని టీడీపీ కూటమి ప్రభుత్వం భావిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. పీసీ చట్టం కింద కేసు నమోదు చేయొచ్చా? లేదా..? అనే కోణంలో ప్రభుత్వం న్యాయ సలహా కోరినట్టు తెలిసింది. అటు అమెరికాలో అదానీపై కేసు నమోదు కావడం, ఇటు జగన్ పేరు కూడా ప్రస్తావన వచ్చిందని టీడీపీ అండ్ కో గట్టిగానే ప్రచారం చేస్తున్నాయి. దీంతో ఇప్పుడు మాజీ సీఎం విషయంలో ఏం జరుగుతుందో అనేది సర్వత్రా ఆసక్తి నెలకొంది.
అయ్యే పనేనా..?
వాస్తవానికి.. అదానీకి ప్రధాని నరేంద్ర మోదీ మంచి సన్నిహిత సంబంధాలే ఉన్నాయి. ఇప్పుడు అమెరికా కేసు వ్యవహారం నిజమే అయితే.. మోదీ తలుచుకుంటే అదంతా ఫేక్ అని డీల్ చేయడానికి పెద్ద విషయమేమీ కాదన్నది విమర్శకులు, ప్రత్యర్థులు చెబుతున్న మాట. అలాంటిది అదానీ వ్యవహారంలో తలదూర్చి జగన్ రెడ్డిని అరెస్ట్ చేయడం అంటే అంత ఆషామాషీ కానే కాదు అన్నది తెలుగు రాష్ట్రాల రాజకీయ విశ్లేషకులు చెబుతున్న మాట. చంద్రబాబు చేతికి పాశుపతాస్త్రం దొరికింది.. జగన్ జుట్టు నిండా దొరికినట్టే. ఐనా సరే ఇక్కడ తీగ లాగితే డొంక ఎటు నుంచి ఎటు వెళ్తుందో కూడా తెలియని పరిస్థితి.
గవర్నర్ ఒప్పుకుంటారా..?
లేదు జగన్ రెడ్డిపై రివెంజ్ తీర్చుకోవాలి? జగన్ అంటే ఏంటని తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, ప్రపంచానికి తెలియాలని.. వైసీపీ, ఆ పార్టీ అధినేత రూపు రేఖలు లేకుండా చేయాలని చంద్రబాబు భావించినా పెద్దగా ఆశ్చర్యపోనక్కర్లేదు అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఐతే జగన్ రెడ్డిని ఇప్పటికిప్పుడు అరెస్ట్ చేయాల్సి వస్తే పీసీ చట్టంలోని 17ఏ అధికరణం ప్రకారం రాష్ట్ర గవర్నర్ అనుమతి తప్పనిసరి. అలాంటప్పుడు గవర్నర్ కూడా న్యాయ నిపుణుల సలహాలు, సూచనలు.. అవసరం ఐతే కేంద్రంతో సంప్రదింపులు జరపాల్సి వస్తుంది. అలాంటప్పుడు కేంద్రం అనుమతి లేనిదే ఎలాంటి నిర్ణయం తీసుకోవడానికి వీలులేదు. ఒక్క అరెస్టుకు ఎన్ని చిక్కులు, అంతకు మించి చిక్కుముడులు ఉన్నాయో చూశారు కదా.. చంద్రబాబు ఈ అవకాశాన్ని ఎలా వాడుకుంటారో.. ఏం చేస్తారో చూడాలి మరి.