ఇటీవల అల్లు అర్జున్ కి మెగాభిమానుల సెగ తగులుతున్నట్టు - తారక్ కి తెలుగు తమ్ముళ్ల తాకిడి చాన్నాళ్ల నుంచే ఉంది. ఎప్పటికప్పుడు కారణం మారుతోంది, దూరం మరింత పెరుగుతోంది తప్ప ఇప్పట్లో జూనియర్ ని తెలుగు తమ్ముళ్లు కనికరించేలా కనిపించట్లేదు.
వైసీపీ అభ్యర్థి పట్ల సానుకూలంగా స్పందించాడని అల్లు అర్జున్ పై జనసేన జనాలు ఎంత గుర్రుగా ఉన్నారో... చంద్రబాబు అరెస్టు వంటి కీలక సమయంలోనూ స్పందించకుండా మౌనంగా ఉన్నందుకు తారక్ పట్ల తెలుగు తమ్ముళ్లు అంతకు పదింతలు పగబట్టేసారు. దేవరకి మిశ్రమ స్పందన వెలువడడంలో యాంటీ ఫ్యాన్సే కాదు టీడీపీ సోషల్ మీడియా యాక్టివిస్టులు కూడా ఒక కారణం అనే చెప్పొచ్చు.
ఇక వాళ్ళు తాజాగా తారక్ పై సంధిస్తోన్న విమర్శనాస్త్రం ఏమిటంటే.. నందమూరి జానకిరామ్ చనిపోయినపుడు చంద్రబాబు, లోకేష్ దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తూ సానుభూతి తెలిపారట. నారా రోహిత్ స్వయంగా వెళ్లి పరామర్శించాడట. అలాగే నందమూరి హరికృష్ణ స్వర్గస్తులైనపుడు నారా వారి కుటుంబమంతా కదిలి వెళ్లిందట. చంద్రబాబు స్వయంగా పాడె మోసారట. మరి నారా రోహిత్ తండ్రి, చంద్రబాబు కి స్వయానా సోదరుడు అయిన రామ్మూర్తి నాయుడు దివంగతులైతే నీ వైపు నుంచి కనీస స్పందన కొరవడిందే... ఇదేనా ఎన్ఠీఆర్ నీ సంస్కారం అంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. కనీసం కళ్యాణ్ రామ్ లో కూడా చలనం లేకపోవడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
బహుశా ఎన్ఠీఆర్, కళ్యాణ్ రామ్ లు వ్యక్తిగతంగా నారా రోహిత్ ని పరామర్శించి ఉండవచ్చు. ఆ పరామర్శ ప్రచారంలోకి రాకపోవడం అనేదే ఈ విమర్శలకు కారణం అవుతూ ఉండొచ్చు. లేక నిజంగానే సోదరులిద్దరూ స్పందంచలేదంటే మాత్రం తెలుగు తమ్ముళ్ల ఆవేదనకీ, ఆగ్రహానికి అర్ధం ఉందనే అంగీకరించాలి అందరూ!!