జగన్ వర్సెస్ పవన్.. మధ్యలో ఖాకీలు!
ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయాలు ఆసక్తికరంగా మారిపోయాయి. నేతలు ఒకరిపై ఒకరు మాటలు తూటాలు, సవాళ్లు, ప్రతి సవాళ్లు చేసుకుంటూ ఉండటంతో ఒక్కసారిగా హీటెక్కాయి. ముఖ్యంగా టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత గత వైసీపీ ప్రభుత్వంలో సోషల్ మీడియా వేదికగా అభ్యంతరకరంగా పోస్టులు చేసిన వారిపై స్పెషల్ ఫోకస్ పెట్టింది. ఇప్పటికే వందలాది మంది వైసీపీ కార్యకర్తలను అరెస్ట్ చేసిన పోలీసులు తాట తీస్తున్నారు. దీంతో కొందరు జాగ్రత్తపడి ముందుగానే ప్రభుత్వానికి క్షమాపణలు చెబుతుండటం, ఇంకెప్పుడు ఇలా అసభ్యంగా కానీ, కించపరుస్తూ గానీ పోస్టులు పెట్టమని స్పష్టం చేస్తున్నారు. అయితే అరెస్టులన్నీ అక్రమంగా జరుగుతున్నవేనని, అరెస్టులతో కార్యకర్తలను వేధిస్తున్నారని వైసీపీ నేతలు మండిపడుతున్న పరిస్థితి. ఈ పరిస్థితుల్లో మీడియా ముందుకొచ్చిన వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే, తప్పులను ఎత్తిచూపితే అరెస్టులు చేయడమేంటి? అని మండిపడ్డారు. అరెస్ట్ అయిన కార్యకర్తలకు అన్ని విధాలుగా అండగా ఉంటామని ప్రకటించారు. అంతేకాదు.. ఇప్పుడు ఏ పోలీసు అధికారులైతే నిబంధనలు ఉల్లంఘించి ఇలా చేస్తున్నారో వారిలో ఏ ఒక్కరినీ వదలనని హెచ్చరించారు. దీనికి తోడు రిటైర్ అయినా సరే, సప్త సముద్రాలు అవతల ఉన్నా సరే పట్టుకుంటాం, చట్టం ముందు నిలబెడతాం అని హెచ్చరించిన పరిస్థితి. ఈ వ్యాఖ్యలపై అధికార పార్టీ నేతలు, మేథావులు, రాజకీయ విశ్లేషకుల నుంచి తీవ్ర స్థాయిలో వ్యతిరేకత వచ్చింది. సీఎంగా పనిచేసిన వ్యక్తి ఇలాంటి కామెంట్స్ చేయడమేంటి? అని ఒకింత ఆశ్చర్యపోయి, ముక్కున వేలేసుకున్న పరిస్థితి.
ఈగ వాలినా..!
ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను బెదిరిస్తే సుమోటోగా కేసులు పెడతామని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. 20 ఏళ్లు అధికారంలో ఉంటామనే ధీమాతో అధికారులను ఇష్టమొచ్చినట్లు ఉపయోగించుకుని, ఘోర తప్పిదాలు చేశారని మాజీ సీఎంపై మండిపడ్డారు. అధికారులు వాళ్ల విధులు వాళ్లు నిర్వహిస్తారని, బెదిరిస్తే ఎవరూ బెదిరిపోరని గట్టిగానే పవన్ మాట్లాడారు. అంతేకాదు.. అధికారులపై చిన్న గాటు పడినా చూస్తూ ఊరుకోబోమని, వారిపై ఈగ వాలినా సరే మీరే బాధ్యత వహించాలని జగన్ పేరెత్తకుండానే ఇచ్చిపడేశారు పవన్. ప్రజాస్వామ్యాన్ని బలంగా తీసుకెళ్లాల్సిన నాయకులు, ఇష్టారాజ్యంగా మాట్లాడితే ఎలా? మాది మంచి ప్రభుత్వమే కానీ.. మెతక ప్రభుత్వం ఏ మాత్రం కానే కాదని జనసేనాని తేల్చి చెప్పేశారు. వైఎస్ షర్మిల అడితే ప్రభుత్వం భద్రత కల్పిస్తుందని చెప్పుకొచ్చారు. గుంటూరు జిల్లాలో జరిగిన అటవీశాఖ అమరవీరుల సంస్మరణ కార్యక్రమంలో పాల్గొన్న ఈ వ్యాఖ్యలు చేశారు.
అయ్యో.. పోలీస్!
మొత్తానికి చూస్తే.. ఇప్పుడు రాష్ట్ర రాజీయాలు అన్నీ ఖాకీల చుట్టూనే తిరుగుతున్నాయి. అదేదో అంటారే.. కరవమంటే కప్పకి కోపం, విడవమంటే పాముకి కోపం అన్నట్లుగా పరిస్థితులు ఏర్పడ్డాయి. ఎందుకంటే.. ప్రభుత్వాల మాట పోలీసులు వినక తప్పదు. అలా వినని పక్షంలో పరిస్థితులు వేరేలా ఉంటున్నాయి. దీనికి తోడు రేపొద్దున్న ప్రభుత్వం మారితే పరిస్థితి ఏంటి? అనేది ప్రశ్నార్థకంగా మారింది. వాస్తవానికి ఇప్పటికే వైఎస్ హయాంలో జరిగిన కొన్ని పరిణామాలతో కోర్టులు, కేసులు అంటూ ఇబ్బంది పడుతున్న పరిస్థితులను చూస్తూనే ఉన్నాం. మరోవైపు ముంబై నటి కాదంబరి జెత్వానీ కేసులో ముగ్గురు ఐపీఎస్ అధికారుల గురించి రోజూ వార్తలు వింటూనే ఉన్నాం. అందుకే ప్రభుత్వం చెప్పినట్లు, లేదా స్థానిక ఎమ్మెల్యేలు, ఎంపీలు చెప్పినట్లుగా కాకుండా వాళ్ల డ్యూటీని సక్రమంగా చేసుకనేలా ఫ్రీ హ్యాండ్ ఇస్తే మంచిది సుమీ. ఇప్పట్లో ఈ మాటల తూటాలు, అరెస్టులు మాత్రం ఆగే పరిస్థితులు ఏ మాత్రం కనిపించడం లేదు. చివరికి ఏం జరుగుతుందో. పరిస్థితులు ఎలా ఉంటాయో చూడాలి మరి.