ఈ మాటలు అన్నది మరెవరో కాదు.. స్వయానా వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తోడబుట్టిన చెల్లి వైఎస్ షర్మిల. ఓ వైపు ఆస్తుల వివాదం.. మరోవైపు వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తల అరెస్టుతో ఆ పార్టీ ఉక్కిరి బిక్కిరి అవుతోంది. ఈ గ్యాప్‌లో షర్మిల రంగంలోకి దిగి వైసీపీ, అధినేతపై దుమ్మెత్తిపోస్తున్నారు. దీంతో వైసీపీ, జగన్ వర్సెస్ చెల్లిగా పరిస్థితులు ఏర్పడ్డాయి. మంగళవారం నాడు టీడీపీ కూటమి ప్రభుత్వం ప్రవేశెట్టిన బడ్జెట్‌పై మీడియా మీట్ నిర్వహించిన ఆమె వైసీపీ సోషల్ మీడియా ప్రస్తావన తెచ్చారు. ఆ మాట రాగానే ఓ రేంజిలో ఆగ్రహంతో ఊగిపోయిన షర్మిల.. వైసీపీ సోషల్ మీడియా సైతం సైన్యం అని ఆరోపించారు. ఈ సైతాన్ సైన్యానికి నాయకుడు వైఎస్ జగన్ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. తనపై తప్పుడు ప్రచారం చేయించింది జగన్ మోహన్ రెడ్డే అన్నారు. విష నాగులతో పాటు అనకొండను పట్టాలంటూ ఆమె చెప్పుకొచ్చారు. ఇంతకీ ఆ అనకొండ ఎవరో ఏంటో షర్మిలకే తెలియాలి.
లిమిట్ ఉండాలి..
సోషల్ మీడియాలో నేను ఒక బాధితురాలిని. నన్ను, సునీత, అమ్మను నోటికొచ్చినట్లు మాట్లాడారు. అసభ్యకరంగా పోస్టులు పెట్టాలని చెప్పింది జగన్ మోహన్ రెడ్డినే. జగన్ వద్దని చెప్పి ఉంటే ఇవన్నీ అప్పుడే ఆగేవి. జగన్ నోరు విప్పి ఉంటే అప్పుడే చెక్ పడేది. సోషల్ మీడియాలో మా మీద అబద్ధాలు చెప్పారు, అక్రమ సంబంధాలు అంటగట్టారు. బూతులు కూడా తిట్టారు. ఇష్టం వచ్చినట్లు పోస్టులు పెట్టారు. ఒక సైతాన్ సైన్యం తయారయ్యింది. వీటికి చెక్ పడాలి.
మహిళలు రాజకీయాల్లో ఉండాలంటే భయపడే పరిస్థితికి తెచ్చారు. మా కుటుంబాల్లో కింద కామెంట్లు చదవొద్దు అనే చెప్పే పరిస్థితి ఉంది. సోషల్ మీడియాకు ఒక లిమిట్ అనేది ఉండాలి. రెగ్యులేట్ అనేది తప్పనిసరి. చర్యలు అనుక్షణం కొనసాగాలి. పట్టుకున్న వాళ్ళు అంతా విషనాగులు. కానీ వీళ్ళ వెనుక ఉన్న అనకొండను పట్టుకోవాలి. వాళ్ళపై కఠినంగా శిక్షలు ఉండాలి
రాజీనామా చేయండి..
వైఎస్ జగన్ అసెంబ్లీ సమావేశాలకు వెళ్లకపోవడాన్ని వైఎస్ షర్మిల తప్పుబట్టారు. మిమ్మల్ని గెలిపించింది ప్రజలు. మీకు భాధ్యత లేదా? ప్రతిపక్ష హోదా లేక పోతే మైకూ ఇవ్వరట. మైకు ఇవ్వక పోవడం మీ స్వయం కృతాపారథం. ఒకప్పుడు 151 సీట్లు ఇచ్చిన ప్రజలు 11 సీట్లు ఇప్పుడు ఎందుకు ఇచ్చారు? మీ అక్రమాలను, అవినీతిని ప్రజలు గమనించారు కాబట్టే 11 సీట్లకు పరిమితం చేశారు. మీకు ప్రజల తీర్పు మీద గౌరవం ఉండాలి కదా? అసెంబ్లీకి వెళ్లను అనడం అహకారానికి నిదర్శనం. జగన్ సమాధానం చెప్పాలి. వైసీపీ ఎమ్మెల్యేలను అడుగుతున్నాం. మీకు ప్రజలు ఓట్లు వేశారు. ఎమ్మెల్యే అంటే మెంబర్ ఆఫ్ అసెంబ్లీ. మీకు ఆలోచన లేదా? ప్రజలు మీకు ఓట్లు వేసింది అసెంబ్లీ వెళ్ళడానికి కదా? అసెంబ్లీకి పోకుంటే మీరు ప్రజలను వెన్నుపోటు పొడిచినట్లు కాదా? ప్రజలను మోసం చేసినట్లు కాదా? జగన్‌కు అంటే అహంకారం ఉంది. మీకు ఏమయ్యింది? ఇంట్లో కూర్చొని మాట్లాడటానికి కాదు కదా మీకు ఓట్లు వేసింది? మీ అజ్ఞానం ఏంటో బయటపడింది. వైసీపీ ఎమ్మెల్యేలకు ఇది భావ్యం కాదు. అసెంబ్లీకి పోయే ధైర్యం లేకపోతే రాజీనామా చేయండని షర్మిల డిమాండ్ చేశారు.