జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సొంత నియోజకవర్గం పిఠాపురంలో 12 ఎకరాల భూమి కొనుగోలు చేశారు. ఇందుకు సంబంధించి రిజిస్ట్రేషన్ వ్యవహారాలన్నీ పవన్ తరఫున పౌరసరఫరాల కార్పొరేషన్ ఛైర్మన్ తోట సుధీర్ పూర్తి చేశారు. ఈ పనులన్నీ మంగళవారం పూర్తి కాగా బుధవారం నాడు అధికారికంగా ప్రకటన చేశారు. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు ఈ 12 ఎకరాల స్థలంలో ఇల్లు, క్యాంప్ ఆఫీస్‌ను పవన్ నిర్మించుకుంటున్నట్లు తెలిసింది. వాస్తవానికి ఎన్నికల ఫలితాల తర్వాతే పిఠాపురంలో ఇల్లు కట్టుకుంటానని నియోజకవర్గ ప్రజలకు మాటిచ్చారు. ఇందులో భాగంగానే ఇప్పటికే భోగాపురంలో 1.44 ఎకరాలు, ఇల్లింద్రాడ రెవెన్యూ పరిధిలో 2.08 ఎకరాలు స్థలం కొన్నారు. ఈ స్థలాలు ఆనుకునే మరోసారి భూములు కొన్నారు. సోమవారం నాడు పిఠాపురంలో పవన్ పర్యటించిన సంగతి తెలిసిందే. ఈ పర్యటనలో భాగంగా భూములు చూసిన పవన్ కొనుగోలు చేయడం జరిగింది.
పరుగులే.. పరుగులు
పిఠాపురంను ఆదర్శ నియోజకవర్గంగా తీర్చి దిద్దుతానని ఎన్నికల ముందు నారా చంద్రబాబు, పవన్ కల్యాణ్ మాటిచ్చారు. ఇందులో భాగంగా బుధవారం నాడు జరిగిన కేబినెట్ సమావేశంలో పిఠాపురం ఏరియా డెవలప్‌మెంట్ అథారిటీ ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. ఇదివరకే పవన్ సైతం పిఠాపురం నియోజకవర్గం అభివృద్ధి కోసం పాడా (పిఠాపురం ఏరియా డెవలప్‌మెంట్ ఏజెన్సీ) ను ఏర్పాటు చేస్తామని పవన్ ప్రకటించారు. ఈ రెండు పరిణామాలకు ముందే పవన్ 12 ఎకరాల భూమిని కొన్నారు. త్వరలోనే ఇంటి నిర్మాణ పనులు ప్రారంభం కాబోతున్నాయని తెలిసింది. మొత్తానికి చూస్తే పవన్ తాను అనుకున్నట్లే నియోజకవర్గాన్ని తీర్చి దిద్దడానికి సమయం ఆసన్నమైందనే చెప్పుకోవచ్చు. పవన్ తొలుత భూములు కొన్నాక రియల్‌స్టేట్ భూమ్ ఎలా పెరిగిందనేది అందరికీ గుర్తుండే ఉంటుంది. ఇటు రియల్ ఎస్టేట్.. అటు అభివృద్ధితో పిఠాపురం పరుగులు తీయనుందని చెప్పుకోవచ్చు.
విమర్శలు..
కేవలం 5 నెలల్లోనే మళ్ళీ 12 ఎకరాలతో కలిపి మొత్తం 15 ఎకరాల భూమిని పవన్ కొన్నారంటే మామూలు విషయం కాదంటూ సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 400 గజాల్లో ఇల్లు సరిపోతుందని మాట్లాడతాం కానీ పవన్‌కు మాత్రం ఎకరాలకు ఎకరాలు కావాలి అన్నమాట. ఎందుకు అంటే పూర్తిగా పారదర్శకత కాబట్టి అంటూ సెటైర్లు వేస్తున్న పరిస్థితి. ఊరికి ఒక పాలస్ అని వేరే వాళ్ళను అంటాం కానీ మనకి అవసరం లోక కల్యాణం కోసమా? అంటూ వైసీపీ కార్యకర్తలు సైతం విమర్శలు గుప్పిస్తున్నారు. అంతా పూర్తి పారదర్శకంగా కొంటారు.. ఎలాంటి వ్యాపారాలు లేవు.. అదేమంటే మొత్తం సినిమాలు చేసే కష్ట పడి సంపాదిస్తారు.. పిల్లలు సినిమా చేసి రూ. 100 కోట్ల కలక్షన్ చేస్తుంటే, ఒక్క సినిమా కూడా రూ. 100 కోట్ల కలక్షన్ రాకపోయినా.. ఒక్క హిట్ మాత్రమే 10 ఏళ్ల నుంచి ఉన్నా అంటా.. ఇదంతా పూర్తి పారదర్శకమే అంటూ సేనానిపై విమర్శలు వస్తున్నాయి. దీనిపై డిప్యూటీ సీఎం ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి మరి.