ఆంధ్రప్రదేశ్ శాసన మండలిలో శాంతి భద్రతలు, లా అండ్ ఆర్డరుపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యల పట్ల సుధీర్ఘ చర్చ జరిగింది. ఈ క్రమంలో మండలి వైసీపీ పక్షనేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ శాంతి భద్రతలపై ఆందోళన వ్యక్తం చేస్తూ మాట్లాడారు. కూటమి ప్రభుత్వం వచ్చాక వీధికో రౌడీ తయారయ్యాడని, రాష్ట్రాల్లో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని బొత్స వ్యాఖ్యానించారు. అంతేకాదు టీడీపీ కూటమి ప్రభుత్వం ఏర్పడిన ఐదు మాసాల్లోనే పదుల సంఖ్యలో మహిళలపై అత్యాచారాలు, హత్యలు జరిగాయని బొత్స ఆరోపించారు. ఈ వ్యాఖ్యలపై హోం మంత్రి వంగలపూడి అనిత బదులిచ్చారు. మంత్రి సమాధానంతో చర్చ వాడివేడిగా మారింది.
దమ్ము ఉంటే..!!
రాష్ట్రంలో మహిళలపై క్రైం రేట్ 2024కు వచ్చేసరికి తగ్గింది. నిర్భయ చట్టం ఉన్నా దిశ లేని చట్టాన్ని వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చింది. దిశ పోలీస్ స్టేషన్లు గతంలో ఏర్పాటు చేశారు. వాటిని ఇప్పుడు మహిళ పోలీస్ స్టేషన్లగా మార్చాం. దిశ చట్టానికి చట్టబద్ధతే లేదు. దిశ యాప్, చట్టం పని చేస్తే మహిళలపై అఘాయిత్యాలు ఎందుకు పెరిగాయి? అత్యాచార ఘటనలను రాజకీయం చేయొద్దు. గతంలో మహిళలపై అత్యాచారాలు జరిగితే జగన్ ప్రభుత్వం కనీసం పట్టించుకోలేదు. పరామర్శకు వెళ్లిన మాపైనే కేసులు పెట్టారు. పోలీసుల వైఫల్యం ఇప్పటిది కాదు.. వైసీపీ హయాం నాటిది. కూటమి ప్రభుత్వంలో పోలీసులు 24 నుంచి 48 గంటల్లో నేరస్థుల్ని పట్టుకుంటున్నారు. దమ్ము ధైర్యం అంటూ అనిత మాట్లాడారు.
నిరసన.. ఇదేం పద్ధతి!
ఐతే.. దిశా చట్టంపై హోం మంత్రి ఇచ్చిన సమాధానాన్ని నిరసిస్తూ వైసీపీ సభ్యులు వాకౌట్ చేశారు. మరోవైపు హోం మంత్రి వ్యాఖ్యలను చైర్మన్ ఖండించారు. బాద్యత గల మంత్రిగా ఉండి.. దమ్ము ధైర్యం గురించి మాట్లాడం సరైనది కాదని చెప్పారు చైర్మన్. దీంతో క్షమించండి అధ్యక్షా అంటూ హోం మంత్రి సైలెంట్ అయ్యారు. అనంతరం సభలో, సభ బయట మీడియా పాయింట్ వద్ద వైసీపీ ఎమ్మెల్సీలు మాట్లాడారు. ఎమ్మెల్సీ వరుదు కల్యాణి మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మహిళలపై నేరాలు, వేధింపులు పెరిగాయని ఆరోపించారు. రాష్ట్రంలో రోజుకు 59 నేరాలు మహిళలపై జరుగుతున్నాయన్నారు. ప్రతి గంటకు ఇద్దరు, ముగ్గురు మహిళలపై అఘాయిత్యాలు జరుగుతున్నాయని, రాష్ట్రంలో ప్రభుత్వం, పోలీసులు వైఫల్యం వలన మహిళలు, చిన్నారులపై నేరాలు జరుగుతున్నాయని ఆరోపించారు. మచ్చుమర్రిలో 9 ఏళ్ల బాలికపై అత్యాచారం చేసి చంపేస్తే ఇవాళ్టికీ కూడా మృతదేహం దొరకలేదని కొన్ని ఘటనలను ఉదహరించారు.
మీరే సమస్య సృష్టిస్తే ఎలా..?
ఈ క్రమంలో టీడీపీ విప్ లపై మండలి చైర్మన్ మోషేన్ రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. విప్ లు సభను సమన్వయ పరచాలి కానీ మిరే సమస్య సృష్టిస్తే ఎలా..? అంటూ మాట్లాడారు. ఎమ్మెల్సీ కల్పలత మాట్లాడుతూ రాష్ట్రంలో మహిళలపై నేరాలు తారా స్థాయికి చేరాయన్నారు. మహిళలపై ప్రతి రోజు దారుణమైన నేరాలు జరుగుతున్నాయని, మహిళలపై జరుగుతున్న నేరాల నియంత్రణపై ప్రభుత్వం దృష్టి పెట్టాలని ప్రభుత్వాన్ని కోరారు. మరో ఎమ్మెల్సీ ఏసు రత్నం మాట్లాడుతూ మహిళలపై నేరాల నియంత్రణకు గతంలో దిశ పోలీసు స్టేషన్లు తెచ్చారని, వాటి వలన రాష్ట్రంలో మహిళలపై జరిగిన నేరాల కేసులు త్వరగా విచారిస్తున్నారనీ తెలిపారు. దిశ చట్టం అమలు కోసం ఈ ప్రభుత్వం కృషి చేయాలన్నారు. కేంద్రాన్ని ఒప్పించి ఆ చట్టాన్ని ఆమోదింపజేయాలని ప్రభుత్వానికి సూచించారు. వేగంగా శిక్షలు పడితేనే మహిళలపై నేరాలు తగ్గుతాయని, దిశ చట్టం అమలులోకి వస్తేనే ఇవన్నీ జరుగుతాయని ఏసు రత్నం తెలిపారు.