ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ప్రాంగణంలో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కారెక్కేందుకు వస్తుండటం చూసి, శాసనమండలి ప్రతిపక్ష నేత, వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ ఎదురుగా నిలబడ్డారు. పవన్ కంటపడిన బొత్స నమస్కారం పెట్టారు. బొత్స స్పందనను చూసి ఆయనకు ఎదురెళ్లిన డిప్యూటీ నమస్కారం పెట్టి, అనంతరం ఒకరికొకరు ఆలింగనం చేసుకున్నారు. బొత్స భుజం తట్టిన పవన్ మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు.
అంతా సైలెంట్..!
బొత్సతో పాటు సీనియర్ నేతలు, మాజీ మంత్రులు ఉన్నప్పటికీ ఎవరూ పవన్ దగ్గరికి వెళ్ళలేదు. ఈ పరిణామాన్ని చూసి అవాక్కైన పెదిరెడ్డి రామచంద్రారెడ్డి, ఇతర ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు పక్కకు తప్పుకున్నారు. జరుగుతున్న ఈ పరిణామాల్ని దూరం నుంచి చూస్తూ వైసీపీ నేతలు అయోమయంలో పడ్డారు. ఐతే పెద్దిరెడ్డి మాత్రం నవ్వుతూనే అక్కడినుంచి వచ్చేశారు. ఈ ఘటన తాలూకు వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అసలే వైసీపీకి గడ్డుకాలం అనుకుంటూ ఉన్న పరిస్థితుల్లో ఈ ఘటన జరగడం అందరినీ ఆలోచనలో పడేసింది. మరోవైపు అధిష్ఠానం సైతం బెంబేలెత్తిపోయిందని అంతా చర్చించుకుంటున్నారు.
ఏదో తేడాగా ఉందే..!
ఎమ్మెల్యేగా ఓడిన బొత్సను ఎమ్మెల్సీ చేసి మండలికి పంపారు జగన్. దీంతో పాటు సీనియర్ కావడంతో ప్రతిపక్ష నేతగా ప్రమోషన్ కూడా ఇచ్చారు. జగన్ తనపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా ప్రభుత్వాన్ని ప్రతి విషయంలోనూ ప్రశ్నిస్తూ పదవికి న్యాయం చేస్తున్నారు. వైఎస్ జగన్ కూడా ఆయన తీరుపై సంతృప్తిగా ఉన్నారు. బహుశా జగన్ అసెంబ్లీకి వెళ్ళినా ఇంతలా మాట్లాడేవారు కాదేమో అని అందరూ చర్చించుకుంటున్న పరిస్థితి. ఈ క్రమంలో బొత్స - పవన్ కరచాలనం, ఆలింగనంతో ఒక్కరిగా అందరూ ఆశ్చర్యపోతున్నారు. కొంపదీసి బొత్స జనసేనలోకి జంప్ అవుతున్నారా? ఏంటి అని అటు వైసీపీలో.. ఇటు జనసేనలో పెద్ద ఎత్తునే చర్చించుకుంటున్న పరిస్థితి. ఐతే ఇదంతా మర్యాదపూర్వకంగానే జరిగిందని.. అందులోనూ అనుకొకుండా జరిగిన పరిణామం అని కొందరి వైసీపీ నేతలు, కార్యకర్తలు చెప్పుకుంటున్నారు. దీనిపై బొత్స.. పవన్ ఎలా స్పందిస్తారో చూడాలి మరి.