అవును.. డిప్యూటీ సీఎం, సీఎంకు ఏ మాత్రం క్లారిటీ లేదు. ఎవరికి తోచినట్టుగా, వాళ్ళు మాట్లాడుతున్నారు. మహిళలకు ఉచిత బస్సు విషయంలో ఈ ఇద్దరి మాటలకు పొంతన లేకుండా పోయింది. ఈ పథకం రద్దు చేసే యోచనలో ప్రభుత్వం ఉందని డిప్యూటీ అంటే.. అబ్బే అస్సలు కానే కాదు అంతా తూచ్ అని సీఎం కవర్ చేస్తున్నారు. దీంతో రాష్ట్ర మహిళలు అసలేం జరుగుతోంది? ఏమిటీ మాటలు అంటూ ఆందోళన చెందుతున్న పరిస్థితి. ఇదంతా ఎక్కడ జరిగింది..? అనేదే కదా మీ సందేహం తెలుగు రాష్ట్రాల్లో మరీ ముఖ్యంగా ఆంధ్రాలో ఐతే కాదులెండి.
ఇదీ అసలు సంగతి..
ఫ్రీ బస్సు తీసేసే ఆలోచనలో కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ప్రకటన చేశారు. ఎందుకు అనే దానికి వివరణ ఇస్తూ మహిళలు ఉచిత బస్సు పథకం వద్దు అంటున్నారని.. డబ్బులతో టికెట్లు కొనుక్కొని ప్రయాణం చేస్తామని 5 నుంచి 10 శాతం అంటున్నారని చెప్పుకొచ్చారు. అందుకే ఈ ఉచిత సదుపాయాన్ని సమీక్షిస్తామని వెల్లడించారు. ముఖ్యంగా సోషల్ మీడియా, మెయిల్స్ ద్వారా కూడా మహిళల నుంచి వినతులు వస్తున్నాయని డిప్యూటీ సీఎం చెప్పడం గమనార్హం. దీనిపై రవాణా మంత్రి రామలింగా రెడ్డితో చర్చించి ఏం చేయాలి అనే దానిపై నిర్ణయం తీసుకుంటామని శివకుమార్ ప్రకటించారు. దీంతో ఒక్కసారిగా రాష్ట్ర మహిళలు ఆందోళన చెందుతున్నారు.
అయ్యో.. అదేం లేదు!
మీడియా, సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తడంతో నష్ట నివారణ చర్యలకు సీఎం సిద్దరామయ్య దిగి స్వయంగా క్లారిటీ ఇచ్చుకోవాల్సి వచ్చింది. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. శక్తి పథకం రద్దు చేస్తారంటూ వస్తున్న వార్తలన్నీ ఊహాగానాలే అని చెప్పుకొచ్చారు. శక్తి పథకాన్ని పునఃసమీక్షించే ప్రతిపాదన ప్రభుత్వం వద్ద లేనే లేదన్నారు సీఎం. ఒకవైపు ప్రజలు, మీడియా, సోషల్ మీడియా నుంచి తీవ్ర వ్యతిరేకత.. విమర్శలు వచ్చిన నేపథ్యంలో పెద్ద చిక్కు వచ్చి పడిందే అని మళ్ళీ మీడియా ముందుకు వచ్చిన డిప్యూటీ సీఎం వివరణ ఇచ్చారు. కర్ణాటకలో ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని పున:సమీక్షిస్తామని చేసిన వ్యాఖ్యలపై డిప్యూటీ సీఎం వెనక్కి తగ్గారు. ప్రభుత్వం ప్రకటించిన గ్యారంటీలను తప్పకుండా అమలు చేస్తామని, ఈ విషయంలో పున:సమీక్షించే ప్రశ్నే లేదని డిప్యూటీ సీఎం చెప్పుకొచ్చారు.
జర జాగ్రత్త!
చూశారుగా.. ఇదీ డిప్యూటీ సీఎం, సీఎం మాటలు. ఇద్దరూ ఎందుకు ఇలా మాట్లాడారో అని కాంగ్రెస్ శ్రేణులు ఆలోచనలో పడగా.. ఇప్పటికీ ఈ పథకం ఉంటుందో ఉండదో అనే దానిపై క్లారిటీ రావట్లేదు అని ఒకింత కంగారులోనే ఉన్నారు. నోటికి వచ్చినట్టు మాట్లాడటం ఏల..? రచ్చ జరిగిన తర్వాత మళ్ళీ సీఎం వివరణ.. దీనికి మళ్ళీ డిప్యూటీ సీఎం మాట్లాడటం ఎందుకో ఇవన్నీ..! తెలంగాణలో ఈ పథకం ఇప్పటికే అమలుకాగా ఆంధ్రాలో మాత్రం ఇంకా అమలు దిశగా అడుగులు పడలేదు. అమలు సంగతి తర్వాత ఇలా ఎవరికి తోచినట్టు వాళ్ళు మాట్లాడకపోతే అదే పదివేలు. ఇలాంటి విషయాల్లో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి.. మంత్రులు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది మరి.