తెలంగాణ లోని హైదరాబాద్ కు అతి సమీపంలోని చేవెళ్లలో రాజ్ పాకాల ఫాంహౌస్ రేవ్ పార్టీ ని పోలీసులు భగ్నం చేసిన విషయం తెలిసిందే. కేటీఆర్ బావమరిది ఈ ఫాంహౌస్ రేవ్ పార్టీ ని నిర్వహించారంటూ రాజకీయపార్టీలు దుమ్మెత్తిపోస్తున్నాయి. ఈ రేవ్ పార్టీలో డ్రగ్స్ అలాగే కర్ణాటక లిక్కర్ తో పాటు విదేశీ మద్యం కూడా స్వాధీనం చేసుకున్నట్లుగా పోలీసులు తెలుపుతున్నారు.
అయితే ఇది రేవ్ పార్టీ కాదు దీపావళి సందర్భంగా రాజ్ పాకాల బంధువులకు పార్టీ ఇచ్చారని, రాజ్ పాకాల గృహ ప్రవేశం సందర్భంగా పార్టీ ఇచ్చారంటూ బీఆర్ఎస్ నేతలు వాదిస్తున్నారు. రేవ్ పార్టీ కేసులో ఏ1గా ఫాంహౌస్ సూపర్ వైజర్ కార్తిక్, ఏ2గా రాజ్ పాకాలను చేర్చామని సీఐ శ్రీలత చెప్పారు. ఏడు లీటర్ల విదేశీ మద్యాన్ని సీజ్ చేశామని ఆమె తెలిపారు.
ప్రస్తుతం ఫామ్ హౌస్ యజమాని, మాజీ మంత్రి కేటీఆర్ బంధువు అయిన రాజ్ పాకాల పరారీలో ఉన్నట్లుగా చెబుతున్నారు. మరోపక్క కేటీఆర్ భార్య ఈపార్టీలో ఉంది అంటూ కొన్ని ఛానల్స్ లో ప్రచారం మొదలైంది. కేటీఆర్ కు ఈ పార్టీకి సంబంధం లేకపోతే ఆయన భార్య ఈ పార్టీకి ఎలా వస్తుంది అని కాంగ్రెస్ నేతలు వాదిస్తుంటే.. ఇది ప్రభుత్వ కక్ష పూరిత చర్య అని బీఆర్ఎస్ నేతలు మాట్లాడుతున్నారు.