ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోదరుడు నారా రామ్మూర్తి నాయుడు ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉంది. ప్రస్తుతం ఆయన హైదరాబాద్ లోని ప్రముఖ ఆస్పత్రి ఏఐజీలో చికిత్స పొందుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న మంత్రి నారా లోకేష్ హుటాహుటిన అమరావతి నుంచి హైదరాబాద్ బయలుదేరారు. ఇవాళ్టి కార్యక్రమాలు అన్నీ రద్దు చేసుకున్న లోకేష్.. అసెంబ్లీ సమావేశాలు నుంచి మధ్యలోనే బయటికి వచ్చి గన్నవరం విమానాశ్రయం నుంచి హైదరాబాద్ బయల్దేరారు.
బాబు కూడా..
ఢిల్లీ పర్యటన, ఆ తర్వాత మహారాష్ట్ర ఎన్నికల్లో సీఎం చంద్రబాబు బిజిబిజీగా ఉన్నారు. ఐతే ఈ రెండు కార్యక్రమాలు రద్దు చేసుకొని హైదరాబాద్ వచ్చేస్తున్నారు. ఢిల్లీలో కాంక్లేవ్ మధ్యలోనే చంద్రబాబు తిరుగు పయనం అయ్యారు. తప్పనిసరి పరిస్థితుల్లో
మహారాష్ట్ర ఎన్నికల ప్రచార పర్యటన రద్దు చేసుకోవాల్సి వచ్చింది. ఇవాళ మధ్యాహ్నం నేరుగా ఏఐజీ ఆసుపత్రికి చంద్రబాబు చేరుకోనున్నారు. కాగా.. నారా కర్జూర నాయుడు, అమ్మన్నమ్మ దంపతులకు రామ్మూర్తి నాయుడు రెండో కొడుకు. ఈయన చంద్రబాబు కంటే చిన్నవాడు.. తమ్ముడు అవుతారు. ఇతనికి ఇద్దరు పిల్లలు ఒకరు టాలీవుడ్ హీరో నారా రోహిత్, ఇంకొకరు నారా గిరీష్.
రాజకీయాల్లో కూడా..
అన్న చంద్రబాబు బాటలోనే రాజకీయాల్లోకి వచ్చి రామ్మూర్తి 1994 ఎన్నికల్లో టీడీపీ తరపున చంద్రగిరి అసెంబ్లీ నుంచి పోటీ చేసి గెలిచారు. ఆ తర్వాత 1999 ఎన్నికల్లో గల్లా అరుణకుమారి చేతిలో ఓటమిపాలయ్యారు. నాటి నుంచి రాజకీయాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. ఇందుకు కారణం ఆయనకు ఆరోగ్యం సహరించక పోవడమే అని కుటుంబ సభ్యులు చెబుతుంటారు. చంద్రబాబు తన తమ్ముడిని సరిగ్గా పట్టించుకోలేదని, రాజకీయంగా ఎదగనివ్వలేదని, గొలుసులతో ఇంట్లో కట్టేసారని ఎన్నెన్నో ఆరోపణలు ఆయన ప్రత్యర్థుల నుంచి వచ్చిన విషయం తెలిసిందే. ముఖ్యంగా వైసీపీ నుంచి ఇలాంటి విమర్శలు వచ్చాయి.
త్వరలో పెళ్లి.. ఇంతలో..!
ఇటీవలే నారా రోహిత్ నిశ్చితార్థం జరిగింది. ప్రతినిధి 2 సినిమా హీరోయిన్ సిరి లెల్లాతో ప్రేమలో పడిన రోహిత్ ఈ మధ్యనే సీఎం చంద్రబాబు, భువనేశ్వరి ఇంకా పెద్దల సమక్షంలో నిశ్చితార్థం చెకున్నారు. డిసెంబర్ నెలలో పెళ్లి చేసుకునే ప్రయత్నాల్లో ఉండగా అనుకోకుండా అతని తండ్రి ఆరోగ్య పరిస్థితి విషమించింది. ప్రస్తుతం ఆస్పత్రిలోనే అంటూ సపర్యలు చేస్తున్నారు. మరోవైపు అంతా మంచే జరగాలని ఆయన అభిమానులు, టీడీపీ కార్యకర్తలు, నేతలు కొరుకుంటున్నారు.