ప్రస్తుతం కూటమి ప్రభుత్వం డైరెక్ట్ గా రివెంజ్ తీర్చుకోకుండా టీడీపీ కార్యకర్తలు నేతలు ద్వారా కేసులు పెట్టించి ఇండైరెక్ట్ గా రివెంజ్ ప్లాన్ చేసింది. ఇప్పటికే టీడీపీ, జనసేనలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వారందరూ ఒక్కొక్కరూ జైలుకెళుతున్నారు. చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ లపై ఇష్టం వచ్చినట్టుగా నోరు పారేసుకున్న బోరుగడ్డ అనిల్, RGV, పోసాని, శ్రీ రెడ్డి, కొడాలి నాని ఇలా చాలామందిపై కేసులు నమోదు అయ్యాయి. కొడాలి, వంశీ వల్లభనేని లు ఎప్పుడెప్పుడు కేసులు నమోదు అవుతాయా అని టీడీపీ కార్యకర్తలు ఎదురు చూస్తున్నారు.
తాజాగా వల్లభనేని ప్రధాన అనుచరుడు మోహనరంగా అరెస్ట్, మరో అనుచరుడు శేషు పరారీలో ఉన్నట్లుగా తెలుస్తుంది. టీడీపీ నేత కాసనేని రంగబాబుపై దాడి కేసులో మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అనుచరులను పోలీసులు అరెస్ట్ చేశారు.ఈ కేసులో వంశీ ప్రధాన అనుచరుడు ఓలుపల్లి మోహనరంగాతో పాటు మరికొందరు ఉన్నారు.
ఈరోజు మంగళవారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో వివిధ ప్రాంతాల్లో వీరిని అదుపులోకి తీసుకుని పోలీసు స్టేషన్లకు తరలించారు. ఈ ఏడాది జనవరి లో గన్నవరం పీఏసీఎస్ఓ మాజీ అధ్యక్షుడు, తెలుగుదేశం నేత కాసనేని రంగబాబుపై వంశీ అనుచరులు దాడి చేశారు. తనపై దాడికి పాల్పడింది వల్లభనేని వంశీ అనుచరులేనని పోలీసులకు రంగబాబు ఫిర్యాదు చేశారు.
వంశీ అనచురుల దాడిలో రంగబాబు కాలికి గాయం కావడంతో పిన్నమనేని ఆసుపత్రిలో చికిత్స పొందారు. అయితే అప్పట్లో జగన్ ప్రభుత్వం వంశీ అనుచరుల కేసుని దర్యాప్తు చెయ్యకుండా పక్కనపెట్టేసింది. ఈ ఘటనలో తొమ్మిది మందిని నిందితులుగా గుర్తించారు. ఎనిమిది బృందాలతో ఏకకాలంలో పోలీసులు ఇవాళ తెల్లవారుజామున మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ప్రధాన అనుచరులైన ఓలుపల్లి మోహనరంగా, అనగాని రవి, భీమవరపు యేతంధ్ర రామకృష్ణ అలియాస్ రాము, మేచినేని బాబు, సూరపనేని అనీల్, గోన్నూరి సీమయ్య, గుర్రం నానీని అరెస్టు చేశారు. వంశీ మరో ప్రధాన అనుచరుడు శేషు తృటిలో తప్పించుకున్నట్లు పోలీసులు భావిస్తున్నారు. శేషు కోసం పోలీసులు గాలిస్తున్నారు.