హెడ్డింగ్ చూడగానే కాస్త వింతగా.. అంతకు మించి విచిత్రంగా అనిపించింది కదూ.. అవును మీరు వింటున్నది, చూస్తున్నది అక్షరాలా నిజమే. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కోసం వైసీపీ పని చేస్తోంది. అదీ మామూలుగా కాదు బన్నీని ఎవరైనా విమర్శించినా, ట్రోల్ చేసినా దిమ్మతిరిగేలా కౌంటర్ ఇచ్చేంత. ఆయన్ను తమ హీరో అని భావించి ఆకాశానికి ఎత్తేసేంతలా వైసీపీ కార్యకర్తలు, జగన్ వీరాభిమానులు పనిచేస్తున్నారు. ఇంకా చెప్పాలంటే పుష్ప 2 సినిమాను దగ్గరుండి బ్లాక్ బస్టర్ హిట్ చేయడానికి శాయశక్తులా ప్రయత్నాలు చేస్తున్న పరిస్థితి.
ఏం చేస్తున్నారు..?
అల్లు అర్జున్ అంటే ఎందుకో ఈ మధ్య వైసీపీకి బాగా ప్రేమ పుట్టుకొచ్చింది. ఈ క్రమంలోనే పాట్నాలో జరిగిన పుష్ప 2 ఈవెంట్, ఆయన స్పీచ్ ఒక రేంజిలో వైరల్ చేయడాన్ని గమనిస్తే ఎంత ప్రేమ, అభిమానులు చూపిస్తున్నారో అర్థం అవుతుంది. దీనికి తోడు ట్రైలర్, అందులోని డైలాగ్స్ కట్ చేసి మరీ తెగ ప్రమోట్ చేశారు. ఈ క్రమంలో ఎవరైనా బన్నీని పల్లెత్తు మాట అంటే చాలు కౌంటర్ ఎటాక్ చేస్తున్న పరిస్థితి. ఇలా సమయం, సందర్భం వచ్చినప్పుడల్లా జగన్ నిజ జీవితంలో హీరో ఐతే.. రీల్ జీవితంలో అల్లు అర్జున్ అన్నట్టుగా వైసీపీ కార్యకర్తలు ఫీల్ అయ్యి గట్టిగానే పని చేస్తున్నారు.
ఎవరిస్తారో రండి!
వాస్తవానికి అల్లు అర్జున్.. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మధ్య ఎలాంటి పరిచయాలు, కనీసం పలకరింపులు లేకపోయినా ఆ కనెక్షన్ మాత్రం వైసీపీ కార్యకర్తలకు అలా కుదిరిపోయింది. ఇందుకు కారణం నంద్యాల ఎమ్మెల్యేగా పనిచేసిన శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి. ఈ ఇద్దరు ప్రాణ స్నేహితులు. ఎన్నికల సమయంలో నంద్యాలకు వచ్చి మిత్రుడికి మద్దతు ఇవ్వడం, మెగా ఫ్యామిలీలో మునుపెన్నడూ లేనివిధంగా గొడవలు జరగడం, కేసులు, కోర్టులు దాకా కూడా వెళ్ళడం ఇవన్నీ మనం చూసినవే. అప్పటినుంచి బన్నీతో వైసీపీకి బాండింగ్ అమాంతం పెరిగిపోయింది. అందుకే.. మా కోసం నిలబడ్డావ్.. మరి నీ కోసం మేము నిలబడాలిగా.. అంటూ అల్లు వారి అబ్బాయికి అండగా నిలబడుతున్నారు. ఇప్పుడు కొత్తగా సోషల్ మీడియాలో అసలు ఆంధ్రాలో పుష్ప 2 మూవీ రిలీజ్ అవుతుందా అని కొందరు.. రిలీజ్ అయినా ధియేటర్లలో ఆడే పరిస్థితి ఉందా అని మరికొందరు ప్రత్యర్థులు హడావుడి చేస్తున్నారు. దీనికి వైసీపీసేన స్పందిస్తూ ఎవరు అడ్డుకుంటారో చూద్దాం రండి అంటూ రెచ్చిపోతున్నది.
శత్రువుకు శత్రువు మిత్రుడు!
ఎన్నికల సమయంలో మనవైపు నిలబడ్డారు.. దీనికి తోడు ప్రత్యర్థి పార్టీలు టీడీపీ, జనసేనకు శత్రువు. ముఖ్యంగా ప్రస్తుత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు కూడా ఒకింత శత్రువే ఇది ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా జగమెరిగిన సత్యమే. ఈ విషయం మెగాభిమానులకు చాలా బాగా తెలుసు కూడా. అందుకే శత్రువుకు శత్రువు మనకు మిత్రుడు అన్నట్టుగా వైసీపీ ఫీల్ అవుతోంది. ఇంకా చెప్పాలంటే రేపు సినిమా రిలీజ్ అయ్యాక దగ్గరుండి, మూవీని భుజానికి, నెత్తికి ఎత్తుకొని బ్లాక్ బస్టర్ చేయడానికి కూడా ఏ మాత్రం వెనుకడుగు వేసేలా లేరు. చూశారుగా ఎటు నుంచి ఎటు వచ్చిందో బంధం. ఈ బంధం ఎక్కడిదాకా వెళ్తుందో.. ఆఖరికి ఎక్కడ ఆగుతుందో చూడాలి మరి.