వైసీపీ హయాంలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వైజాగ్ వేదికగా రుషికొండపై రూ. 400 కోట్లతో కట్టిన ప్యాలెస్ సీఎం చంద్రబాబు కూల్చేస్తారా..? ఇప్పుడిదే యావత్ తెలుగు ప్రజల్లో మెదులుతున్న పెద్ద ప్రశ్న. నాడు అక్రమ కట్టడం అని ప్రజావేదికను అధికారంలోకి వచ్చిన రోజుల వ్యవధిలోనే వైసీపీ ప్రభుత్వం నేలమట్టం చేసింది. దానికి నాడు సర్కారు చెప్పిందేమిటంటే అక్రమ కట్టడం, అసలు అక్కర్లేని నిర్మాణం ఎందుకని కూల్చివేశారు జగన్. దీంతో కూల్చివేతలతో ప్రభుత్వం ప్రారంభమైందనే విమర్శలు వెల్లువెత్తాయి. నాటి నుంచి నేటి వరకూ వైసీపీకి ఇదొక పెద్ద మచ్చగానే మిగిలిపోయింది. అయితే.. ఇప్పుడు చంద్రబాబు కూడా రుషికొండ ప్యాలెస్‌ను కూల్చివేసే యోచనలో ఉన్నారన్నది రాష్ట్ర రాజకీయాల్లో నడుస్తున్న చర్చ.
ఎందుకనీ..?
వాస్తవానికి ప్రభుత్వం మారగానే ఏ ముఖ్యమంత్రి అయినా తన ముద్ర వేసుకోవడానికి చేయాల్సిన భగీరథ ప్రయత్నాలన్నీ చేస్తుంటారు. ఈ విషయంలో ఎవరేమీ తక్కువ కాదు. మూడు రాజధానుల పేరిట ఏదో చేసేద్దామని అనుకున్న వైఎస్ జగన్ ఆఖరికి ఒక్క ఇటుక కూడా వేయలేదు.. అడుగు ముందుకు పడలేదు. కానీ వైజాగ్ రాజధాని అని చెప్పుకోవడానికో.. లేదంటే వైజాగ్ రేంజ్ ఇదీ అని చెప్పుకోవడానికో కానీ రుషికొండపై కోట్లు కుమ్మరించి మరీ కట్టేశారు ప్యాలెస్. ఇన్ని దేశాలు తిరిగిన, విజనరీ లీడర్‌గా పేరుగాంచిన, అభివృద్ధికి కేరాఫ్ అడ్రస్ అని చెప్పుకునే నారా చంద్రబాబు కూడా కనివినీ ఎరుగని రీతిలో జగన్ నిర్మాణాలు చేపట్టారంటే అదేమీ ఆషామాషీ విషయమేమీ కాదన్నది వైసీపీ చెప్పుకుంటున్న మాట. అయితే ఇదే బిల్డింగ్ అమరావతి లేదా ఉమ్మడి గుంటూరు, విజయవాడ జిల్లాల్లో ఎక్కడున్నా సరే ఆ కథే వేరుగా ఉండేది. కొన్ని భవనాలు సీఎం, మరికొన్ని భవనాలు డిప్యూటీ సీఎం, ఇంకొన్ని భవనాలు నారా లోకేశ్.. ఇవన్నీ కాదు ఇదే ఒక సీఎంవోగా వాడుకోవడానికి సువర్ణావకాశంగా ఉండేదేమో. కానీ అటు ఇటు కాకుండా విశాఖపట్నంలో కావడంతో అక్కడికి వెళ్లలేని పరిస్థితి. అలాగనీ అలాగే వదిలేయని పరిస్థితి కూడా.
ఏం చేద్దాం..?
గంటన్నరపాటు ప్యాలెస్‌ను పరిశీలించిన చంద్రబాబుకు అసలు ఈ భవనాలను ఏం చేయాలి? అనేది తోచట్లేదు. ఒక్క మాటలో చెప్పాలంటే ఉంచలేం, అమ్మలేం, కూల్చలేం అన్నట్లుగా పరిస్థితి నెలకొంది. ఇలాగే ఉంచితే రోజుకు లక్ష రూపాయిలు నిర్వహణ ఖర్చు అవుతోంది. అలాంటిది నెల మొత్తం నెలలు, ఏడాది మొత్తం భరించాలంటే అస్సలు అయ్యే పని కానే కాదు. పోనీ అమ్ముదాం అంటే బంగారం లాంటి కట్టడం, భవనాలను అమ్మేశారు అని విమర్శలు కచ్చితంగా వస్తాయి. దీంతో ఎక్కడలేని చెడ్డపేరు వస్తుంది. ఇందులో ఎలాంటి సందేహాలు అక్కర్లేదు. పోనీ కూల్చుదామా? అంటే అసలే అప్పుల్లో ఉండే రాష్ట్రానికి, ఇది ఏదో ఒకరకంగా ఆదాయ వనరుగా ఉండేది కదా? అనే మాట ప్రత్యర్థులు, విమర్శల నుంచి మాటలు వస్తాయి. ఎందుకంటే.. ఇది టూరిజం డిపార్ట్‌మెంట్‌గా అప్పగించినా, లేదా ఏదైనా ప్రైవేట్ సంస్థకు అప్పగించినా ఏదో విధంగా అయితే నాలుగు రూపాయిలు అయితే కచ్చితంగా వస్తాయి. అలాంటప్పుడు ఏదో ఒక రీతిన వాడుకుంటే తప్ప మరో మార్గం అయితే కనిపిండం లేదు.
ఇప్పటి వరకూ ఇలా..!
వాస్తవానికి వలంటీర్ వ్యవస్థ, సచివాలయ వ్యవస్థ విషయంలో కొన్ని వర్గాల నుంచి ఎలాంటి విమర్శలు, ఆరోపణలు వస్తున్నాయో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఈ రెండు వ్యవస్థలకూ జగన్ హయాంలో చాలా వరకు సవ్యంగానే నడిచినా ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. ఎందుకంటే ఈ రెండు వ్యవస్థలను తీసేసి సర్పంచ్‌లు, వీఆర్వో, ఎమ్మార్వోలకు మాత్రమే పూర్తి అధికారులు కట్టబెట్టాలనేది ప్రధాన డిమాండ్. సింపుల్‌గా చెప్పాలంటే జగన్ అధికారంలోకి రాకముందు ఎలా ఉందో ఇప్పుడు కూలా అలా చేయాలన్నదే టీడీపీ కూటమి టార్గెట్‌గా కనిపిస్తోంది. దీనికి తోడు ఇప్పటికే సర్పంచ్‌ల సంఘాలు, కొందరు కూటమి నేతల బెదిరింపులను చూస్తూనే ఉన్నాం. దీంతో రేపొద్దున్న ఇంకాస్త గట్టిగా ఈ ఉద్యమం ఉదృతమైనా, ప్రభుత్వమే దగ్గరుండి చేయించి.. ఈ రెండు వ్యవస్థలను రద్దు చేసినా పెద్దగా ఆశ్చర్యపోనక్కర్లేదు అన్నది వైసీపీ ఆరోపణ. వలంటీర్లుకు 10వేలు ఇస్తానని, ఈ వ్యవస్థలను కొనసాగిస్తానని చెప్పింది కూడా ఇప్పుడున్న సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌లే. కానీ అధికారంలోకి ఇన్ని రోజులు అయినా వలంటీర్ వ్యవస్థ పరిస్థితి ప్రశ్నార్థకమే.
నేలమట్టమేనా..?
ఇప్పుడు రుషికొండ విషయంలో కూడా పర్యావరణ వేత్తలు లేదా ఇతరులను రెచ్చగొట్టి దీనిపై ఉవ్వెత్తున ఉద్యమం చేయించినా చేయించవచ్చన్నది వైసీపీ కార్యకర్తలు, నేతలు సోషల్ మీడియా వేదికగా లేవనెత్తుతున్న అనుమానం. అవసరమైతే రుషికొండ పరిరక్షణ సమితి అని కొత్తగా సంఘాలు, నేతలు పుట్టుకొచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అక్కర్లేదు. ఎందుకంటే ఇలాంటివన్నీ రాత్రికి రాత్రే పుడుతాయి కదా. పర్యావరణ వేత్తలు, మేథావులు, లేదు ఇవన్నీ కాదు రేపొద్దున్న భారీ వర్షాలు, తుఫాను, సునామీ లాంటిది వస్తే మరో వయనాడ్‌లా అయ్యే అవకాశం ఉందని.. కొండచరియలు విరిగిపడి భవనం మీద పడే అవకాశం ఉందని.. చివరాకరికి ప్యాలెస్‌ను నేలమట్టం చేసినా పెద్దగా ఆశ్చర్యపోనక్కర్లేదని టాక్ మాత్రం గట్టిగానే నడుస్తోంది. ఎందుకంటే ఈ భవనాలను ఏ విధంగా వాడుకోవాలో అర్థం కావట్లేదని చంద్రబాబు చెప్పడం కూడా మనం గమనించాం. అలాగనీ అమ్మినా, అలాగే ఉంచినా.. కూల్చినా ఇందులో ఏ ఒక్కటీ చేసినా ప్రభుత్వానికి పెద్ద తలకాయ నొప్పే మరి.
అరెస్ట్ చేస్తారా?
వాస్తవానికి అమరావతిలో ఇలాంటి కట్టడం కట్టాలంటే అస్సలు అయ్యే పని కానే కాదు. రేపొద్దున్న ఈ ప్యాలెస్ ఇలాగే ఉండి.. అమరావతిలో ఇంతకుమించి కట్టడాలు లేకపోతే, అన్ని కోట్లు పెట్టి కట్టిన చంద్రబాబు నిర్మాణాలకు.. జగన్ కట్టిన ఒకే ఒక్క ప్యాలెస్‌కు ఎంత తేడా ఉందో చూడండి అనే విమర్శలు రానూ రావచ్చు. అందుకనే ఈ ప్యాలెస్‌ను నేలమట్టం చేసినా చేయొచ్చన్నది అమరావతి వర్గాల సమాచారం. కూల్చివేత అనంతరం లేదా ముందే ఇంత ప్రజాధనాన్ని వృథా చేసినందుకు వైఎస్ జగన్‌ను కూడా అరెస్ట్ చేసినా చేయొచ్చేమో. ఎందుకంటే.. జరగాల్సిన తప్పు జరిగిపోయింది.. ఇలాంటి వాళ్లను కచ్చితంగా శిక్షించాలని మీడియా మీట్ మొత్తమ్మీద పదే పదే చంద్రబాబు చెప్పారు. దీంతో జగన్‌ను ఈ నిర్మాణం విషయంలో అరెస్ట్ చేయొచ్చన్నది కొందరు రాజకీయ విశ్లేషకుల మాట. ఇక చంద్రబాబు మనసులో ఏముందో..? ప్యాలెస్, ఆ ప్యాలెస్ కట్టిన జగన్ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి మరి.