అనుకున్నట్లే జరిగింది.. టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన నాటి నుంచి టీటీడీ చైర్మన్ పదవి, టీవీ5 అధినేత బీఆర్ నాయుడిని వరించబోతోందని పెద్ద ఎత్తున కథనాలు వచ్చాయి. ఇప్పటి వరకూ అవన్నీ రూమర్స్ అనుకున్నప్పటికీ బుధవారంతో నాటికి ఫుల్ క్లారిటీ వచ్చేసింది. తిరుమల తిరుపతి దేవస్థానం నూతన చైర్మన్‌గా బీఆర్ నాయుడును నియమిస్తూ ప్రభుత్వం అధికారిక ప్రకటన విడుదల చేసింది. దీంతో పాటు 24 మంది సభ్యులతో కొత్త పాలకమండలి కూడా ఏర్పాటైంది. ఇందులో టీడీపీకి సంబంధించి ఎక్కువ మంది సభ్యులుగా ఉండగా, జనసేన నుంచి డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నమ్మినబంటుగా ఉన్న ఆనంద సాయికి చోటు దక్కింది. తెలంగాణ నుంచి ఐదుగురు, కర్ణాటక నుంచి ముగ్గురు, మహారాష్ట్ర నుంచి ఒకరు, తమిళనాడు నుంచి ఇద్దరికి చోటు దక్కింది. ఎన్నికల అనంతరం వైసీపీకి గుడ్ బై చెప్పి టీడీపీలో చేరిన జంగా కృష్ణమూర్తి కూడా టీటీడీలో మెంబర్ అయ్యారు.
సభ్యులు వీరే..
జ్యోతుల నెహ్రూ, వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి, ఎమ్మెస్ రాజు, పనబాక లక్ష్మి, జాస్తి పూర్ణ సాంబశివరావు , నన్నూరి నర్సిరెడ్డి, శ్రీసదాశివరావు నన్నపనేని, కృష్ణమూర్తి, కోటేశ్వరరావు, మల్లెల రాజశేఖర్ గౌడ్, జంగా కృష్ణమూర్తి, దర్శన్. ఆర్.ఎన్ జస్టిస్ హెచ్‌ఎల్ దత్, శాంతారామ్, పి.రామ్మూర్తి, జానకీ దేవి తమ్మిశెట్టి, బూంగునూరు మహేందర్ రెడ్డి, అనుగోలు రంగశ్రీ, బూరగాపు ఆనందసాయి, సుచిత్ర ఎల్ల, నరేశ్‌కుమార్, డా.అదిత్ దేశాయ్, శ్రీసౌరబ్ హెచ్ బోరాలు టీటీడీ మెంబర్లుగా పాలకమండలిలో ఉన్నారు.
వివాదాల నడుమ..!
టీవీ5 బీఆర్ నాయుడు పదవి విషయంలో మొదట్నుంచి వ్యతిరేకత వస్తూనే ఉంది. అయితే ఆయన ఎందుకు చైర్మన్ కాకూడదు. వెంకటేశ్వరుడు అంటే అపారమైన భక్తి, తిరుమల ప్రాంతానికి చెందిన వ్యక్తి అని అధికార పార్టీ, సొంత చానెల్ నుంచి గట్టిగానే కౌంటర్లు వచ్చాయి. ఈ మధ్యనే డ్రగ్స్ డీలింగ్స్ అంటూ వైసీపీ లీకులు చేసి నానా రచ్చ చేసిన సంగతి తెలిసిందే. మొదట్నుంచీ అనుకుంటున్నట్లుగానే నాయుడినే, చంద్రబాబు నాయుడు ఎంపిక చేశారు. ప్రజలు, వైసీపీ నుంచి ఎలాంటి రియాక్షన్ వస్తుందో చూడాలి మరి.