పవన్ కళ్యాణ్ ని నమ్ముకుని నిర్మాతలు రిలీజ్ తేదీలు ప్రకటిస్తే అనుకున్న సమయానికి తమ సినిమాలను విడుదల చేయగలుగుతారా, అసలు అది పవన్ తో సాధ్యమయ్యే పనేనా అనేది ఇప్పుడు కాదు ఏడాదిన్నర కాలంగా వినబడుతున్న ప్రశ్న. ఈ విషయంలో పవన్ తప్పు కూడా లేదు.
ఆయన డిప్యూటీ సీఎం హోదాలో బోలేడన్ని బాధ్యతలు మొయ్యాలి. ఈమధ్యనే సినిమా సెట్స్ లోకి వెళ్లిన పవన్ కళ్యాణ్ ముందుగా వీరమల్లు షూటింగ్ లో పాల్గొన్నారు. పవన్ కళ్యాణ్ కోసం అమరావతిలో సెట్ వేసి మరీ మేకర్స్ షూటింగ్ కంప్లీట్ చెయ్యడానికి తహతహలాడుతున్నారు. పవన్ వచ్చారు కదా అని హరి హర వీరమల్లు 2025 మార్చ్ 28 విడుదల అని ప్రకటించేసారు.
మరోపక్క OG మేకర్స్ పవన్ కోసం వెయిటింగ్. కానీ పవన్ ఇప్పుడు హరి హర వీరమల్లు షూటింగ్ కూడా పక్కన పెట్టి ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొంటున్నారు. మరోపక్క బీజేపీ తో స్నేహం కోసం మహారాష్ట్ర ఎన్నికల ప్రచారానికి పవన్ సన్నద్ధమయ్యారు. అదే పవన్ అభిమానుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తుంది.
ఈ నెల 20న జరిగే మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు కోసం సర్వశక్తులొడ్డుతున్న అధికార ఎన్డీయే కూటమి.. ఏపీలో తమ మిత్రపక్ష నేత అయిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సాయం కోరింది. ముంబైలో తెలుగు వారు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో పవన్ కళ్యాణ్ ప్రచారం చేయాలని కోరగా.. ఆయన కూడా సరేనన్నారు.
ఇలా అయితే పవన్ మళ్ళీ సెట్ లోకి వచ్చేది ఎప్పుడు, సినిమాలు పూర్తి చేసేది ఎప్పుడు, ఈ లెక్కన పవన్ ని నమ్ముకుని సినిమాల రిలీజ్ డేట్స్ వేస్తె వాటిని రీచ్ అవడం జరిగే పనేనా..