అవును.. మొన్నటి వరకూ పాదయాత్ర చేస్తే ముఖ్యమంత్రి కావడం పక్కా అనే ట్రెండ్ నడిచింది. అక్షరాలా నిజమైంది కూడా. ఐతే ఇప్పుడు సీన్ మారింది.. రోజులు సైతం పూర్తిగా మారిపోయాయి. ఇప్పుడు జైలు యాత్ర అదేనండీ జైలుకు వెళ్లి వస్తే సీఎం కావడం ఖాయంగా కనిపిస్తోంది. ఇందుకు తెలుగు రాష్ట్రాలు మొదలుకుని వివిధ రాష్ట్రాల్లో నెలకొన్న పరిణామాలు చూస్తే మీకు ఇట్టే అర్థమవుతుంది.
నాడు.. నేడు!
వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో అరెస్ట్ అయ్యి బయటికి వచ్చిన తరవాత, పాదయాత్ర చేయడం తద్వారా 2019 ఎన్నికల్లో కలలో కూడా ఊహించని రీతిలో 151 అసెంబ్లీ సీట్లతో వైసీపీని గెలిపించుకుని, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఆ తర్వాత స్కిల్ స్కాం కేసులో అరెస్ట్ అయ్యి, బయటికి వచ్చిన నారా చంద్రబాబు నాయుడు సైతం 2024 ఎన్నికల్లో ఎన్డీఏ కూటమిని గెలించుకుని సత్తా చాటారు. ఇందులో పవన్ కళ్యాణ్ పాత్ర కూడా ఉంది. బాబు సీఎం కాగా, పవన్ డిప్యూటీ అయ్యారు.
ఇక్కడా అదే సీన్..
ఇక తెలంగాణలో కూడా అదే సీన్ రిపీట్ అయ్యింది. బీఆర్ఎస్ అధికారంలో ఉండగా రేవంత్ రెడ్డిని బంతాట ఆడుకుంది. ఎంతలా అంటే ఎక్కడ పడితే ఎక్కడ, ఎప్పుడు పడితే అప్పుడు ఓటుకు నోటు కేసు మొదలుకుని ఎన్నో కేసుల్లో అరెస్ట్ చేసిన పరిస్థితి. ఆఖరికి బెడ్ రూమ్ బద్దలుకొట్టి మరీ పోలీసులు అరెస్ట్ చేశారు. అలా ఆయన్ను ఎన్ని కేసుల్లో, ఎన్ని సార్లు అరెస్ట్ చేశారనేది లెక్కే లేదు. అప్పటి నుంచి కసితో, అంతకు మించి పట్టుదల.. దీనికి తోడు హైకమాండ్ ఆశీర్వాదాలు మెండుగా ఉండటం, ఈయన కూడా పాదయాత్ర చేయడం, 2023 ఎన్నికల్లో ఎవరూ ఊహించని విధంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు.
తెలుగు టూ ఝార్ఖండ్!
తెలుగు రాష్ట్రాల్లోని ఈ సీన్ ఝార్ఖండ్ రాష్ట్రానికి మారింది. కేంద్రంలోని బీజేపీతో పోరాడారు. దీంతో తొలిసారి సీఎంగా ఉన్నప్పుడు హేమంత్ సోరేన్ జైలుపాలు కావాల్సి వచ్చింది. తీరా చూస్తే పదవి పోవడం, మళ్ళీ ఎన్నికలు రావడంతో 2024 ఎన్నికల్లో సోరేన్ మళ్ళీ గెలిచెన్, సీఎం కూడా కాబోతున్నారు. అంటూ గర్వంగా కార్యకర్తలు, అభిమానులు ఎగిరి గంతేసిన పరిస్థితి. ఇందులో కాంగ్రెస్, ఆర్జేడీ పాత్ర కూడా ఉంది. ఈ మూడు పార్టీల ధాటికి బీజేపీ కూటమి అట్టర్ ప్లాప్ అయ్యింది. మోదీ - షా ద్వయం వ్యూహాలు ఏ మాత్రం వర్కవుట్ కాలేదు. చూశారుగా.. ఇదీ జైలు యాత్ర, ముఖ్యమంత్రుల తాలూకు స్టోరీ. రేపు పొద్దున్న తెలుగు రాష్ట్రాల్లో పరిస్థితి ఎలా ఉంటుందో చూడాలి మరి.