పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.. వైసీపీ హయాంలో ఓ వెలుగు వెలిగిన లీడర్. ప్రస్తుత సీఎం చంద్రబాబుకు బద్దశతృవు. ఈ పగ, ప్రతీకారాలు ఇప్పుడు కాదు ఈ ఇద్దరూ తిరుపతిలోని ఎస్వీ యూనివర్సిటీలో చదువుకున్న రోజులవి. అధికారంలో ఎవరు ఉన్నా లేకున్నా ఒకరిపై ఒకరు విమర్శలు, ఆరోపణలు కామన్. ఆఖరికి కుప్పం నియోజకవర్గంలో చంద్రబాబును ఓడించడానికి ఆయన చేసిన భగీరథ ప్రయత్నాలు అన్నీ, ఇన్నికావు. అలా ఉన్న పెద్దిరెడ్డి.. ఎందుకో వైసీపీ ఓటమిపాలయ్యక అడ్రెస్స్ లేరు. పెద్దాయనకు ఏమైంది..? అని అభిమానులు, అనుచరులు, కార్యకర్తలు చర్చించుకుంటున్నారు.
నాడు.. నేడు!
వైసీపీ అధికారంలో ఉన్నన్ని రోజులు మంత్రిగా, రాయలసీమ కో ఆర్డినేటర్ పదవిలో ఉంటూ పార్టీకి అన్నీ విధాలుగా చేదోడు వాదోడుగా ఉన్నారు. ఎక్కడ ఏ నేతకు సమస్య వచ్చినా సరే గంటల వ్యవధిలోనే వాలిపోయి, పరిష్కార మార్గం చూపేవారు. కానీ ఇప్పుడు సొంత నియోజవర్గం పుంగనూరులో కార్యకర్తలకు కనీసం ధైర్యం చెప్పి అండగా ఉండలేకపోతున్నారు. దీనికి తోడు కనీసం అధినేతకు అయినా పెద్దిరెడ్డి దర్శనం ఉందా? అంటే అదీ లేదు. నాడు అంత జోరుగా, హుషారుగా ఉండే పెద్దిరెడ్డి.. నేడు అంతకు డబుల్ సైలెంట్ మోడ్ లోకి వెళ్ళిపోయారు. పోనీ పార్టీ పరంగా ఏమైనా విబేధాలు వచ్చాయా? అంటే అది కూడా కాదు.
భయమా..!
వాస్తవానికి టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చాక వైసీపీ హయాంలో విర్రవిగిన ఒక్కో కార్యకర్త, నేతల వెన్ను విరుస్తున్నారు. ఇప్పటికే పదుల సంఖ్యలో అరెస్టులు జరగ్గా, త్వరలోనే నేతల వైపు గురి పెట్టడానికి ప్రభుత్వ పెద్దలు రంగం సిద్ధం చేశారు. ఇప్పటికే పోసాని కృష్ణ మురళీ, కొడాలి నాని, వల్లభనేని వంశీలపై పెద్ద ఎత్తున కేసులు నమోదు అవుతున్నాయి. ఇక పెద్దిరెడ్డి విషయానికి వస్తే.. నాడు అధికారాన్ని అడ్డుపెట్టుకొని చేసిన ఘోరాలు, కబ్జాల జాబితా ఇప్పటికే బయటికి వచ్చింది. మదనపల్లి లో ఫైల్స్ కాలిపోవడానికి కర్త, కర్మ, క్రియ అన్నప్పటికీ తరవాత సర్కార్ నిరూపించలేకుపోయింది. ఐతే నాడు యువగళం పాదయాత్రలో నారా లోకేష్.. పాపాల పెద్దిరెడ్డి సంగతి చూస్తానని పదే పదే చెబుతూ వచ్చారు.
బ్యాలెన్స్ చేస్తున్నారా..?
పెద్దిరెడ్డి తండ్రి సమానుడు అని వైఎస్ జగన్ చెప్పిన మాటలు అందరికీ గుర్తుండే ఉంటుంది. అలాంటిది కొడుకు లాంటి జగన్, ఆయన పార్టీ కష్టాల్లో ఉంటే ఈయన ఎక్కడ ఉన్నారు? ఏమైపోయారు? అనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మిగిలింది. ఐతే ఇప్పుడు ప్రభుత్వం మారిన తర్వాత పెద్దిరెడ్డి పప్పులు పెద్దగా ఉడకట్లేదని, అందుకే కొంతకాలం సైలెంట్ ఐతే అటు రాజకీయపరంగా, ఇటు వ్యాపార పరంగా అన్ని విధాలుగా సేఫ్ అయినట్టు ఉంటుందని కనిపించీ కనిపించకుండా.. విమర్శలు అంతంత మాత్రమే చేస్తూ బ్యాలెన్స్ చేస్తున్నారట.
ఆఫ్రికాలో ఉన్నారా..?
కూటమి అధికారంలోకి రాగానే ఒకవైపు మిథున్ రెడ్డి, ఇంకోవైపు పెద్దిరెడ్డి బ్రదర్స్ ఇద్దరికీ గట్టిగానే బెదిరింపులు వెళ్ళాయనే చర్చ కూడా నడుస్తోంది. ఎందుకు వచ్చిన తలనొప్పి అని అంటీముట్టనట్టుగా పెద్దాయన పార్టీతో ఉంటూ వస్తున్నారని తెలుస్తోంది. దీనికి తోడు ఫలితాలకు ముందే పరిస్థితి తెలుసుకున్న పెద్దిరెడ్డి తన మైనింగ్ వ్యాపారానికి సంబంధించిన సామాగ్రిని ఆఫ్రికాకు తరలించేసి, అక్కడ మైనింగ్ వ్యవహారాలు చేస్తున్నట్టు స్వయంగా ఈయన కుటుంబమే చెప్పిన పరిస్థితి. ఇక కొద్దిరోజుల పాటు ఆఫ్రికాలో ఉండాలని భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఎన్నాళ్ళు ఇలా సేఫ్ గేమ్ ఆడుతూ పెద్దిరెడ్డి ఉంటారో చూడాలి మరి.