పవన్ హోం మాటలకు అర్థాలే వేరులే
డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కల్యాణ్ కాస్త హోం మంత్రి కాబోతున్నారా? డిప్యూటీతో పాటు హోం కూడా సేనాని చేతుల్లోకి వచ్చేస్తుందా? అంటే పిఠాపురం నియోజకవర్గం పర్యటనలో ఆయన చేసిన కామెంట్స్ చూస్తే ఇదే నిజమనిపిస్తోంది. హోం శాఖతో పాటు మంత్రి వంగలపూడి అనితపై కూడా సంచలన వ్యాఖ్యలు చేయడంతో రాష్ట్ర రాజకీయాల్లో ఇదే హాట్ టాపిక్ అయ్యింది. దీనికి తోడు నేనే హోం శాఖ తీసుకుంటే పరిస్థితులు వేరుగా ఉంటాయని ఘాటు వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ఈ వ్యాఖ్యలు హోం మంత్రి సరిగ్గా పనిచేయనట్టే.. అందుకే తాను తీసుకుంటాను అన్నట్లుగా ఉన్నాయని కొందరు నొచ్చుకుంటున్నారు కూడా. ఇంతకీ పవన్ ఎందుకిలా మాట్లాడారు? ఇంకా ఏమేం మాట్లాడారు? అనే విషయాలు చూసేద్దాం వచ్చేయండి మరి.
అవును.. నేనే!
వాస్తవానికి టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చాక నేరాలు, ఘోరాలు పెరిగిపోయాయన్నది వైసీపీ చేస్తున్న పెద్ద ఆరోపణ. అసలు శాంతి భద్రలు ఏపీలో ఉన్నాయా? లా అండ్ ఆర్డర్ ఏమైంది? అని అత్యాచారాలు, హత్య, దాడులతో సామాన్యుడి నుంచి కూడా ఇదే ప్రశ్న వస్తోంది. ఈ పరిస్థితుల్లో హోం శాఖ, లా అండ్ ఆర్డర్ గురించి ఇలాంటి వ్యాఖ్యలు చేయడంతో సంబంధిత మంత్రులు, ప్రభుత్వాన్ని ప్రశ్నించినట్టే.. అంటే వంగలపూడి అనిత, చంద్రబాబు సరిగ్గా పనిచేయనట్టే అని చెప్పకనే చెప్పేశారన్నది విమర్శకుల మాట. ఇలా చేస్తే నేనే హోంమంత్రిని అవుతాను. నేను హోంమంత్రిని అయితే పరిస్థితులు వేరేలా ఉంటాయి. విమర్శలు చేసే వారిని ఇలాగే వదిలేస్తే హోంమంత్రిగా నేను బాధ్యతలు తీసుకుంటాను. హోంమంత్రి అనిత రివ్యూ చేయాలి. లా అండ్ ఆర్డర్ చాలా కీలకం. పోలీసులు మర్చిపోకండి. నేతలు ఇలానే ఏమీ చేయకుండా నిశ్చలంగా ఉంటే హోంమంత్రి బాధ్యతలు కూడా నేనే తీసుకుంటాను.
హోం మంత్రిదే బాధ్యత..
క్రిమినల్స్‌కు కులం, మతం ఉండదు. పోలీసులకు ఎన్నిసార్లు చెప్పాలి? గత ఐదేళ్లలో ప్రభుత్వం పనిచేయలేదు. అందుకే ఆ పరిణామాలను ఇప్పుడు చూస్తున్నాం. ముఖ్యమంత్రిని చంపేస్తానని బెదిరించిన వ్యక్తిని పోలీసులు ఎందుకు వదిలేస్తున్నారు. ఇళ్లలోకి వెళ్లి మహిళపై అత్యాచారం చేస్తుంటే పోలీసులు ఏం చేస్తున్నారు?
అత్యాచార నిందితుల అరెస్ట్‌కు కులం అడ్డువస్తోందా? క్రిమినల్స్‌ను వదిలేయాలని ఏ చట్టం చెబుతోంది? అధికారులకు, ఎస్పీలకు చెబుతున్నా శాంతిభద్రతలు కీలకమైనవి. ఇటీవల జరిగిన అత్యాచార ఘటనలపై హోంమంత్రి బాధ్యత వహించాలి. పసికందులపై అత్యాచార ఘటనలు అత్యంత దారుణం. గతంలో చంద్రబాబు సతీమణిపై, నాపై.. నా కుమార్తెలపై వ్యక్తిగత విమర్శలు చేశారు. నాడు డీజీపీ సహా పోలీస్ అధికారులు ఎవరూ స్పందించలేదు. దాని ఫలితమే ఇప్పుడు చూస్తున్నాం. ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు గతంలో వైసీపీ నేతలు ప్రోత్సహించారు.
ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే..
లా అండ్ ఆర్డర్ బలంగా ఉండాలని సీఎం చంద్రబాబు, నేను మొదటినుంచి చెబుతున్నాం. అయినా పోలీసులు అలసత్వం వీడట్లేదు. ధర్మబద్ధంగా పని చేయండి అంటే మీనమేషాలు లెక్కిస్తున్నారు ఎందుకు? మూడేళ్ల ఆడబిడ్డను రేప్ చేసి చంపేస్తే కులం గురించి మాట్లాడుతున్నారు. కొందరు ఐపీఎస్ అధికారులు క్రిమినల్స్‌ను వెనకేసుకుని వచ్చేలా వ్యవహరిస్తున్నారు. ధైర్యం లేనివారు పోలీసులుగా ఉండడం ఎందుకు? ఉత్తర ప్రదేశ్‌లో అక్కడి సీఎం యోగి ఆదిత్యనాథ్ లాగా వ్యవహరిస్తేనే పరిస్థితి అదుపులోకి వస్తుంది. డీజీపీ ఇంటిలిజెన్స్ అధికారులు మేం బయటికొస్తే ప్రజలు మమ్మల్ని తిడుతున్నారు. క్రిమినల్స్‌ను అరెస్టు చేయడానికి ఎందుకు ముందుకు రావడం లేదు. నాకు డిప్యూటీ సీఎం పదవి ఎమ్మెల్యే ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే.
ఎమ్మెల్యేలూ.. ఏం చేస్తున్నారు?
వసతి గృహాల్లో ఉండే ఆడపిల్లలను కొందరు అధికారులు ఇబ్బంది పెడుతున్నారు.. ఈ విషయం నా దృష్టికి వచ్చింది. ఎంతమంది ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యేలు అక్కడికి వెళ్లారు. ఇసుకలో ఎంత వస్తుంది? అని కొంతమంది ఎమ్మెల్యేలు అడుగుతున్నారు అంతే తప్ప ఇటువంటి వాటిపై దృష్టి పెట్టడం లేదు’ అని హోం మంత్రి, పోలీసు వ్యవస్థ, కూటమి ఎమ్మెల్యేలపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఒకింత ప్రభుత్వంపై వ్యతిరేకంగానే పవన్ మాట్లాడారు. ఈ మాటలకు అర్థమేంటో ఆయనకే తెలియాల్సి ఉంది. దీనికితోడు సీఎం.. డిప్యూటీ సీఎంల మధ్య సంబంధాలు బెణికాయని కూడా వార్తలు గుప్పుమంటున్నాయి. ఈ పరిస్థితుల్లో పవన్ ఇలా మాట్లాడటం మరింత గ్యాప్ పెంచినట్లు అయ్యిందనే ఆరోపణలు వస్తున్నాయి. ఈ వ్యాఖ్యలపై అనిత, ఇతర పోలీసు ఉన్నతాధికారుల నుంచి ఎలాంటి రియాక్షన్ వస్తుందో చూడాలి మరి.