వైసీపీ హయాంలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా తెచ్చిన సచివాలయ వ్యవస్థ అందరికీ గుర్తుండే ఉంటుంది. ప్రజల వద్దకే పాలన అంటూ గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యంను చేసి చూపించామంటూ వైసీపీ నేతలు ఎన్నో సందర్భాల్లో చెప్పుకున్నారు. ఈ వ్యవస్థతో లక్షలాది మంది ప్రజలు, పదులు, వందలసార్లు తిరిగి తిరిగి అలసిపోయే పరిస్థితి లేకుండా పోయింది. ఇవన్నీ ఒక ఎత్తయితే వైట్ కాలర్ ప్రమేయం లేకుండానే పోవడం శుభ పరిణామమే. 2019 అక్టోబర్ 2న గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థను వైఎస్ జగన్ ప్రవేశపెట్టారు. వైసీపీ అధికారంలో ఉన్నన్ని రోజులు నడిచిన ఈ వ్యవస్థ.. టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రశ్నార్థకంగా మారింది. వలంటీర్లు, సచివాలయ వ్యవస్థను అస్సలు టచ్ చేయబోమని, జీతాలు పెంచుతామని హామీ ఇచ్చారు. కానీ అది మాటలకే పరిమితం అయ్యిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పుడీ సచివాలయ వ్యవస్థను కూటమి ప్రభుత్వం ఏం చేయబోతోంది? అనేది ప్రశ్నార్థకంగా మారింది.
ఎవరికి వారే!
ఎన్నికల ముందు ఎన్నెన్నో ప్రస్తుత సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. అధికారంలోకి వచ్చాక ఆ ఊసే ఎత్తడం లేదు. అసలు సచివాలయ వ్యవస్థే తీసేస్తామని కొందరు, సచివాలయంలో ఎవరున్నా సరే బయటికి ఈడ్చి కొట్టండని మరొకరు బహిరంగంగా మాట్లాడుతున్న పరిస్థితి. ఇక పవన్ అయితే.. ఏకంగా గ్రామ పంచాయతీలకు పూర్వవైభవం తీసుకొస్తామని ఇందులో భాగంగా గ్రామ సచివాలయ వ్యవస్థ ప్రక్షాళన చేయబోతున్నారని తెలిసింది. రాష్ట్రంలో మొత్తం 13,065 గ్రామ పంచాయతీలు ఉండగా ఇందులో 15 వేలకు పైగా గ్రామ, వార్డు సచివాలయాలు ఉన్నాయి. ఇందులో పంచాయతీ కార్యదర్శి మొదలుకుని ఎడ్యకేషనల్ అసిస్టెంట్ వరకూ ఉంటారు. రేపొద్దున్న పంచాయతీల్లో విలీనం చేసేస్తారా? చేస్తే వీరి పరిస్థితేంటి? లేదా ప్రక్షాళన జరిగినా ప్రశ్నార్థకమే. ఇవన్నీ ఒకఎత్తయితే అధికారంలోకి వచ్చి నాలుగు నెలలు పూర్తయినా ఇంతవరకూ వలంటీర్ల వ్యవస్థపై ప్రభుత్వం తేల్చుకోలేకపోవడం గమనార్హం. అధికారంలోకి వస్తే 5వేల రూపాయిలను కాస్త 10వేలు చేస్తానన్న చంద్రబాబు.. పెంచుడు సంగతి దేవుడెరుగు.. ఉద్యోగమే లేకుండా పోయింది.
సర్దుబాటు ఉంటుందా?
గత కొన్నిరోజులుగా సచివాలయ ఉద్యోగులను తీసేస్తామని కొందరు చెబుతుంటే.. అదేమీ లేదు సర్దుబాటు చేస్తామని మరికొందరు చెబుతున్నారు. సర్దుబాటు చేస్తే ఎవరికి ఎక్కడ పోస్టింగ్‌లు ఇస్తారు..? ఎలా పోస్టింగులు ఇస్తారు..? పోనీ వీరికి అడ్మిన్ ఎవరు..? జీతాలు ఏ శాఖ నుంచి, మునుపటిలాగే అదే జీతం ఇస్తారా ఇవ్వరా..? ఇలా ఒకటా రెండా లెక్కలేనన్ని ప్రశ్నలు మెదులుతున్నాయి. మరోవైపు సచివాలయాలపై సర్పంచులకు అన్ని అధికారులు కల్పించాలని ఓ వైపు, అసలు ఆ వ్యవస్థే వద్దని ఇలా ఎవరికి తోచినట్లుగా వారు మాట్లాడుతున్నారు. దీంతో తమ పరిస్థితి కూడా వలంటీర్లు లాగా అవుతుందేమో అని సచివాలయ ఉద్యోగులు ఆందోళన చెందుతున్న పరిస్థితి. ఒకవేళ గ్రామ, వార్డు సచివాలయాలను రద్దు చేస్తే మాత్రం టీడీపీ కూటమి ప్రభుత్వానికి పెద్ద తలనొప్పే. ఈ వ్యవస్థను రద్దు చేయాలని చూసినా, ఆ దిశగా ప్రయత్నాలు చేసినా.. ప్రజలు, ఉద్యోగులు, వైసీపీ నుంచి పెద్ద ఎత్తున వ్యతిరేకత వస్తుందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదేమో. ఇప్పటికే వలంటీర్ వ్యవస్థ ప్రశ్నార్థకంగా మారడంతో కావాల్సినంత చెడ్డపేరు వచ్చి పడింది. సచివాలయ వ్యవస్థనే పక్కనెడితే మాత్రం అంతకుమించే ఉంటుంది. అసలు సచివాలయ వ్యవస్థ సంగతేంటి? ఉద్యోగుల పరిస్థితేంటి? అనేదానిపై సీఎం, డిప్యూటీ సీఎం క్లారిటీ ఇస్తే ఉద్యోగులు కాస్త ప్రశాంతంగా పనిచేసుకుంటారేమో.