అవును.. మీరు వింటున్నది అక్షరాలా నిజమే. వైఎస్ ఫ్యామిలీలో నెలకొన్న ఆస్తి వివాదాలకు అతి త్వరలోనే ఫుల్ స్టాప్ పడే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. ఇంట గెలిచి.. ఆ తర్వాతే రచ్చ గెలవాలని అన్నది పెద్దలు చెప్పిన నానుడి. అందుకే ఇంట గెలిచే పనిలో పడ్డారు వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. మూడు రోజుల పులివెందుల పర్యటనలో భాగంగా వైఎస్ ఫ్యామిలీలోని ముఖ్య బంధువులను కలుసుకున్నారు. ఎవరైతే ఇద్దరి మధ్య వివాదం లేకుండా సర్ది చెబుతారో.. ఎవరి మాటా ఐతే వైఎస్ షర్మిల వింటారో వారినే కలిశారు జగన్.
ఇదీ అసలు సంగతి..
విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు ఆస్తి గొడవలలో బంధువుల మద్దతు జగన్ రెడ్డికే ఉందట. అందుకే ఇక లాగే కొద్ది సమయం వృథా అని భావించిన జగన్.. కాంప్రమైజ్ అయ్యే దిశగా అడుగులు వేస్తున్నట్టు తెలియవచ్చింది. పులివెందుల పర్యటనలో
వైఎస్ ప్రకాష్ రెడ్డి, వైఎస్ భాస్కర్ రెడ్డి, మేనమామ రవీంద్రనాధ్ రెడ్డిలను జగన్ కలిసి మాట్లాడారట. ఇప్పుడు వైఎస్ ఫ్యామిలీ పెద్దగా ఉన్నది ఒకే ఒక్కరు.. ఆయనే జగన్ పెద్దనాన్న వైఎస్ ప్రకాష్ రెడ్డి. ఆయన్ను రంగంలోకి దించి మధ్యవర్తిత్వం చేయాలని జగన్ ఫిక్స్ అయ్యారట. ఈ మేరకు విషయాలన్నీ నిశితంగా వివరించారట. దీంతో త్వరలోనే విజయవాడ వేదికగా ఇద్దరి మధ్య పంచాయితీకి ప్రకాష్ ఫుల్ స్టాప్ పెట్టాలని భావిస్తున్నారట.
అటు.. ఇటు..!
వాస్తవానికి ఈ ఇద్దరి మధ్య వివాదంతో ఇటు వైసీపీకి కావాల్సినంత చెడ్డ పేరు వచ్చేసింది. ఇప్పటికే ఓటమి పాలవ్వడం, పార్టీ నేతలు జంప్ చేస్తూ ఉండటం, లోకల్ బాడీ ఎన్నికలు సమీపిస్తుండటం.. దీంతో పాటు లేనిపోని సమస్యలు ఉన్న నేపథ్యంలో ఆస్తి వివాదాలకు ఫుల్ స్టాప్ పెడితే కాస్త ప్రశాంతంగా ఉండొచ్చని భావిస్తున్నారట. మరోవైపు వైఎస్ షర్మిలకు కూడా కాంగ్రెస్ హైకమాండ్ నుంచి ఏమిటీ పంచాయితీ? పార్టీ పైన దృష్టి పెట్టేది ఉందా.. లేదా? అని గట్టిగానే క్లాస్ తీసుకున్నారట. అందుకే ఇటు జగన్.. అటు షర్మిల కూడా మధ్యవర్తిత్వంతో ఒకటి కావాలని భావిస్తున్నారట. అందుకే పెద్దనాన్న ద్వారా ఫుల్ స్టాప్ పెట్టాలని.. ఇందుకు తాడేపల్లి ప్యాలెస్ వేదికగా పంచాయితీ నడుస్తుందని తెలుస్తోంది. ఆస్తి లెక్కలు ఎంత వరకూ సామరస్యంగా తేలుతాయో.. ఏంటో చూడాలి మరి.