లోకేశ్ నిరూపిస్తే.. రాజకీయాలు వదిలేస్తా
అవును.. మీరు వింటున్నది నిజమే. విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌కు మాజీ మంత్రి అంబటి రాంబాబు ఛాలెంజ్ చేశారు. శాసనసభలో మీ తల్లిగారిని అవమానించినట్లు నిరూపిస్తే, బేషరతుగా క్షమాపణ చెప్పి, రాజకీయ నిష్క్రమణ చేస్తానని శపథం చేశారు. ఇప్పుడు సవాల్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పెను సంచలనమే అయ్యింది. వైసీపీ హయాంలో అసెంబ్లీ వేదికగా భువనేశ్వరి పేరు ప్రస్తావన వచ్చిందని, అవమానకరంగా ఆ పార్టీ సభ్యులు మాట్లాడారన్నది మొదట్నుంచీ ఉన్న ఆరోపణ. నాటి నుంచి నేటి వరకూ వైసీపీకి ఇదొక పెద్ద మైనస్‌గానే ఉండిపోయింది. ఎవరూ అవమానించలేదని వైసీపీ నేతలు చెబుతున్నప్పటికీ, నిరూపించలేకపోతున్నారు. 2024 ఎన్నికల్లో వైఎస్ జగన్ ఘోర పరాజయానికి ఇది కూడా ఒక కారణమే.
రెండ్రోజులుగా..
సోషల్ మీడియా కార్యకర్తల అరెస్ట్ అటు తిరిగి.. ఇటు తిరిగి అసెంబ్లీ దాకా వచ్చింది. అభ్యంతరకర కామెంట్స్ చేసేవారిని వైసీపీ పెంచి, పోషించిందని శాసన సభ, శాసన మండలిలో పెద్ద బర్నింగ్ టాపిక్ అయ్యింది. ఈ క్రమంలోనే వైసీపీ హయాంలో జరిగిన ఒక్కో విషయాన్ని వెలికి తీస్తోంది కూటమి ప్రభుత్వం. అసెంబ్లీకి రానప్పటికీ, మండలి ద్వారా వైసీపీ తన గళం వినిపిస్తోంది. ఇప్పుడు జగన్ ఎందుకు రాలేదు? అనే ప్రస్తావన వచ్చినప్పుడు, నాడు చంద్రబాబు కూడా రాలేదు, పారిపోయాడు అని వైసీపీ ఎమ్మెల్సీలు వ్యాఖ్యానించడంతో ఇది కాస్త రచ్చకు దారి తీసింది. ఎంతలా అంటే నారా లోకేశ్ లేచి.. నా తల్లిని అవమానించారు అంటూ కన్నెర్రజేసేంత. దీంతో రెండ్రోజులుగా దీనిపైనే అటు మండలిలో.. ఇటు మీడియా, సోషల్ మీడియాలో పెద్ద ఎత్తునే చర్చ జరుగుతోంది.
ఛాలెంజ్ సంగతేంటో?
నా తల్లిని తల్లిని అవమానించిన వాళ్లను ఊరికే వదిలి పెట్టాలా?, మీరు వాళ్లకు ఎందుకు టికెట్లు ఇచ్చారు? మేం ఏనాడైనా జగన్ కుటుంబ సభ్యులను అభ్యంతరకర మాటలతో మాట్లాడామా? అంటూ మండలి వేదికగా వైసీపీ సభ్యులకు గట్టిగానే క్లాస్ తీసుకున్నారు లోకేశ్. దీంతో ఈ వ్యవహారం మళ్లీ మొదటికి వచ్చింది. ఇందుకు స్పందించిన మాజీ మంత్రి అంబటి రాంబాబు.. ఇదే నిజమని నిరూపిస్తే క్షమాపణ చెప్పి, రాజకీయ నిష్క్రమణ చేస్తానని ఛాలెంజ్ చేశారు. అయితే అసెంబ్లీలో మాట్లాడినవన్నీ రికార్డులు, వీడియోలు ఉన్నాయని.. పనిలో పనిగా లోకేశ్ చెప్పేశారు. ఇప్పుడు ఈ ఛాలెంజ్‌పై లోకేశ్ నుంచి ఎలాంటి రియాక్షన్ వస్తుందో చూడాలి మరి.
అసలేం జరిగింది?
నాడు జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో మంత్రిగా ఉన్న అంబటిని గంట, అరగంట అంటూ ఎగతాళిగా మాట్లాడారు. దీంతో ఆయన సీరియస్‌గా స్పందించి ఇలాగైతే తాను కూడా ఎలిమినేటి మాధవరెడ్డి గురించి మాట్లాడాల్సి వస్తుందని అంబటి రాంబాబు అన్నారు. అయితే ఈ మాటలు తన సతీమణి గురించే అని భావించిన చంద్రబాబు తీవ్ర భావోద్వేగానికి లోనై, అసెంబ్లీ నుంచి బయటికి వచ్చారు. వస్తూ వస్తూ ముఖ్యమంత్రి అయ్యాకే అసెంబ్లీలోకి అడుగుపెడతానని, అప్పటి వరకూ కౌరవ సభకు రానంటే రానని శపథం చేసి బయటికి వచ్చేశారు. ఆ తర్వాత మీడియా ముందుకొచ్చి బావోద్వేగతంతో ఏడ్వటం, పరిణామాలన్నీ తెలిసిందే. నాడు ఈ మాటలు అన్నది అంబటి కాబట్టి, ఇప్పుడు అందరికంటే ముందుగానే రియాక్ట్ అయ్యి, ఇలా ఛాలెంజ్ చేశారు. అయితే.. సొంత పార్టీ నేతలు, కార్యకర్తలు అంబటిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాంబాబు ఎందుకిలా చేస్తున్నారు? ఇంతకీ ఈయన టీడీపీ కూటమికి మేలు చేస్తున్నారా? వైసీపీని, జగన్ రెడ్డిని ఇరికించడానికి ప్లాన్ చేస్తున్నారా? అంటూ మండిపడుతున్నారు.