వైసీపీ ఏ క్షణాన ఎన్నికల్లో ఓడిపోయిందో నాటి నుంచి నేటి వరకూ మాజీ మంత్రులు, కీలక నేతల జంపింగ్‌లు ఆగట్లేదు. ఇంత జరుగుతున్నా అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మాత్రం మొద్దు నిద్రలోనే జోగుతున్నారనే విమర్శలు సొంత పార్టీ నుంచి వెల్లువెత్తుతున్నాయి. ఆ మధ్య బాలినేని శ్రీనివాసరెడ్డి పార్టీ మారుతున్న నేపథ్యంలో స్పందిస్తూ ఎవరు పోతే ఏంటి? పోతే ఏమవుతుంది? అని విర్రవీగేలా మీడియాకు సమాధానం ఇవ్వడం గమనార్హం. బాలినేని, సామినేని ఇలా వరుసగా జనసేనలోకి క్యూ కట్టారు. అయితే వీరంతా ద్వితియ శ్రేణి నేతలో లేదంటే కార్యకర్తలో అయితే ఏమన్నా అనుకోవచ్చు కానీ.. బిగ్ షాట్‌లే కావడం, కనీసం పిలిచి మాట్లాడలేదంటూ కార్యకర్తలే కన్నెర్రజేస్తున్నారు.
ఒకరా.. ఇద్దరా?
విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు ఇద్దరు మాజీ మంత్రులు జోగి రమేశ్, ఫైర్ బ్రాండ్ అనిల్ కుమార్ యాదవ్ జనసేనలోకి వెళ్తున్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే అగ్రిగోల్డ్ కేసులో కొడుకు అరెస్ట్, ఆ తర్వాత విచారాణ వ్యవహారాల తర్వాత పార్టీ కార్యక్రమాలకు జోగి దూరంగానే ఉంటున్నారు. దీనికి తోడు ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడిగా దేవినేని అవినాశ్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి దూరంగా ఉన్నారు. ఇలా వరుసగా పార్టీ కార్యక్రమాలకు, అధినేతకు దూరంగా ఉంటూ డుమ్మా కొడుతున్నారు. ఎందుకిలా జరుగుతోందనే అధిష్టానం ఆరా తీస్తే కేసుల నుంచి విముక్తి, ప్రశాంతంగా ఉండటానికి వైసీపీని వీడుతున్నట్లు లీకులు ఇచ్చారని సమాచారం. అన్నీ అనుకున్నట్లు జరిగితే అతి త్వరలోనే జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సమక్షంలో జోగి రమేశ్, ఆయన కుమారుడు జోగి రాజీవ్ ఇద్దరూ కండువా కప్పుకుంటారని తెలుస్తోంది. ఈయన తర్వాత భారీగానే జంపింగ్‌లు ఉంటాయని తెలుస్తోంది.
అవునా.. అనిల్?
నాడు వైఎస్.. నేడు వైఎస్ జగన్.. అనిల్‌కు రాజకీయంగా ఆదరణ ఇచ్చారు. దీంతో పాటు ఆయనకు వాక్ఛాతుర్యం ఉండటం, మాస్ లీడర్ కావడంతో బాగా కలిసొచ్చింది. దీంతో అతి తక్కువ కాలంలోనే అధినేతకు ఆప్త మిత్రుడిగా మారిపోయారు. దీంతో పార్టీ గెలవగానే అనుభవం లేకున్నా నీటి పారుదల శాఖ మంత్రి పదవి కట్టబెట్టారు జగన్. అయితే ఈ పదవిని అడ్డుపెట్టుకుని ఇష్టానుసారం మాట్లాడటం, జిల్లాలో పెద్దలుగా ఉన్న వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డితో పాటు ఇతరులను ఒక ఆట ఆడుకున్నారు. ఆఖరికి ఇలాంటి పిల్ల లీడర్లతో మాటలు పడటమేంటి? అని అవమానంతో వైసీపీకి గుడ్ బై చెప్పేసి టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు వేమిరెడ్డి దంపతులు. దీంతో ఈయన్ను మారిస్తే అయినా జిల్లాలో వైసీపీకి మంచి రోజులు వస్తాయేమో అని భావించి అక్కడ్నుంచి నరసారావుపేటకు షిఫ్ట్ చేశారు జగన్. ఓడిపోయిన తర్వాత ఒకట్రెండు కార్యక్రమాల్లో కనిపించిన అనిల్.. ఆ తర్వాత అడ్రస్ లేకుండా పోయారు. అయితే అనిల్ కూడా పార్టీ పట్ల, అధినేత పట్ల తీవ్ర అసంతృప్తితో తన అభిమాన, యంగ్ అండ్ డైనమిక్ లీడర్ పవన్ కల్యాణ్ పక్షాన చేరాలని డిసైడ్ అయ్యారట.
ఇంకెందరో..?
జోగి రమేశ్ వెళ్లొచ్చేమో కానీ.. అనిల్ పోయే అవకాశాలు ఏ మాత్రం లేవని వైసీపీ కార్యకర్తలు చెప్పుకుంటున్నారు. అయితే.. పాత కేసులన్నీ మరుగున పడి, శిక్షల నుంచి తప్పించుకోవాలంటే, వాషింగ్ పౌడర్ నిర్మలాగా మారాలంటే పార్టీ మారక తప్పదని భావించి అనిల్ ఈ నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. ఈ ఇద్దరు మాజీ మంత్రులతో పాటు ఒకరిద్దరు మాజీలు కూడా జనసేన తీర్థం పుచ్చుకుంటారట. మరోవైపు టీడీపీలోకి కూడా గట్టిగానే జంపింగ్‌లు ఉంటాయని తెలుస్తోంది. ఇందులో నిజానిజాలు ఎంతో తెలియాలంటే ఒకట్రెండు వేచి చూస్తే కానీ క్లారిటీ వచ్చేలా లేదు.