పంతం నానాజీ.. జనసేన పార్టీకి పెద్ద తలనొప్పిగా మారిపోయారు! ఎమ్మెల్యేగా గెలిచిన నాటి నుంచి నేటి వరకూ ఈయన చేసింది ఏమైనా ఉందా అంటే.. అది వివాదాల్లో మునిగి తేలడమే తప్ప, ఓట్లు వేసి గెలిపించిన ప్రజలకు పైసా ప్రయోజనం చేకూర్చే పని చేయలేదు. మొన్నటికి మొన్న మెడికల్ కాలేజీకి వెళ్లి నానా రచ్చ చేసిన సంగతి అందరికీ గుర్తుండే ఉంటుంది. దళిత ఉద్యోగిపై చేయి చేసుకోవడమే కాకుండా, ఇష్టానుసారం మాట్లాడి ఆఖరికి తప్పు అయ్యింది మహాప్రభో అని సదరు వ్యక్తికి మీడియా వేదికగా క్షమాపణలు చెప్పి.. చేసిన తప్పుకు ప్రాయశ్చిత్త దీక్ష చేశారు. ఈ వ్యవహారం ఇంకా సద్దుమణగక ముందే మరో బాగోతం బయటికి వచ్చింది.
ఏమిటీ పాడు పనులు!
సొంత పార్టీ కార్యకర్తనే పది లక్షల రూపాయిలు డిమాండ్ చేసి, ఇవ్వకపోవడంతో అతని షాపులపై బుల్డోజర్ పంపారు ఎమ్మెల్యే పంతం. దీంతో సొంత పార్టీ వారే తనకు అన్యాయం చేశారంటూ బాధితుడు, జనసేన కార్యకర్త వాపోతున్నాడు. కాకినాడలో ఓ స్థలం వివాదంలో తన నుంచి నానాజీ లక్షలు డిమాండ్ చేశాడని ఆకుల బాలరాజు అనే కార్యకర్త ఆరోపించాడు. ఐతే డబ్బులు ఇవ్వకపోయేసరికీ తాము కట్టుకున్న షాపును అధికారాన్ని ఉపయోగించి కూల్చి వేశారని.. పంతం నానాజీ, వైసీపీ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి బంధువు సత్తిరెడ్డికి అనుకూలంగా ఉన్నాడని బాలరాజు ఆరోపించాడు. ఐతే నానాజీకి ఇవన్నీ షరా మామూలే అని స్థానికులు, కొందరు కార్యకర్తలు చెప్పడం గమనార్హం.
అన్నీ ఉన్నా!
ఆకుల బాలరాజు 2000 సంవత్సరం నుంచి తన సొంత స్థలంలో టీ టైం పెట్టుకుని జీవనం సాగిస్తున్నాడు. ఇటు రాజకీయంగా పవన్ కళ్యాణ్ అంటే పిచ్చి. నియోజకవర్గంలో జనసేన తరపున క్రియాశీలక కార్యకర్తగా ఉండేవాడు. ఇటు బిజినెస్ పరంగా.. అటు రాజకీయంగా ఫుల్ యాక్టివ్ అయిన ఈ కార్యకర్తను మరింత ఎంకరేజ్ చేయాల్సిన ఎమ్మెల్యే పంతం నానాజీకి ఎందుకో నచ్చలేదట. వెంటనే తన మనుషులను పంపి 10 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేస్తే.. ఎందుకు ఇవ్వాలి? ఎవరి కష్టం ఇది..? అని గట్టిగా మాట్లాడటమే బాలరాజు చేసిన పెద్ద తప్పు. నిమిషాల్లోనే బుల్డోజర్ రావడం, పదంటే పది నిమిషాల్లోనే నేలమట్టం చేయడం అన్నీ చకచకా జరిగిపోయాయి. డాక్యుమెంట్ ఉన్నా, సొంత పార్టీ కార్యకర్త అని కూడా చూడకుండా 10 లక్షలు డిమాండ్ చేసి ఉపాధి లేకుండా ఎమ్మెల్యే చేశారని కంటతడి పెట్టుకున్నాడు కార్యకర్త.
ఒట్టు నిజమే..!
కాకినాడ జిల్లా సర్పవరం భావన్నారాయణ స్వామీ ఆలయం సమీపంలో 3 నెలల క్రిందట టీ దుకాణం నిర్మించుకున్నట్టు మాధవపట్నంకు చెందిన ఆకుల బాలరాజు చెబుతున్నాడు. టీ దుకాణం వెనుక ఉన్న 2వేల గజాల స్థలాన్ని బాలరాజు కొనుక్కోవాలంటూ కొద్ది రోజుల క్రిందట రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ, సర్పవరం నాయకుల మంతనాలు జరిపారు. స్ధలం కొనకపోతే 10 లక్షలు చెల్లించాలని హుకుం జారిచేసారని బాధితుడు వెల్లడించాడు. డబ్బులు చెల్లించకపోవడంతో నోటీసులు ఇవ్వకుండానే టీ దుకాణం కూల్చేసినట్టు మీడియా ముఖంగా తెలుపాడు. టీ దుకాణం నిర్మించుకున్న స్ధలాన్ని (266 గజాలు) 2000లో కొనుగోలు చేశానని బాలరాజు చెప్పాడు.
నాకేం ఇస్తావ్?
ఇవన్నీ ఒక ఎత్తయితే.. ఇటీవల సొంత పార్టీకి చెందిన ఎన్నారై ఒకరు నియోజకవర్గంలో స్పోర్ట్స్ అకాడమీ పెట్టాలని అనుకున్నట్టు ఎమ్మెల్యేను సంప్రదించగా.. ఇందుకు ఆయన స్పందిస్తూ అవునా.. మరి నాకేంటి? నాకు పార్టనర్ షిప్ ఇస్తావా? కమీషన్ ఇస్తావా? అని అడిగారట. ఇదేంటి ఇంత దారుణమా అంటూ అకాడమీ లేదు ఏమీ తన పాటికి తాను విదేశాలకు వెళ్ళిపోయాడట. ఇవి కేవలం బయటికి వచ్చిన విషయాలే.. ఇంకా లోలోపల ఎన్ని జరుగుతున్నాయో..? బయటికి చెప్పుకోలేని వాళ్ళు ఎంత మంది ఉన్నారో ఏంటో. చూశారుగా.. పార్టీని నమ్ముకున్న కార్యకర్తలను ఎంతలా ఇబ్బంది పెడుతున్నారో!
అయ్యా.. ఇటు చూడు!
కొంతమంది జనసేన ఎమ్మెల్యేలు విర్రవీగుతూ ఉన్నారనేది ఇప్పడు కాదు.. మొదటి నుంచీ గట్టిగానే వార్తలు వస్తున్నాయి. ఇందులో కొంతమందికి ఇప్పటికే గట్టిగా వార్నింగులు ఇవ్వడంతో దారిలోకి వచ్చారు. ఐతే పంతం నానాజీలో మాత్రం అస్సలు ఇసుమంత అయినా మార్పు రాలేదు. పదే పదే ఇలా వివాదాల్లో దూరడం, కార్యకర్తలను ఇబ్బంది పెట్టడం.. డబ్బులు డిమాండ్ చేయడం షరా మామూలే అయ్యాయి. నాడు ఉద్యోగిపై రెచ్చిపోయి దీక్ష చేసిన ఆయన.. ఇప్పుడు మళ్ళీ మీడియా ముందుకు వచ్చి ఏం చెబుతారో ఏంటో అంటూ సొంత పార్టీ వాళ్ళే సెటైర్లు వేస్తున్న పరిస్థితి. అందుకే ఈ పంథాలు పట్టింపులు ఏమైనా ఉంటే ప్రజలకు నాలుగు మంచి పనులు చేయడంలో చూపిస్తే మంచిది. ఇక పార్టీ అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.. ఇకనైనా స్పందించి నానాజీని దారిలోకి తెచ్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అసలే తొలిసారి ఇంతమంది ఎమ్మెల్యేలు గెలిచిన ఈ పరిస్థితుల్లో ఎంతో జాగ్రత్తగా మెలగాల్సి ఉంది.